మహిళలు గ్రంథిపరమైన సమస్యలతో మగవారికన్నా ఆరేడు శాతం ఎక్కువగా బాధపడుతుంటారు. థైరాయిడ్ గ్రంథి మెడ మధ్యభాగంలో, సీతాకోక చిలుక ఆకారంలో ఉండే ఒక వినాళ (ఎండోక్రైన్) గ్రంథి. ఇస్తమస్ అనబడే భాగంతో కలుపబడి, శ్వాస నాళానికి ముందు వైపు రెండు తమ్మెలుగా చాచుకొని ఉంటుంది. దీనిని తెలుగులో అవటు గ్రంథి అని అంటారు. ఇది శరీరంలోని వినాళ గ్రంథులలో అతి ముఖ్యమైన గ్రంథులలో ఒకటి. అంతే కాకుండా అతి పెద్దది కూడానూ! ఇది శారీరక ఎదుగుదలకు ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీని పనితీరు కుంటుపడితే మాత్రం ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించిపోవచ్చు.
ఏమిటి దీని పనితీరు?
ఆహారం నుండి రక్తంలోనికి విడుదలై ప్రవహిస్తున్న అయోడిన్‌ను థైరాయిడ్ గ్రంథి గ్రహించి టైరోసిన్ అనే ఒక అమినోయాసిడ్ సహాయంతో ధైరాక్సిన్;(టి-4) అనే హార్మోన్ని స్రవిస్తుంది. ఇది లివర్, కిడ్నీలో ట్రైఐడో టైరోనిన్ (టి-3)గా మార్పు చెందుతుంది. టి3, టి4 అనేవి అవయవాల జీవక్రియలకు సంబంధించిన హార్మోన్లు. ఇవి శరీరంలోని ప్రతి కణాన్ని ప్రభావితం చేస్తాయి. మెదడులో ఉండే పియూష (పిట్యూటరీ) గ్రంథి; స్రవించే అవటుగ్రంథి ఉద్దీపన హార్మోన్ (థైరాయిడ్ స్టిములేటింగ్ హార్మోన్-టీఎస్‌ఎచ్) ద్వారా థైరాక్సిన్ స్రవప్రక్రియను క్రమ బద్దీకరిస్తుంది. సాధారణంగా ఈ మూడు హార్మోన్లు (టి3, టి4, టీఎస్‌హెచ్) పరీక్షలు ఆడవారికి, ముఖ్యంగా బరువు తగ్గినా/ఊబకాయం/గైనిక్ సమస్యలున్న వారికి చేయిస్తారు. ఇవి కాక అవటు గ్రంథి శరీరంలోని కాల్షియం స్థాయిని నియంత్రించే కాల్సిటోనిన్ అనే హార్మోన్‌ని కూడా స్రవిస్తుంది. ఎముకలకు అవసరమయ్యే కాల్షియం సమతుల్యతను కాల్సిటోనిన్ హార్మోన్ ద్వారా సమర్థవంతంగా కాపాడుతుంది.
ఒక దీర్ఘకాలిక సమస్య
థైరాయిడ్ గ్రంథి హార్మోన్ల కారణంగానే మానవ శరీరంలో జీవక్రియలు, అభివృద్ధి సక్రమంగా జరుగుతాయి. దీనిలో ఏదైనా సమస్య ఏర్పడితే అది మొత్తం శరీర విధులను ప్రభావితం చేస్తుంది. మెదడు ఎదుగుదల, పనితీరు, హృదయ స్పందన, మానసికస్థితి, శరీరంలో శక్తి స్థాయిలు, జీవక్రియలు, ఎముకల ఆరోగ్యం, గర్భధారణ, శరీర ఉష్ణోగ్రత, కొవ్వు నియంత్రణలో సమస్యలు తలెత్తవచ్చు. థైరాయిడ్ వ్యాధి ఒక దీర్ఘకాలిక సమస్య. ఈ వ్యాధితో బాధపడే వారు అనేక రకమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటుంటారు. వ్యాధి కారణంగా థైరాక్సిన్, హార్మోన్ స్రావం తక్కువైనప్పుడు హైపో థైరాయిడిజం, ఎక్కువైనప్పుడు హైపర్ థైరాయిడిజం అనేవి శరీరంలో ఏర్పడుతాయి.
ఈ రెండు స్థితుల సూచికలు?
హైపోథైరాయిడిజం: నీరసం, మలబద్ధకం, చర్మం పొడిబారడం, ఆకలి మందగించడం, బరువు పెరగడం, నిద్రలేమి, నెలసరి ఇబ్బందులు, చలిని తట్టుకోలేక పోవడం, గుండె సాధారణం కంటే తక్కువ సార్లు కొట్టుకోవడం వంటి సమస్యలుండొచ్చు.
థైరాయిడ్ గ్రంథి వాపు – గోయిటర్: ఆహారంలో అయోడిన్ కొరత ఏర్పడినందువల్ల పియూష గ్రంథి థైరాయిడ్ స్టిములేటింగ్ హార్మోన్ని ఎక్కువ పాళ్ళలో విడుదల చేయడం జరుగుతుంది. తద్వారా థైరాయిడ్ గ్రంథి పైన ఒత్తిడి పెరిగి, దానిలో వాపు వచ్చి, మెడలు ఉబ్బినట్టుగా కనిపిస్తుంది.
హైపర్ థైరాయిడిజం: ఆకలి ఎక్కువగా అవ్వడం, బరువు తగ్గడం, చెమటలు ఎక్కువ పట్టడం, చిరాకు, స్థిమితం లేకపోవడం, నిద్ర లేమి, నీరసం, ఎక్కువసార్లు విరోచనాలు అవ్వడం, నెలసరిలో రక్తస్రావం, థైరాయిడ్ గ్రంథి వాపు, గుండె దడ అనిపించడం, చేతులు వణకడం హైపర్ థైరాయిడిజం ముఖ్య లక్షణాలు. ఈ లక్షణాలతో పాటు కండరాల బలహీనత, ఎప్పుడూ అలసటగా ఉండటం, ఊబకాయం, అధిక రక్తపోటు, జుట్టు రాలటం, సంతాన లేమి వంటి అనేక సమస్యలు థైరాయిడ్ అసాధారణతల వల్ల కలుగుతాయి. అంతే కాకుండా అరుదుగా ఈ గ్రంథిలో కాన్సర్ రావచ్చు.
థైరాయిడ్ క్యాన్సర్: ఇది థైరాయిడ్ గ్రంథిని ప్రభావితం చేసే ఒక అరుదైన క్యాన్సర్. మెడ భాగంలో ముద్దలా ఉండటం, గొంతు బొంగురుపోవడం, మింగడంలో ఇబ్బంది, ఊపిరి ఆడకపోవడం వంటివి థైరాయిడ్ క్యాన్సర్ ప్రధాన లక్షణాలు. ఈ క్యాన్సర్‌ను సర్జరీ, రేడియేషన్ థెరపీ లేదా కీమో థెరపీ వంటి ఆధునిక చికిత్సలతో నయం చేయవచ్చు.
థైరాయిడ్ గ్రంథి వ్యాధికి కారణాలు?
జన్యుపరమైనవి, ఆహారంలో అయోడిన్ కొరత/లోపం, థైరాయిడ్ గ్రంథి వాపుకు గురవ్వడం, ప్రసవానంతర థైరాయిడిటిస్, ఆటో ఇమ్యూన్ వ్యాధులు (హషిమోటోస్ థైరాయిడిటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, టైప్-1 మధుమేహం, లూపస్) వంటి అనేక అనారోగ్యాలు ఉన్న వారిలో థైరాయిడ్ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది.
వ్యాధి నియంత్రణ
ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం. విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండేటటువంటి సమతుల్య ఆహారం తీసుకోవాలి. థైరాయిడ్ సమస్య ఉన్న వారు శరీర బరువును అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం అలవర్చుకోవాలి. వ్యాయామం చేయడమే కాకుండా ఒత్తిడి, ఆందోళనలను అదుపులో ఉంచుకోవాలి. థైరాయిడ్ హార్మోన్ సరిగ్గా ఉత్పత్తి కావడానికి అయోడిన్ చాలా అవసరం. ఆహారంలో అయోడిన్ తగినంతగా లేకపోతే థైరాయిడ్ హార్మోన్ అనేది అవసరమైనంత విడుదల కాదు, దీనితో థైరాయిడ్ వాపుకు గురవుతుంది. ఆహారం ద్వారా శరీరానికి తగు మోతాదులో అయోడిన్ అందేటట్లు జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. అందుకు ఐయొడైజ్డ్ ఉప్పు వాడకం మంచిది. పాలు, పెరుగు, గుడ్లు, చేపలు, రొయ్యలు, అరటిపళ్ళు, జీడిపప్పు, బాదాం పప్పు, అక్రోట్-అయోడిన్ సమృద్ధిగా దొరికే మంచి మూలాలు.
చికిత్స?
థైరాయిడ్ గ్రంథికి సంబంధించిన సమస్యలన్నిటికీ దాదాపుగా మందులు, అధునాతనమైన శాస్త్ర చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. సకాలంలో సరైన వైద్యంతో సమస్యను పరిష్కరించుకోవడం కష్టతరమేమీ కాదు. థైరాయిడ్ గ్రంథిలో వాపు లేదా పైన పేర్కొన్న వ్యాధి సూచికలు ఉన్నట్టుగా అనిపిస్తే వైద్యులను సంప్రదించడం చాలా అవసరం. గొంతు ముందు భాగంలో గడ్డ లాగా లేక వాపు లాగా ఉంటే నిర్లక్ష్యం చేయకుండా పరీక్షలు చేయించుకోవాలి. థైరాయిడ్ అనేది కుటుంబంలో ఎవరికైనా ఉంటే వంశపారపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వారు ప్రతి ఆరు నెలలకు ఒక్కసారి వైద్యుల సూచన ప్రకారం పరీక్షలు చేయించుకోవడం మంచిది. వ్యాధి తీవ్రతరం కాకముందే సరైన మందులను వాడుతూ ఉండటం వలన థైరాయిడ్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులను అరికట్టడం సాధ్యమే!
- డా|| మీరా, ఎం.డి. రిటైర్డ్ ప్రొఫెసర్, ఉస్మానియా మెడికల్ కాలేజ్


