చాండ్లర్ లాంగేవిన్ విద్వేషపూరిత పోస్టు
ఇండియన్స్ తీవ్ర ఆగ్రహం
న్యూయార్క్ : అమెరికాకు చెందిన రాజకీయ నేత చాండ్లర్ లాంగేవిన్ భారతీయులకు వ్యతిరేకంగా చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. యూఎస్‌లో ఉన్న ప్రతి భారతీయుడిని వెంటనే బహిష్కరించాలంటూ ఆయన పెట్టిన పోస్టులపై అమెరికాలో నివసిస్తున్న భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లోరిడాలోని పామ్ బే సిటీ కౌన్సిల్‌కు కన్జర్వేటివ్ నాయకుడైన లాంగేవిన్, గత కొన్ని రోజులుగా భారతీయులకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. ఇటీవల ఓ ట్రక్ డ్రైవర్ కారణంగా ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిందనే వార్తను సోషల్ మీడియాలో పంచుకున్న లాంగేవిన్, ఆ పోస్టు కింద అమెరికాలోని భారతీయులందరినీ వెంటనే బహిష్కరించాలంటూ రాసుకొచ్చారు. అమెరికా గురించి పట్టించుకునేందుకు ఒక్క భారతీయుడు కూడా లేరని, వారు మనల్ని ఆర్థికంగా దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ఆ దేశ ప్రజలను ప్రోత్సహించేందుకే ఇక్కడ ఉన్నారని, యూఎస్‌లో అమెరికన్లు మాత్రమే ఉండాలంటూ మరో పోస్టు పెట్టారు.
యూఎస్‌లో ఉన్న భారతీయులు ఆగ్రహం
మరోవైపు లాంగేవిన్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టిన పామ్ బే మేయర్ మదీనా, ఇతరులను కించపరిచేలా, విలువలు తగ్గించేలా మన మాటలు ఉండకూడదని, అలాంటి వారికి ఇక్కడ చోటులేదని ఘాటుగా బదులిచ్చారు. అయినప్పటికీ ఆ రాజకీయ నేత తన పోస్టుల పరంపరను ఆపలేదు. ఇటీవల ”ఈ రోజు నా పుట్టినరోజు. ప్రతి భారతీయుడి వీసాను రద్దు చేసి వెంటనే వారిని ఇక్కడి నుంచి బహిష్కరించాలి. ఇదే నా కోరిక” అంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను ట్యాగ్ చేసి పోస్టు పెట్టారు. దాదాపు గత నెల నుంచి లాంగేవిన్ భారతీయులకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ వచ్చారు. ఫలితంగా ఆయన భారతీయులను ఉద్దేశిస్తూ పెట్టిన విద్వేషపూరిత పోస్టులపై అక్కడి భారతీయ అమెరికన్ గ్రూపులతో పాటు కాంగ్రెస్ సభ్యుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
చర్యలు తీసుకున్న పామ్ బే నగర కౌన్సిల్
ఆయన వ్యాఖ్యల నేపథ్యంలో నగర కౌన్సిల్‌కు ఫిర్యాదులు అందడంతో కౌన్సిల్ లాంగేవిన్‌పై చర్యలు తీసుకుంది. ఇక నుంచి ఆయన ఏదైనా ఎజెండాను ప్రవేశపెట్టాలనుకుంటే ముందే ఏకాభిప్రాయం పొందాల్సి ఉంటుంది. పామ్ బే నగర కౌన్సిల్ లాంగేవిన్‌ను కమిటీ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు కమిటీ నుంచి ఆయన్ను తొలగించడంతో పాటు ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా చేసింది. కాగా ఈ చర్యలను లాంగేవిన్ తీవ్రంగా ఖండించారు. అంతకుముందు అమెరికా సెనెటర్ జిమ్ బ్యాంక్స్ కూడా భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. భారత్, చైనా వంటి దేశాల నుంచి తాము దిగుమతి చేసుకొనే ఔషధాలు నాసిరకంగా ఉన్నాయంటూ విమర్శించారు.