సాయంత్రమైతే చాలు క్రంచీగా, టేస్టీగా ఏదో ఒక స్నాక్ తినాలనిపిస్తుంది. అటువంటి టైమ్‌లో అందరూ చాలా తొందరగా, ఈజీగా చేసుకునే వాటి గురించి ఆలోచిస్తుంటారు. అయితే మనం తీసుకునే స్నాక్స్ రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేసే విధంగా ఉండాలి. అలాంటి కొన్ని స్నాక్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం…
మీల్ మేకర్ పకోడీ
కావాల్సిన పదార్థాలు: మీల్ మేకర్స్ – ఒక పెద్ద కప్పు, వెల్లుల్లి రెబ్బలు – 12, ఉల్లిపాయలు – రెండు, పచ్చిమిర్చి – నాలుగు, పుట్నాలపప్పు – ఒక కప్పు, ధనియాలు – రెండు చెంచాలు, జీలకర్ర – చెంచా, వాము – చెంచా, సోంపు – ఒక చెంచా, ఎండుమిర్చి – ఐదారు, పసుపు – కొద్దిగా, ఉప్పు – రుచికి తగినంత, బియ్యప్పిండి – రెండు టేబుల్ స్పూన్లు, శనగపిండి – టేబుల్ స్పూన్, గరంమసాలా – టీస్పూన్, పుదీనా – చిన్న కట్ట, కొత్తిమీర తరుగు – కొద్దిగా, నూనె – డీప్ ఫ్రైకి తగినంత, పచ్చిమిర్చి – ఐదారు, కరివేపాకు – కొద్దిగా.
తయారీ విధానం: ఒక గిన్నెలో గోరువెచ్చని నీళ్లు తీసుకుని అందులో మీల్ మేకర్స్‌ను వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఈలోపు ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర, పుదీనాలను వీలైనంత సన్నగా తరుక్కుని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని అందులో ధనియాలు, వాము, సోంపు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుని మరీ మెత్తని పొడిలా కాకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని పక్కనుంచాలి. అదే మిక్సీ జార్‌లో పుట్నాలపప్పును వేసుకుని మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకొని పక్కకు తీసుకోవాలి. అదే మిక్సీ గిన్నెలో నానబెట్టుకున్న మీల్ మేకర్స్‌ను వాటర్ గట్టిగా పిండి మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడా చిన్న చిన్న పీసెస్ కనిపించేలా (కీమాలాగా) మిక్సీ పట్టుకోవాలి. దీన్ని పుట్నాల పొడితో కలిపి అందులో గరంమసాలా, పసుపు, రుచికి తగినంత ఉప్పు, ముందుగా గ్రైండ్ చేసుకున్న ఎండుమిర్చి మిశ్రమం వేసుకోవాలి. అలాగే బియ్యప్పిండి, శనగపిండి కూడా వేసుకుని బాగా కలపాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి ముక్కలు, వెల్లుల్లి తరుగు, కొత్తిమీర, పుదీనా తరుగు, మూడు చెంచాల వేడి నూనె వేసుకుని ముందు గరిటెతో కలుపుకోవాలి. తర్వాత చేతితో కలియతిప్పుతూ బాగా కలుపుకోవాలి. నీరు ఏమైనా అవసరమైతే మీల్ మేకర్స్ నానబెట్టుకున్న నీటిని కొద్దికొద్దిగా వేసి పిండి కాస్త గట్టిగానే కలుపుకోవాలి. కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. తర్వాత మంటను తగ్గించి ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండి మిశ్రమంలో నుంచి కొద్దికొద్దిగా తీసుకుంటూ కాగుతున్న నూనెలో నెమ్మదిగా వేసుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అంతే సూపర్ టేస్టీగా కరకరలాడే మీల్ మేకర్ పకోడీ రెడీ అవుతుంది.
పల్లీ పకోడీ
కావాల్సిన పదార్థాలు : పల్లీలు – 400 గ్రాములు, అర కప్పు – శనగపిండి, అర కప్పు – బియ్యప్పిండి, వెల్లుల్లి రెబ్బలు – 30, రుచికి తగినంత – ఉప్పు, ఒకటిన్నర చెంచాలు – కారం, అర చెంచా – గరం మసాలా, అర చెంచా – చాట్ మసాలా, ఒకటి – నిమ్మకాయ, నాలుగైదు రెమ్మలు – కరివేపాకు, డీప్ ఫ్రైకి తగినంత – నూనె.
తయారీ విధానం: ఒక చిన్న మిక్సీ జార్‌లో వెల్లుల్లి రెబ్బలు, రుచికి తగినంత ఉప్పు, రెండు చెంచాలు నీరు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వెడల్పాటి మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో పల్లీలు, ముందుగా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. అందులో శనగపిండి, బియ్యప్పిండి, రుచికి తగినంత సాల్ట్, కారం, గరంమసాలా, చాట్ మసాలా వేసుకోవాలి. అందులోనే రెండు చెక్కల నిమ్మరసాన్ని పిండుకుని కాస్త గట్టిగా కలుపుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు యాడ్‌చేసుకోవచ్చు. దీన్ని కాసేపు పక్కనుంచాలి. స్టవ్ మీద కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి తగినంత నూనె పోసి హీట్ చేసుకోవాలి. మంట తగ్గించి కలిపి పెట్టుకున్న పల్లీల మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ విడివిడిగా పకోడీలా కాగుతున్న నూనెలో నెమ్మదిగా వేసుకోవాలి. నూనెలో ఓ నిమిషం వేగిన తర్వాత చిల్లుల గరిటెతో తిప్పుతూ లైట్ గోల్డెన్ కలర్‌లోకి వచ్చేంత వరకు వేయించుకొని సర్వ్ చేసుకోవాలి.
రవ్వ బైట్స్
కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ – రెండు కప్పులు(400 గ్రాములు), ఎండుమిర్చి – నాలుగు, పల్లీలు – నాలుగు టేబుల్ స్పూన్లు, ఆలుగడ్డలు – రెండు(మీడియం సైజ్‌వి), ఆయిల్ – రెండు టేబుల్ స్పూన్లు, ఆవాలు -టీస్పూన్, జీలకర్ర – టీస్పూన్, పచ్చిమిర్చి – నాలుగు, అల్లంవెల్లుల్లి పేస్ట్ – టీస్పూన్, సన్నని క్యారెట్ తురుము – అర కప్పు, పసుపు – అర టీస్పూన్, ఉప్పు – రుచికి తగినంత, ధనియాలపొడి – రెండు టీస్పూన్లు, చాట్ మసాలా – రెండు టీస్పూన్లు, సన్నని కొత్తిమీర తరుగు – కొద్దిగా, బియ్యప్పిండి – నాలుగు టేబుల్ స్పూన్లు, నూనె – డీప్ ఫ్రైకి తగినంత.
తయారీ విధానం: ముందుగా బొంబాయి రవ్వ తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అందులో నాలుగు ఎండుమిర్చి, పల్లీలు వేసి మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ పలుకులు కనిపించేలా మిక్సీ పట్టుకుని పక్కనుంచాలి. ఆలూ చెక్కుతీసి సన్నగా తురుముకొని నీళ్లలో వేసి పక్కన ఉంచాలి. స్టవ్‌పై పాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తర్వాత సన్నని పచ్చిమిర్చి తరుగు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేలా ఫ్రై చేయాలి. అందులో సన్నని క్యారెట్ తురుము, నీళ్లలో ఉన్న ఆలూ తురుమును వాటర్ పిండి వేసుకుని రెండు మూడు నిమిషాలు కలుపుతూ బాగా వేయించుకోవాలి. అందులో రవ్వ తీసుకున్న కప్పుతో నాలుగు కప్పుల నీళ్లు పోసి పసుపు, రుచికి తగినంత ఉప్పు, ధనియాల పొడి, చాట్ మసాలా వేసుకుని అన్నింటినీ బాగా కలిపి మరిగించుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండలు కట్టకుండా కలపుకోవాలి. ఇది కొంచెం ముద్ద కట్టే వరకు స్టవ్‌ను లో-ఫ్లేమ్‌లో ఉంచి రెండు మూడు నిమిషాలు కలుపుతూ ఉడికించుకోవాలి. కొంచెం గట్టి పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి 5 నుంచి 10 నిమిషాలు పక్కనుంచాలి. తర్వాత అందులో సన్నని కొత్తిమీర తరుగు, బియ్యప్పిండి వేసుకుని మరోసారి బాగా కలిపి చపాతీ పిండిలా కలుపుకోవాలి. కొద్దిగా పిండిని కొద్దికొద్దిగా తీసుకుంటూ ముందు ఉండలా చేసి ఆపై సిలిండర్ షేప్ వచ్చేలా చేసుకోవాలి. తర్వాత ఫోర్క్ చెంచాతో బిస్కెట్ షేప్ వచ్చేలా మీడియం థిక్‌నెస్‌తో వత్తుకుని అన్నీ ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రైకి తగినంత నూనె పోసి వేడి చేసి ముందుగా ప్రిపేర్ చేసుకున్న బైట్స్‌ను కాగుతున్న నూనెలో నెమ్మదిగా వేసుకోవాలి. కాస్త మంట తగ్గించి రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే చాలు రవ్వ బైట్స్ రెడీ.
గుంత పొంగనాలు
కావాల్సిన పదార్థాలు: జన్న పిండి – కప్పు, బొంబాయి రవ్వ – అర కప్పు, ఉల్లిగడ్డ – 1, పచ్చిమిర్చి – 3, కరివేపాకు – 2 రెమ్మలు, కొత్తిమీర తరుగు – కొద్దిగా, క్యారెట్ – 1, జీలకర్ర – అర టీస్పూను, పెసరపప్పు – 2 టేబుల్ స్పూన్లు, పెరుగు – అర కప్పు, ఉప్పు – రుచికి సరిపడా, బేకింగ్ సోడా – అర టీస్పూన్.
తయారీ విధానం: పెసరపప్పు అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఈలోపు ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ను వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. క్యారెట్‌పై పొట్టు తీసేసి సన్నగా తురుము కోవాలి. ఓ గిన్నెలో జొన్న పిండి, బొంబాయి రవ్వ, పెరుగు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత కొద్దిగా నీరు పిండి మరీ లూజుగా కాకుండా కాస్త గట్టిగానే ఉండాలి. ఓ 10 నిమిషాలు పక్కనపెట్టాలి. తర్వాత అందులో నానబెట్టిన పెసరపప్పు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్, కొత్తిమీర, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు గుంత పొంగనాలు వేసుకునేందుకు సరిపడేలా నీరు పోసు కలుపుకోవాలి. స్టౌవ్‌పై గుంత పొంగనాల పెనం పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి. పిండిని గరిటె సాయంతో కొద్దికొద్దిగా వేసుకోవాలి. మంటను లో టూ మీడియం ఫ్లేమ్‌లో రెండు వైపులా కాల్చు కొని ప్లేట్‌లోకి తీసుకోవాలి. దీన్ని మీకు నచ్చిన చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి.



