– ఎన్టీఆర్‌కు పరమ భక్తుడు
– గోపీనాథ్ అకాల మరణం తీరని లోటు : సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సీఎం రేవంత్‌రెడ్డి
– అసెంబ్లీ ఘననివాళి, నేటికి వాయిదా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఉండి ఇటీవల మరణించిన మాగంటి గోపీనాథ్ చూడటానికి చాలా క్లాస్‌గా కనిపించినా..ఆయన ఆ నియోజకవర్గంలో మాస్ లీడర్‌గా పేరొందారని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి కొనియాడారు. ఆయన అకాల మరణం సభకు తీరని లోటు అని చెబుతూ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. శాసనసభ వర్షాకాల సమావేశాలు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన శనివారం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే సీఎం రేవంత్‌రెడ్డి..మాగంటి గోపీనాథ్ మృతికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోపీనాథ్ విద్యార్థిగా ఉన్న సమయంలోనే 1983 నుంచి టీడీపీలో చురుగ్గా ఉండేవారనీ, 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారని గుర్తుచేశారు. 1987-88లో హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ డైరెక్టర్‌గా, 1988-93 లో జిల్లా వినియోగదారుల ఫోరం బాధ్యులుగా సేవలందించారని తెలిపారు. సినీరంగంలో నిర్మాతగా రాణించారన్నారు. పార్టీలు వేరైనా మాగంటి గోపినాథ్ వ్యక్తిగతంగా తనకు మంచి మిత్రుడని చెప్పారు. వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఘనత సాధించిన వారిలో ఆయన ఒకరని కొనియాడారు. ఆయన మృతి బాధాకరమని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ…గోపీనాథ్ మరణం దిగ్భ్రాంతికరమన్నారు. ఆయన మానవతావాది, మృదుస్వభావి, నిజాయితీపరుడు అని కొనియాడారు. ఆయన కుటుంబంతో తనకున్న సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సభలో గోపీనాథ్ లేని లోటు కనిపిస్తోందన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బీఆర్‌ఎస్ సభ్యులు కే.తారకరామారావు(కేటీఆర్) మాట్లాడుతూ…తమ పార్టీ హైదరాబాద్ నగర అధ్యక్షులుగా ఉన్న గోపీనాథ్ మృతికి సంతాపం ప్రకటించాల్సి రావడం బాధాకరంగా ఉందన్నారు. నగరంలో కటౌట్ల కల్చర్ తీసుకొచ్చింది ఆయనేనన్నారు. ఆయన ఆరోగ్య, వ్యక్తిగత, కుటుంబ విషయాలను పెద్దగా ఎవరితోనూ పంచుకునేవారు కాదనీ, నిరంతరం ప్రజా సేవ గురించే ఆలోచించేవారని కొనియాడారు. బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతి ఏటా మహిళలకు చీరలను పంచుతూ వస్తున్నారనీ, ఆయన స్ఫూర్తితోనే రాష్ట్ర వ్యాప్తంగా ఆ కార్యక్రమాన్ని విస్తరించామని తెలిపారు. గోపీనాథ్ కుటుంబానికి తమ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
సీపీఐ సభ్యులు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ..గోపీనాథ్ మృతి బాధాకరమన్నారు. ఆయన మంచి ఆర్గనైజర్ అని చెప్పారు. అందరితోనూ కలివిడిగా ఉండేవారన్నారు. ఎంఐఎం సభ్యులు బలాల మాట్లాడుతూ..మాగంటి సౌమ్యుడనీ, తన పనితాను చేసుకుంటూ పోయేవాడని గుర్తుచేశారు. సాధారణ జీవితం గడుపుతూ జూబ్లీహిల్స్ ప్రజల మనస్సును వరుసగా మూడుసార్లు గెలిచాడన్నారు. బీజేపీ సభ్యులు వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ..ఎన్టీఆర్‌ను గోపీనాథ్ ఆరాధించేవారని గుర్తుచేశారు. ప్రజల గుండెల్లో గోపీనాథ్ చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. సతీమణి సునీత, ముగ్గురు పిల్లలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సంతాప తీర్మానంపై స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, పొన్నం ప్రభాకర్, బీఆర్‌ఎస్ సభ్యులు తలసాని శ్రీనివాస్, కేపీ.వివేకానంద, ప్రశాంత్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, ముఠాగోపాల్ మాట్లాడారు. అనంతరం గోపీనాథ్ మృతికి శాసనసభ సభ్యులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం సభను ఆదివారం ఉదయం 9 గంటలకు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ప్రకటించారు.
మాగంటి క్లాస్ అయినా మాస్ లీడరే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES