కేంద్రం ఆదేశాలతో అసెంబ్లీలో ‘వందేమాతరం’
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సోమవారం అందరి దృష్టీ ‘వందేమాతరం’పై పడింది. గతంలో వందేమాతరం పూర్తి వెర్షన్‌పై మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పాయి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన పీఎంగా ఉన్నప్పుడు ఉత్తర ప్రదేశ్‌లోని కళ్యాణ్‌సింగ్ ప్రభుత్వం… సర్కారీ బడుల్లో వందేమాతరం పూర్తి గీతాన్ని తప్పనిసరి చేసింది. దీన్ని వాజ్‌పేయి తిరస్కరించారు. తప్పనసరి చేసినందుగాను ఆనాటి యూపీ విద్యాశాఖ మంత్రి రవీంద్ర శుక్లాతో రాజీనామా చేయించారు. సంబంధిత సర్క్యులర్‌ను ఉపసంహరింపజేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో జాతీయ గీతంగా దేన్ని తీసుకోవాలన్న చర్చ జరిగినప్పుడు జనగణమన, సారే జహాస అచ్ఛా, వందేమాతరం… ఈ మూడూ ముందుకొచ్చాయి.
అయితే జనగణమనలో సంపన్నమైన భిన్నత్వం ఉండటంతో దాన్ని అన్ని ప్రాంతాల వారూ అంగీకరించారు. అన్ని రాష్ట్రాలూ దాన్ని ఆమోదించాయి. వందేమాతరంలో వలస వ్యతిరేక భావలున్నప్పటికీ దాన్ని ముస్లిం వ్యతిరేక భావనలను రెచ్చగొట్టడానికి సంఘ్ పరివార్ ఉపయోగిస్తోంది. ఆ గీతం పూర్తి వెర్షన్ ఒక మతానికి పూర్తి మద్దతు పలికేలా ఉందనే వాదనలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వందేమాతరం పూర్తి వెర్షన్‌ను కాకుండా కొద్ది భాగమే తీసుకోవాలని స్వాతంత్య్ర కాలంలో నాటి జాతీయ నేతలు సూచించారు. కానీ అందుకు భిన్నంగా అన్ని అధికారిక కార్యక్రమాల్లో పూర్తి వెర్షన్‌ను పాడాలంటూ కేంద్రం… ఒత్తిడి తెచ్చింది. ఆ క్రమంలోనే రాష్ట్ర అసెంబ్లీలో సోమవారం జయజయహే తెలంగాణ, జనగణమనతోపాటు వందేమాతరం పూర్తి వెర్షన్‌ను ఆలపించటం గమనార్హం.



