Friday, September 19, 2025
E-PAPER
Homeమానవిదృష్టిని కోల్పోయినా.. లక్ష్యాన్ని చేరుకుంది

దృష్టిని కోల్పోయినా.. లక్ష్యాన్ని చేరుకుంది

- Advertisement -

రజనీ గోపాలకృష్ణ… తొమ్మిదేండ్ల వయసులో జలుబుకు ఉపయోగించిన పెన్సిలిన్‌ కారణంగా కళ్లకు సంబంధించిన సమస్యను ఎదుర్కొంది. 18 ఏండ్ల వయసులో తీవ్రమైన కంటి అలెర్జీ క్రమంగా ఆమె చూపును మింగేసింది. కానీ జీవితాన్ని ఆమె చూసే దృష్టి మాత్రం కోల్పోలేదు. తన పరిస్థితికి కుంగిపోకుండా చార్టర్డ్‌ అకౌంటెన్సీని అభ్యసించింది. పరీక్షలకు హాజరై ఉత్తీర్ణత సాధించింది. ఇప్పుడు భారతదేశపు తొలి అంధ మహిళా చార్డర్డ్‌ అకౌంటెంట్‌గా చరిత్ర సృష్టించిన ఆమెతో మానవి సంభాషణ…

రజనీ తన బ్యాచిలర్‌ ఆఫ్‌ కామర్స్‌ డిగ్రీ పూర్తి చేసే సమయానికి కుడి కంటి దృష్టిని పూర్తిగా కోల్పోయింది. ఎడమ కంటిలో దృష్టి తగ్గుతోంది. వైకల్యం వెంటాడినా అర్థవంతమైన భవిష్యత్తును నిర్మించుకోవాలనే దృఢ సంకల్పంతో, దృష్టి కోల్పోయినప్పటికీ చార్టర్డ్‌ అకౌంటెన్సీ (సీఏ)ని ఎంచుకుంది. అయితే సీఏ అర్హత సంపాదించినప్పటికీ ఉద్యోగం కోసం ఆమె చాలా కష్టపడ్డారు. కంటి చూపులేని ఆమెను నియమించుకోవడానికి చాలామంది వెనుకాడారు. అయినా పట్టుదలతో ఆమె ఉద్యోగాన్ని సంపాదించుకుంది. అయితే డిసెంబర్‌ 3న అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం వచ్చిందంటే చాలు రాజకీయ నాయకులు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. కానీ వారు కోరుకునేది వినూత్నమైన ప్రచారం కాదు వారికి అర్థవం తమైన పని, అవకాశాలు అంటారు రజని.

గ్రాడ్యుయేషన్‌కు మించి
‘చార్టర్డ్‌ అకౌంటెంట్‌ (సీఏ)గా నా ప్రయాణం నాకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే అది నేను చూపు కోల్పోయిన తర్వాత ప్రారంభమైంది. నా సమస్యను నేను అర్థం చేసుకున్న తర్వాత గ్రాడ్యుయేషన్‌కు మించి ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాను. బి.కాంతో నేను ఆశించిన ఉద్యోగాన్ని పొందే అవకాశం తక్కువ. ఉన్నత చదువుతో మంచి ఉపాధి పొందే అవకాశాలు ఉంటాయి’ అంటూ ఆమె పంచుకున్నారు. సీఏ కోసం సన్నాహాలు ప్రారంభించే సమయానికి ఆమె కుడి కంటిలో దృష్టిని పూర్తిగా కోల్పోయారు. ఎడమ కంటిలో చూపు తగ్గుతోంది.

ఏడేండ్ల విరామం
‘నా సీఏ చదువు సమయంలో నా రెండు కళ్లు దృష్టిని పూర్తిగా కోల్పోయాయి. ఇది 1993లో నేను నా సీఏ ఇంటర్మీడియట్‌ పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు జరిగింది. దృష్టిని కోల్పోవడం నాకు ఓ పెద్ద ఎదురుదెబ్బ’ అని ఆమె చెప్పారు. ఈ కారణంగా ఆమె చదువుకు ఏడేండ్లు విరామం తీసుకున్నారు. 2002లో దృష్టిని కోల్పోయినప్పటికీ రజని తన సీఏ ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించారు. టెక్నాలజీని వినియోగించుకున్నారు. స్క్రీన్‌-రీడింగ్‌ సాఫ్ట్‌వేర్‌, వాలంటీర్‌ స్క్రైబ్‌ల సహాయంతో పరీక్షలలో ఉత్తీర్ణత సాధించారు. అర్హత సాధించడంతోనే ఆమె ప్రయాణం ఆగిపోలేదు. ఉద్యోగం సంపాదించడం సవాలుగా మారింది. ఆమెలోని నైపుణ్యం నచ్చినప్పటికీ వైకల్యం వల్ల చాలా మంది ఆమెకు ఉద్యోగం ఇవ్వడానికి వెనుకాడారు. పట్టుదలతో ఓ స్నేహితుడి మద్దతు ద్వారా 2003లో ఉద్యోగం సంపాదించారు.

సామాజిక మార్పుకై
రజని బెంగళూరులో కమ్యూనిటీ కోఆర్డినేటర్‌గా దృష్టి లోపం ఉన్న, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు మద్దతుగా తన కెరీర్‌ను ప్రారంభించారు. తర్వాత ఇన్ఫోసిస్‌కు మారారు. కార్పొరేట్‌ సంస్థలో అడుగుపెట్టినప్పటికీ సమాజాన్ని ప్రభావితం చేసే ఓ బలమైన పిలుపునిచ్చారు. చివరికి ఆమె ఓ ఎన్‌జీఓకు మారారు. వృత్తిపరమైన నైపుణ్యాలను సామాజిక మార్పు పట్ల ఆమెకున్న మక్కువతో మిళితం చేశారు. ఒక ఎన్‌జీఓలో సీనియర్‌ ఫైనాన్స్‌ మేనేజర్‌గా పని చేస్తూ నిజమైన ఆనందాన్ని పొందారు. తన లక్ష్యం వైపుగా పని చేస్తున్నందుకు తృప్తి చెందారు.

సాధారణ వ్యక్తులకు మించి
‘యజమానులు చూపే పక్షపాతం ఇబ్బందికరంగానే ఉంటుంది. కానీ పట్టుదల, నమ్మకం, ఇతరుల మద్దతు కోరుకోవడంతో అడ్డంకులను ఛేదించి విజయాలు సాధించవచ్చు. వైకల్యం ఉన్న వ్యక్తి గురించి అందరూ ఎలా ఆలోచిస్తారు? వారు ఏమీ చేయాలేరనే అనుకుంటారు. కానీ అలాంటి వారే అసాధారణమైనవి సాధిస్తున్నారు. సాధారణ వ్యక్తులకు మించి విజయాలు అందుకుంటున్నారు, గుర్తింపు పొందుతున్నారు’ అంటున్నారు రజని. దృష్టి ఉన్నప్పుడు ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రపంచాన్ని చూస్తారు. వీరు గ్రాడ్యుయేషన్‌ లేదా ఇతర అర్హతలు పూర్తి చేయడం సులభం అనిపిస్తుంది. అయితే వైకల్యం ఉన్న వ్యక్తి దాన్ని సాధించడానికి శారీరక పరిమితులు, సామాజిక పక్షపాతాలను అధిగమించాలి. ఈ విజయం వారి సంకల్పానికి చిహ్నంగా ఉంటుంది.

సాధికారత సాధనంగా సాంకేతికత
‘నాలాంటి వ్యక్తులకు సాంకేతికత ఒక గేమ్‌-ఛేంజర్‌గా మారింది. దృష్టిని కోల్పోయిన కొత్తలో దీన్ని ఎలా అలవాటు చేసుకోవాలో నాకు తెలియదు. స్క్రీన్‌-రీడింగ్‌ సాఫ్ట్‌వేర్‌ లేకపోతే నేను నా చదువును కొనసాగించలేకపోయేదాన్ని. నా కెరీర్‌లో ముందుకు సాగలేకపోయేదాన్ని. సాంకేతికత ఆ అంతరాన్ని తగ్గించింది. దృష్టి లోపం ఉన్న వ్యక్తులు శారీరక వైకల్యాలు లేని వ్యక్తుల మాదిరిగానే కంప్యూటర్‌లను యాక్సెస్‌ చేయడానికి, పనులు చేయడానికి టెక్నాలజీ వీలు కల్పించింది. అయితే ప్రస్తుత సాంకేతికతకు కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి’ అని రజని చెప్పారు.

లోటును భర్తీ చేస్తున్నాయి
‘స్క్రీన్‌-రీడింగ్‌ సాఫ్ట్‌వేర్‌ ఇతరులు చేయగలిగే దానిలో దాదాపు 60-70శాతం సాధించడానికి మాకు వీలు కల్పిస్తుంది. కానీ ఏఐ వంటివి ఆ లోటును కూడా భర్తీ చేస్తున్నాయి. ఉదాహరణకు గతంలో నేను రెస్టారెంట్‌కు వెళితే మెనూ కోసం ఇతరుల సహాయం అవసరం. ఇప్పుడు ఏఐ-ఆధారిత యాప్‌ల ద్వారా స్వతంత్రంగా ఎంచుకుంటున్నాను. కాలక్రమేణా మెరుగుపడుతున్నాం. నేను చార్టర్డ్‌ అకౌంటెన్సీ చదివేటప్పుడు సాఫ్ట్‌ కాపీలు అందుబాటులో ఉండేవి కావు. పుస్తకాలను స్కాన్‌ చేయడం, వాటిని అవసరమైన ఫార్మాట్‌లకు మార్చడంపై ఆధారపడవలసి వచ్చింది. నేడు అనేక విద్యా సంస్థలు ఇ-పుస్తకాలను అందిస్తున్నాయి. అంతేకాదు వైకల్యం ఉండి ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం ల్యాప్‌టాప్‌లు వంటివి ప్రభుత్వాలు అందిస్తున్నాయి. ఇది ఒక మంచి పరిణామం’ అంటూ ఆమె పంచుకున్నారు.

సవాళ్లను అధిగమిస్తే…
పురోగతులు ఉన్నప్పటికీ వైకల్యం ఉన్న వ్యక్తులకు గణనీయమైన సవాళ్లు కూడా ఉన్నాయని రజని అంటున్నారు. ‘వెబ్‌సైట్‌ డెవలపర్లు తరచుగా మమ్మల్ని విస్మరిస్తారు. ఉదాహరణకు వినియోగదారులు రోబోలు కాదని ధృవీకరించడానికి ఉపయోగించే చిత్రాలు దృష్టి లోపం ఉన్న వ్యక్తులకు తీవ్ర అవరోధంగా ఉంటాయి. అలాగే సహాయం లేకుండా బ్యాంక్‌ ఖాతాలు, ఉద్యోగుల పోర్టల్‌లను యాక్సెస్‌ చేయడం కూడా దాదాపు అసాధ్యం అవుతుంది. ఈ సమస్య డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లకే పరిమితం కాదు. కిరాణా సామాగ్రి, మందులు కొనడం లేదా ఆరోగ్య సంరక్షణ సేవలను పొందడం వంటి రోజువారీ పనులు ఇప్పటికీ ఒక సవాలుగానే ఉన్నాయి. ఫార్మసీలు, క్లినిక్‌లు, ఆసుపత్రులు తరచుగా దృష్టి లోపం ఉన్న వ్యక్తులకు వసతి కల్పించడానికి సిద్ధంగా ఉండవు. అలాగే ర్యాంప్‌లు కూడా దృష్టిలోపం ఉన్న వారికి అనుకూలంగా ఉండడం లేదు. వీటన్నింటినీ పరిష్కరించినప్పుడే వికలాంగులు నిజమైన సాధికారత సాధించగలరని రజనీ నమ్ముతున్నారు.

సలీమ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -