– శ్రీరాంసాగర్, నిజాం సాగర్‌కు భారీ ఇన్‌ఫ్లో
– అదే స్థాయిలో దిగువకు నీటి విడుదల
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టులకు వరద పోటెత్తు తోంది. దాంతో అధికారులు నిరంతరం పర్య వేక్షిస్తూ వచ్చిన వరదను వచ్చింది వచ్చినట్టే దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ప్రస్తుతం 3 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుండగా.. 2.59 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తు న్నారు. అదే విధంగా నిజాంసాగర్ ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండగా.. 77 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుల పూర్తిస్థాయి సామర్థ్యం కంటే తక్కువ స్థాయిలోనే నీటిని అధికారులు నిల్వ ఉంచుతున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం వరకు నీటిని నిల్వ ఉంచితే.. ప్రాజెక్టు ఎగువ భాగంలోని పలు గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు.
ఉత్తర తెలంగాణ వర ప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతమైన మహారాష్ట్రతో పాటు, మంజీరా నుంచి గోదావరి కి ప్రవాహం కొనసాగుతున్నది. దాంతో భారీ ఎత్తున వరద వచ్చి చేరుతుంది. బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయానికి ప్రాజెక్టులోకి 3 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా.. 39 గేట్లు ఎత్తి 2.50 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వారం రోజులుగా సగటున 3.57 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా.. మూడు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది జూన్ 1వ తేదీ నుంచి ప్రాజెక్టులోకి 735.08 టీఎంసీల నీరు వచ్చి చేరగా.. దిగువకు 686.358 టీఎంసీల నీటిని విడుదల చేశారు.
నిజాంసాగర్‌కు సైతం..
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను సస్యశ్యామలం చేసే నిజాంసాగర్ ప్రాజెక్టుకు సైతం భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి, సింగూరు ప్రాజెక్టు నుంచి వరద కొనసాగుతుంది. నిజాంసాగర్ ప్రాజెక్టుకు ప్రస్తుతం 1.01 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుండగా.. 15 గేట్లు ఎత్తి 77 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దాంతో మంజీరా నది పరివాహక ప్రాంతాలు జలకళను సంతరించుకున్నాయి. దిగువకు వదులుతున్న నీరు నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి వద్ద గోదావరిలో కలుస్తున్నాయి.
ఆ ప్రాంతాలకు వరద ముప్పు
కాగా ప్రాజెక్టుల వరద ప్రవాహం కొనసాగుతుండటంతో.. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. దాంతో అధికారులు.. ప్రాజెక్టుల్లో పూర్తిస్థాయి కంటే తక్కువ సామర్థ్యంతో నీటిని నిల్వ ఉంచుతున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 1091 అడుగులు(80.5 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1086 అడుగుల(63.973 టీఎంసీల) నీటిని నిల్వ ఉంచారు. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం కంటే 16.5 టీఎంసీల తక్కువస్థాయిలో నీటిని నిల్వ ఉంచారు. ఇన్‌ఫ్లో తగ్గే క్రమంలో క్రమంగా నిల్వసామర్థ్యం పెంచుతున్నారు. అదే విధంగా నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1405 అడుగులు(17.802 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1402 అడుగులు(14.201 టీఎంసీలు) మేర నీటిని నిల్వ చేశారు. పూర్తిస్థాయి సామర్థ్యం కంటే 3.6 టీఎంసీల నీటిని తక్కువ స్థాయిలో నిల్వ ఉంచుతున్నారు.
వర్షాలు తగ్గినా..వరద తగ్గట్లే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES