Sunday, October 12, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుశ్మశానాలనూ వదలట్లేదు

శ్మశానాలనూ వదలట్లేదు

- Advertisement -

కబ్జాకు పాల్పడుతున్న అక్రమార్కులు.. యథేచ్ఛగా మోరం తవ్వి దందా
శవాలు తేలినా పట్టని వైనం
ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం మెలిగిరిపేట, హనుమాన్‌నగర్‌లో దుస్థితి

నవతెలంగాణ- మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
అక్రమార్కులు శ్మశానాలనూ వదలట్లేదు. ఆ స్థలాలనూ కబ్జా చేస్తున్నారు. అంతేకాక శవాలను పూడ్చిపెట్టిన మట్టిపైనా కన్నేశారు. తవ్వకాల్లో ఎముకలు తేలుతున్నా పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఆ అస్థిపంజరాలను పక్కకు పడేసి మరీ యథేచ్ఛగా మట్టిని తవ్వి విక్రయిస్తున్నారు. రాత్రివేళల్లో సాగుతున్న ఈ అక్రమ మట్టి దందా విషయం సంబంధిత అధికారులకు తెలిసినా మౌనంగా ఉంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల పరిధిలోని మెలిగిరిపేట గ్రామ శ్మశాన వాటికకు 108 సర్వే నంబర్‌లో మూడు గుంటల భూమిని కేటాయించారు.

అయితే, ఈ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఏకంగా ఆ శ్మశానవాటిక స్థలాన్ని ఆక్రమించి షెడ్డు నిర్మించారు. అదే సర్వేనంబర్‌ పక్కన గల 109 సర్వే నంబర్‌లో దళితులకు ఇండ్లస్థలాల కోసం కేటాయించిన భూమిని కూడా ఆక్రమించుకున్నారు. దీనిపై మెలిగిరిపేట గ్రామ దళితులు సదాశివపేట మండల డిప్యూటీ తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. అదే విధంగా సంగారెడ్డి మండల పరిధిలోని హనుమాన్‌ నగర్‌లో శ్మశానవాటికలోనే అక్రమార్కులు మట్టిని తవ్వి విక్రయిస్తున్నారు. ఈ శ్మశాన వాటిక గ్రామ సమీపంలోని చెరువు పక్కనే ఉంది. చెరువును పూర్తిగా తవ్వేసిన వ్యాపారుల కన్ను పక్కనే ఉన్న శ్మశానవాటికపై పడింది. అక్కడ మట్టిని తవ్వే క్రమంలో అస్థిపంజరాలు బయటపడుతున్నా పట్టించుకోవడం లేదు.

రాత్రి వేళల్లో మట్టి తవ్వకాలు
సంగారెడ్డి జిల్లాలో మట్టి, ఇసుక వ్యాపారులు రోజు రోజుకూ రెచ్చిపోతున్నారు. రాత్రి వేళల్లో జేసీబీల సహాయంతో చెరువులు, కుంటల్లో తవ్వడమే కాకుండా వాటి పక్కన ఉన్న శ్మశానవాటికలను కూడా వదలడం లేదు. మట్టి దందాకు హనుమాన్‌ నగర్‌ శ్మశానవాటిక బలైంది. రాత్రివేళల్లో జరుగుతున్న ఈ అక్రమ మట్టి దందాపై రెవెన్యూ అధికారులు, పంచాయతీ అధికారులకు తెలిసినా మౌనంగా ఉంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

అధికారులకు తెలిసినా చర్యలు శూన్యం
మట్టిదందా నిర్వాహకులు రెవెన్యూ అధికారుల కు నెలవారీగా తాయిలాలు సమర్పించుకోవడం వల్లే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని హనుమాన్‌నగర్‌ కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. మట్టిదందాపై వ్యాపారులను ప్రశ్నిస్తే బెదిరించడంతో పాటు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోతున్నారు. అంతేకాక శ్మశానవాటిక నుంచి రాత్రిపూట మట్టిని తరలించుకుపోవడంపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పలువురు ఆవేదన చెందుతున్నారు. రాజకీయ పార్టీల పెద్ద నేతల అండదండలతోనే అక్రమార్కులు రెచ్చిపోతున్నారని ఆరోపించారు.

శ్మశాన వాటిక స్థలాన్ని కాపాడాలి.. మ్యాతరి ప్రేమల, మెలిగిరిపేట
సదాశివపేట మండలం మెలిగిరిపేటలో దళితుల శ్మశానవాటిక కబ్జాకు గురైంది. అధికారులు స్పందించి ఆ స్థలాన్ని కాపాడాలి. అదే విధంగా సర్వేనంబర్‌ 108లోని మూడు గుంటల శ్మశానవాటిక స్థలాన్ని ఆక్రమించి షెడ్డు నిర్మించారు. సర్వేనంబర్‌ 109లో దళిత, బలహీన వర్గాల కోసం ఇండ్ల స్థలాలకు ఇచ్చిన ఖాళీ స్థలంలో ఇటీవల కొంతమంది చదును చేసి కడీలు పాతి కబ్జా చేశారు. అంతేకాక దానిపై నకిలీ పత్రాలు సృష్టించే యత్నం చేస్తున్నారు. ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేశాం.దళితుల భూమి కబ్జా కాకుండా చర్యలు తీసుకోవాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -