Wednesday, March 11, 2026
E-PAPER
Homeజాతీయంక్రూడాయిల్‌ ధర సగానికి తగ్గినా..పెట్రో మంటలే

క్రూడాయిల్‌ ధర సగానికి తగ్గినా..పెట్రో మంటలే

- Advertisement -

యుద్ధాలతో భారత్‌కు చౌకగా చమురు సరఫరా
అందుకు తగ్గట్టుగా ధరలు సవరించని కేంద్రం
దేశ ప్రజలపై విపరీతమైన భారం
రెండేండ్లుగా మోడీ సర్కార్‌ నిలువుదోపిడీ

గల్ఫ్‌ యుద్ధమనో..మరొకటనో.. ఇలా ఏదో కారణం చెప్తూ చమురు ధరల్ని అమాంతంగా పెంచేవి కేంద్రంలోని ప్రభుత్వాలు. ప్రస్తుతం అంతర్జాతీయ యుద్ధాలు భారత్‌కు బాగా కలిసొచ్చాయి. ఫలితంగా క్రూడాయిల్‌ ధరలు తగ్గాయి. కానీ దేశంలో మాత్రం పెట్రో ధరలు తగ్గడం లేదు. ఈ విషయంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజలపై ఏమాత్రమూ కనికరం చూపకుండా.. ఆయిల్‌ ధరలను పెంచుతున్నది. దేశ ప్రజల నుంచి అందినకాడికి దోచుకుంటున్నది.

న్యూఢిల్లీ : గత రెండేండ్లుగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు బాగా తగ్గినప్పటికీ, భారత్‌లో మాత్రం ఆ పరిస్థితులు ప్రతిబింబించటం లేవు. వాస్తవానికి క్రూడాయిల్‌ ధరలను బట్టి దేశంలో చమురు ఉత్పత్తి రేట్లను సవరిస్తే.. పెట్రోల్‌, డీజీల్‌ ధరలు చాలా తక్కువ ధరలకే లభ్యమవుతాయి. దీంతో దేశ ప్రజలకు భారీ ఉపశమనం దక్కేది. కానీ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అలా సవరించకపోవడంతో దేశంలో పెట్రో ధరలు మండుతూనే ఉన్నాయి. అధికారిక గణాంకాల విశ్లేషణ ప్రకారం.. జూన్‌ 2022 నుంచి దేశంలో పెట్రోల్‌ ధరలు కేవలం 1.9 శాతం తగ్గాయి. అయితే ఆ సమయంలోనే ప్రపంచ ముడి చమురు ధరలు దాదాపు 41.5 శాతం పడిపోవడం గమనార్హం. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల తగ్గుదల ఫలాలను కేంద్రం చమురు కంపెనీలకు అందించింది. చమురు కంపెనీలు భారీ మార్జిన్‌లను నిలుపుకోవడానికి మోడీ సర్కార్‌ అనుమతించింది. అంతేకాకుండా.. కేంద్ర ప్రభుత్వం ఏండ్లుగా నియంత్రణ లేని ధరల వ్యవస్థకు మద్దతు ఇచ్చింది.

ప్రజలపై భారం.. చమురు కంపెనీలకు ప్రయోజనం
ఫిబ్రవరి 2022లో రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైన వెంటనే.. మార్చి-జులై కాలంలో భారత్‌ దిగుమతి చేసుకున్న ముడి చమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్లు దాటిందని పెట్రోలియం ప్లానింగ్‌, విశ్లేషణ సెల్‌ నుంచి వచ్చిన డేటా చూపిస్తోంది. జూన్‌ 2022 నాటికి, ఇది బ్యారెల్‌కు 116 డాలర్లకు పెరిగింది. ముడి చమురు ధరలు పెరగడంతో చమురు మార్కెటింగ్‌ కంపెనీలు ఏప్రిల్‌ 2022 నాటికి ఢిల్లీలో పెట్రోల్‌ ధరలను లీటరుకు 105.1 రూపాయలకు పెంచాయి. మే 2022లో.. సగటు ముడి చమురు ధర బ్యారెల్‌కు 110 డాలర్లు ఉన్నప్పుడు, ఢిల్లీలో పెట్రోల్‌ ధర లీటరుకు 96.7 రూపాయలుగా ఉంది. 2024 మార్చి మధ్యకాలం వరకు 21 నెలలకు పైగా రిటైల్‌ ఇంధన ధరలలో ఎటువంటి సవరణ జరగలేదు. ఇది 2017లో ప్రవేశపెట్టబడిన డైనమిక్‌ ధరల వ్యవస్థకు విరుద్ధంగా ఉంది. దీని కింద ప్రపంచ ముడి చమురు ధరలకు అనుగుణంగా ప్రతిరోజూ ధరలు సవరించబడాలి. కానీ అలా జరగలేదు.

భారతదేశంలో క్రూడాయిల్‌, పెట్రోల్‌ ధరల పోలిక చార్ట్‌ ప్రకారం.. పెట్రోల్‌ లీటరుకు దాదాపు రూ.56గా ఉండాలి. జూన్‌ 2022 నుంచి ఫిబ్రవరి 2025 వరకు.. భారత్‌ కొనుగోలు చేసిన ముడి చమురు సగటు ధర బ్యారెల్‌కు 67.9 డాలర్లకు పడిపోయింది. ఇది 41.5 శాతం తగ్గుదల కావటం గమనార్హం. అయితే దేశంలోని పెట్రో ధరలు అదే స్థాయిలో తగ్గకపోవడం గమనార్హం. ఈ కాలంలో ఢిల్లీలో పెట్రోల్‌ రిటైల్‌ ధర లీటరుకు 96.7 రూపాయల నుంచి లీటరుకు 94.8 రూపాయలకు మాత్రమే పడిపోయింది. అంటే ఈ తగ్గింపు 1.9 శాతం మాత్రమే. ముడి చమురు ధరల తగ్గుదలకనుగుణంగా పెట్రోల్‌ ధరలు తగ్గినట్టయితే దేశ ప్రజలకు ఎంతో లబ్ది చేకూరేది. కానీ మోడీ ప్రభుత్వం అలా చేయలేదు.

జూన్‌ 2022లో లీటరుకు రూ.96.7 రేటు ఢిల్లీలో దాదాపు 56.5 రూపాయలకు తగ్గాలి. కానీ అలా జరగలేదు. దీంతో మోడీ సర్కార్‌ విధించిన ఈ భారమంతా వినియోగదారులపై పడుతోంది. పరిమిత తగ్గింపు కూడా చమురు కంపెనీలు తమ బేస్‌ ధరలను తగ్గించడం వల్ల జరగలేదు. 2024 మార్చి మధ్యలో.. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని లీటరుకు రూ.2 తగ్గించింది. దీంతో ఢిల్లీ ధర 96.7 రూపాయల నుంచి 94.7 రూపాయలకు తగ్గింది. తరువాత అది కొద్దిగా లీటరుకు 94.8 రూపాయలకు పెరిగింది. అయితే ధరల పెట్రో ధరల విషయంలో కేంద్రం తన వైఫల్యాన్ని కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేసింది. ఇంధన ధరలు నిర్ణయించడం చమురు మార్కెటింగ్‌ కంపెనీల బాధ్యతనీ, ఇందులో ప్రభుత్వం జోక్యం చేసుకోదని పార్లమెంటులో కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ పదేపదే చెప్పడం గమనార్హం.

యూపీఏ, ఎన్డీఏ హయాంలో నియంత్రణ సడలింపు
కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ, బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే వరుస ప్రభుత్వాలు చేపట్టిన ఇంధన ధరల సడలింపు గురించి ప్రస్తుత పరిస్థితి ప్రశ్నలను కలిగిస్తున్నది. యూపీఏ-2 2010లో పెట్రోల్‌పై ధరల నియంత్రణలను తొలగించింది. ఆ తర్వాత ఏన్డీఏ-1 2014లో డీజిల్‌ ధరల నియంత్రణలను తొలగించింది. అంతర్జాతీయ ధరలు తగ్గినప్పుడు నియంత్రణ సడలింపు వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తుందని కాంగ్రెస్‌, బీజేపీ ప్రభుత్వాలు వాదించాయి. అయితే, ప్రస్తుత డేటా భిన్నమైన వాస్తవికతను ప్రదర్శిస్తున్నదని విశ్లేషకులు చెప్తున్నారు.

ముడి చమురు ధరలు పెరిగినప్పుడు, ఆ భారం త్వరగా వినియోగదారులపైకి వెళుతుంది. కానీ ధరలు బాగా తగ్గినప్పుడు, ప్రయోజనం అదే విధంగా ప్రజలకు చేరటం లేదని వివరిస్తున్నారు. మార్కెట్‌-లింక్డ్‌ ధర నిర్ణయించడం న్యాయంగా, పారదర్శకంగా ఉంటుందనే హామీ వాస్తవ పరిస్థితుల్లో భిన్నంగా ఉన్నదని అంటున్నారు. ఎందుకంటే ప్రపంచ ముడి చమురు ధరలు బాగా తగ్గినప్పటికీ భారతీయ వినియోగదారులు అధిక ఇంధన ధరలను చెల్లిస్తూనే ఉన్నారని వివరిస్తున్నారు. ఈ విషయంలో మోడీ సర్కారు చర్యలు దేశ ప్రజలకు శాపంగా మారాయని అంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -