ప్రతి సంవత్సరం రమజాన్ నెల రాగానే దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన వాతావరణం ఏర్పడుతుంది. ఉదయాన్నే మసీదుల నుంచి వినిపించే ప్రార్థనల పిలుపు, సాయంత్రం ఇఫ్తార్ వేళ పంచుకునే ఆహారం, రాత్రిళ్లు వెలుగులతో మెరిసే వీధులు… ఇవన్నీ ఒక ఆధ్యాత్మిక చైతన్యాన్ని మాత్రమే కాదు, ఒక సామాజిక సందేశాన్ని కూడా ఇస్తాయి. ఆ సందేశమే… ‘సామరస్యం, సహజీవనం’.
రమజాన్ కేవలం ఒక మతపరమైన ఆచారం మాత్రమే కాదు; అది సమాజాన్ని దగ్గర చేసే సామాజిక వేదిక కూడా. ఉపవాసం పాటించే ముస్లింలతో కలిసి, పక్క పక్కనే కూర్చొని, ఇతర మతాల ప్రజలు ఇఫ్తార్ విందుల్లో పాల్గొనడం, పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకోవడం మన సమాజంలోని సహజీవన స్ఫూర్తికి బలమైన సాక్ష్యం.
భారతదేశం అనేక కులాలు, మతాలు, భాషలు, సంస్కతుల సమ్మేళనం. హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవ, జైన, బౌద్ధ, పారశీ సంప్రదాయాలు ఒకే నేలపై సహజీవనం చేస్తున్నాయి. ఈ విభిన్నత మధ్య సమతుల్యతను నిలబెట్టేది పరస్పర గౌరవం. మన రాజ్యాంగం ప్రతి పౌరుడికి మత స్వేచ్ఛను హామీ ఇస్తుంది. అది మతాన్ని మించిన దేశభక్తిని, సామాజిక సమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది. ప్రతి పండుగను ఒకరికొకరు పరస్పరం పంచుకోవడం భారతీయ సంస్కతిలో అంతర్భాగం. రమజాన్ సందర్భంలో అనేక మంది ఇతర మతాల సోదరులు ఇఫ్తార్ వేడుకల్లో పాల్గొనడం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.
సమాజం వేగంగా మారుతోంది. సోషల్ మీడియా విస్తరణతో సమాచార ప్రవాహం పెరిగింది. అదే సమయంలో అపోహలు, విద్వేష ప్రచారాలు కూడా పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో మత సామరస్యం అత్యవసరం. మతపరమైన వైవిధ్యాన్ని బలహీనతగా కాకుండా బలమైన శక్తిగా చూడాలి. భిన్నత్వం మన సమాజానికి రంగులద్దుతుంది. ఒకే రకమైన పుష్పాలతో తోట అందంగా ఉండదు; రకరకాల పూలతోనే అది సొబగులు చిందిస్తుంది. అదే విధంగా, భిన్న విశ్వాసాలు కలిసిన చోటే నాగరికత వికసిస్తుంది.
రమజాన్ ప్రధాన సందేశం ‘పంచుకోవడం’. ఉపవాసం ద్వారా ఆకలి బాధను అనుభవించి, సమాజంలోని నిరుపేదల పరిస్థితిని అర్థం చేసుకోవడం ఈ నెలలో ఒక సామాజిక పాఠం. ఇఫ్తార్ విందుల్లో మత భేదాలు మాసిపోతాయి. ఒకే టేబుల్ వద్ద వేర్వేరు విశ్వాసాల వారు కలిసి కూర్చుని భోజనం చేయడం సామరస్యానికి సంకేతం. అనేక నగరాల్లో ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలు సమిష్టి ఇఫ్తార్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమాలు మతాల మధ్య సామరస్య వేదికలుగా మారుతున్నాయి. పరస్పర అవగాహన పెరిగితే అపోహలు తగ్గుతాయి; అపోహలు తగ్గితే అవిశ్వాసం పటాపంచలవుతుంది.
మన చరిత్రలో అనేక సందర్భాల్లో మత సామరస్యం దేశాన్ని కాపాడింది. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో హిందూ – ముస్లిం ఐక్యత ఒక ప్రధాన శక్తిగా నిలిచింది. లక్ష్యం ఒకటే అయినప్పుడు మతపరమైన భేదాలు వెనుకబడిపోతాయి. అలాంటి ఐక్యత నేడు అవసరం. సామాజిక శాంతి లేకపోతే అభివద్ధి అసాధ్యం. పరిశ్రమలు, విద్య, ఆరోగ్యం, ఉపాధి… ఇవన్నీ ప్రశాంత వాతావరణంలోనే వికసిస్తాయి. మత ఘర్షణలు కేవలం భావోద్వేగాలను మాత్రమే ప్రభావితం చేయవు; అవి దేశ ఆర్థిక ప్రగతిని కూడా దెబ్బతీస్తాయి.

మత సామరస్యం కేవలం భావోద్వేగ అంశం మాత్రమే కాదు; అది ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి మత స్వేచ్ఛను కల్పించడంతో పాటు, సమానత్వాన్ని హామీ ఇస్తుంది. ఒకరి విశ్వాసాన్ని మరొకరు గౌరవించడం రాజ్యాంగాత్మక బాధ్యత కూడా. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు సహజం; కానీ అవి విభజనలకు దారి తీయకూడదు. మతపరమైన వైవిధ్యాన్ని పరస్పర గౌరవంతో అంగీకరించినప్పుడే సమాజంలో స్థిరత్వం ఉంటుంది. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం అనే రాజ్యాంగ విలువలు కేవలం పాఠ్యపుస్తకాలలో కాకుండా సామాజిక జీవనంలో ప్రతిఫలించాలి. మత సామరస్యం బలపడితేనే ప్రజాస్వామ్యం బలపడుతుంది; ప్రజాస్వామ్యం బలపడితేనే దేశం అభివద్ధి దిశగా నడుస్తుంది.
మరో ముఖ్యమైన అంశం యువత పాత్ర. నేటి తరం సోషల్ మీడియా ద్వారా ప్రపంచంతో మమేకమవుతోంది. సమాచారం వేగంగా చేరుతున్న ఈ కాలంలో వివేచన కూడా అంతే వేగంగా పెరగాలి. యువత ఒకరినొకరు మతపరమైన గుర్తింపుల ఆధారంగా కాకుండా ప్రతిభ, వ్యక్తిత్వం ఆధారంగా అంచనా వేయాలి. కాలేజీలు, కార్యాలయాలు, ఐటీ సంస్థలు, స్టార్టప్ వేదికలు… ఇవన్నీ వివిధ మతాల యువత కలిసే ప్రదేశాలు. అక్కడ ఏర్పడే స్నేహాలు భవిష్యత్ భారత సమాజానికి బలమైన బంధాలుగా మారతాయి. ద్వేష సందేశాల కంటే సహన సందేశాలను పంచే తరం తయారైతేనే సామరస్యం శాశ్వతంగా నిలుస్తుంది. భిన్నత్వాన్ని అంగీకరించడం ఒక విలువగా, పరస్పర గౌరవాన్ని ఒక సంస్కారంగా స్వీకరించినప్పుడు మాత్రమే ‘భిన్నత్వంలో ఏకత్వం’ అనే మాట నిజంగా అర్థవంతమవుతుంది.
మత సామరస్యం అనేది సమాజ శాంతికే కాకుండా ఆర్థికాభివద్ధికీ కీలకం. భారతదేశంలోని చిన్న చిన్న బస్తీలు, మార్కెట్లు, వ్యాపార కేంద్రాలు ఈ సహజీవనానికి ప్రత్యక్ష ఉదాహరణలు. ఒకే వీధిలో హిందూ, ముస్లిం, సిక్కు, జైన వ్యాపారులు దశాబ్దాలుగా పక్కపక్కనే దుకాణాలు నడుపుతున్నారు. పండుగల సమయంలో ఒకరి వ్యాపారానికి మరొకరు సహకరించడం, అవసరమైనప్పుడు అప్పు ఇవ్వడం, పరస్పర నమ్మకంతో లావాదేవీలు జరపడం – ఇవన్నీ సామాజిక బంధాల బలాన్ని చూపిస్తాయి. సామరస్యం ఉన్న చోట మార్కెట్ చురుకుగా ఉంటుంది; మార్కెట్ చురుకుగా ఉంటే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. పర్యాటక కేంద్రాలు, పండుగల వేడుకలు, సాంస్కతిక ఉత్సవాలు కూడా వివిధ మతాల ప్రజల భాగస్వామ్యంతోనే విజయవంతమవుతాయి. శాంతి, విశ్వాసం, పరస్పర గౌరవం ఉన్న సమాజంలో పెట్టుబడులు పెరుగుతాయి; యువతకు అవకాశాలు విస్తరిస్తాయి. కాబట్టి మత సామరస్యం కేవలం భావోద్వేగ విలువ మాత్రమే కాదు, అది దేశ ఆర్థిక శక్తికి కూడా మూలాధారం. సమిష్టి అభివద్ధి కోసం పరస్పర విశ్వాసం అనేది కనిపించని మూలధనం లాంటిది.

సమాజంలో చైతన్యం తీసుకురావడంలో మీడియా పాత్ర కూడా కీలకం. సంచలనాలకు ప్రాధాన్యం ఇవ్వడం కంటే సానుకూల ఉదాహరణలను వెలుగులోకి తేవాలి. ఒక గ్రామంలో హిందూ యువకులు మసీదు మరమ్మతులకు సహకరించిన ఘటన, ఒక పట్టణంలో ముస్లిం వ్యాపారులు దేవాలయానికి దానం చేసిన ఉదాహరణ — ఇవి వార్తలుగా మారాలి. ఇలాంటి సంఘటనలు సమాజంలో విశ్వాసాన్ని పెంచుతాయి. పాఠశాలల్లో చిన్నప్పటి నుంచే పరస్పర గౌరవాన్ని బోధించాలి. మత విద్య కంటే మానవీయ విలువలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
ఇటీవలి కాలంలో నగరాల నుంచి గ్రామాల వరకు సామూహిక ఇఫ్తార్ ఒక సామాజిక వేదికగా మారింది. వివిధ వర్గాల ప్రజలు ఒకే వేదికపై కలిసి కూర్చొని శుభాకాంక్షలు చెప్పుకోవడం మంచి సంప్రదాయానికి సూచన. కులాలు, మతాలు వేరైనా మనమంతా ఒకటేనని చెప్పే ఐక్య ప్రకటన.
ఈ దేశం మతాల సమాహారం మాత్రమే కాదు; ఇది మనుషుల అనుబంధాల సమాజం. ఉపవాసం ముగిసిన క్షణంలో పంచుకునే ఖర్జూరం, నీళ్లు కేవలం ఆహార పదార్ధం కాదు, అవి విశ్వాసాల మధ్య దూరాన్ని తగ్గించే వంతెనలు.
ఇటీవల తమిళనాడులో జరిగిన ఒక సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అక్కడి సూఫీదార్ హిందూ దేవాలయం ప్రతి రమజాన్‌లో సమీపంలోని వల్లాజా పెద్ద మసీదులో ఉపవాస దీక్ష పాటిస్తున్న ముస్లిం సోదరుల కోసం ఇఫ్తార్ విందు సిద్ధం చేసి పంపిస్తోంది. ఇదేదో ఒక్కరోజు జరిగే కార్యక్రమం కాదు; దశాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయం. సింధ్ ప్రాంతం నుంచి వచ్చిన దాతత్వ భావన కలిగిన దాదా రతన్ చంద్ ఈ సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ఆలయ నిర్వాహకులు, స్థానిక హిందూ కుటుంబాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రతిరోజూ వంటలు తయారు చేసి మసీదుకు అందజేస్తారు. ఉపవాస విరమణ సమయానికి ముందే మసీదులో కూర్చునే వారికి ఆహారం చేరుతుంది. హిందూ సోదరులు పంపిన ఆహార పదార్ధాలతోనే ఉపవాస విరమణ జరుగుతుంది. అదొక అపురూపమైన దృశ్యం. పరస్పర విశ్వాసానికి నిదర్శనం.
అలాగే దేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో ముస్లిం సోదరులు కూడా ఇదే భావంతో ముందుకు వస్తున్నారు. ధార్మిక ఉత్సవాల సమయంలో ఉచిత నీటి పంపిణీ, వైద్య శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలకు సహకారం అందించడం, పలు ధార్మిక కార్యక్రమాల సందర్భంలో ట్రాఫిక్ నియంత్రణలో వాలంటీర్లుగా పనిచేయడం వంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. దక్షిణ అయోధ్యగా పేరు గాంచిన భద్రాచలం పట్టణంలో ‘శ్రీరామ నవమి’ సందర్భంగా స్థానిక ముస్లింలు దశాబ్దాలుగా భక్తులకు చల్లని మజ్జిగ వితరణ చేస్తూ వస్తున్నారు. ఒకరి పండుగను మరొకరు గౌరవించడం, అవసరమైనప్పుడు తోడుగా నిలవడం నిజమైన సామరస్యానికి సూచిక. ఇరువైపులా ఇలాంటి దష్టాంతాలు పెరిగితే అపోహలకు స్థానం ఉండదు.
మత సామరస్యం అంటే కేవలం ఘర్షణలు లేకపోవడమే కాదు; పరస్పర ప్రేమ పూర్వక సంభాషణ. నమ్మకం, విశ్వాసంతో కూడిన పలకరింపులు, స్నేహాలు. ఇచ్చి పుచ్చుకొనే విశాల హదయం. అపోహలు కలిగే ముందు అవగాహన పెరగాలి. యువత ఒకరినొకరు దగ్గరగా తెలుసుకునే అవకాశాలు పెరిగితే విభజన వాదుల పప్పులు ఉడకవు. ద్వేషాన్ని పంచడం సులభం; కానీ విశ్వాసాన్ని పెంపొందించడం కష్టం.
మత సామరస్యం కుటుంబ స్థాయిలోనే మొదలవుతుంది. పిల్లలు తమ ఇంట్లో వినే మాటలు, చూసే ప్రవర్తన ఆధారంగా భావాలను ఏర్పరుచుకుంటారు. ఇతర మతాల గురించి గౌరవంగా మాట్లాడితే వారి మనసుల్లో సహజంగా విశాల దక్పథం పెరుగుతుంది. పొరుగింటి వేడుకలకు వెళ్లడం, శుభాకాంక్షలు తెలపడం వంటి చిన్నచిన్న చర్యలే పెద్ద సామాజిక మార్పుకు పునాది వేస్తాయి.
విద్యా సంస్థలు కూడా ఈ దిశగా కీలక పాత్ర పోషించాలి. అంతర్మత సాంస్కతిక కార్యక్రమాలు, పరస్పర అవగాహన చర్చలు, వివిధ పండుగలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తే యువతలో సహన దక్పథం పెరుగుతుంది. ఒక మతాన్ని తెలుసుకోవడం అంటే దానిని అనుసరించడం కాదు; దానిని గౌరవించడం. ఇలాంటి అవగాహన సమాజంలో విస్తరించినప్పుడే సామాజిక వాతావరణం మరింత సుస్థిరంగా మారుతుంది. సమాజంలో శాంతి నెలకొంటేనే అవకాశాలు సమానంగా విస్తరిస్తాయి. అనుమానం ఉన్న చోట ప్రతిభ దెబ్బతింటుంది; విశ్వాసం ఉన్న చోట సామర్థ్యం వికసిస్తుంది. మత భేదాల ఆధారంగా విభజన పెరిగితే సామాజిక శక్తి విఛ్ఛిన్నమవుతుంది; ఐక్యత పెరిగితే అదే శక్తి దేశ ప్రగతికి దోహదం చేస్తుంది. సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, విద్యా విస్తరణ – ఇవన్నీ పరస్పర గౌరవం ఉన్న వాతావరణంలోనే సత్ఫలితాలిస్తాయి. అందుకే మతాల మధ్య సహనం, సామరస్యం కేవలం భావోద్వేగ విలువ కాదు; అది సమాజ స్థిరత్వానికి ఆధారం. కనుక ఈ విలువలన్నింటి మూలంలో నిలిచేది మానవత్వమే. మతాలు వేరు కావచ్చు; కానీ మానవత్వం ఒక్కటే. భిన్నత్వాన్ని అంగీకరించి, పరస్పరం గౌరవించుకుంటేనే శాంతి సాధ్యం. రమజాన్ సందర్భం మనకు అదే గుర్తుచేస్తుంది. మన మధ్య ఉన్న గోడలను కూల్చి, విశ్వాసాల మధ్య వంతెనలు నిర్మించాలి. మత సామరస్యం ఒక నినాదం కాదు; అది జీవన విధానం. పరస్పర గౌరవం, సహజీవనం, సంభాషణ — ఇవే భారత సమాజాన్ని బలంగా నిలబెట్టే సూత్రాలు. రమజాన్ స్ఫూర్తిని ఒక నెలకే పరిమితం చేయకుండా సంవత్సరమంతా ఆచరిస్తేనే నిజమైన సామరస్యం సాధ్యమవుతుంది.
– యండి. ఉస్మాన్ ఖాన్, 9912580645



