కుక్కలను చంపిన వారిపై కఠిన చర్యలు : మంత్రులు కొండా సురేఖ, సీతక్క కేబీఆర్ పార్క్‌లో
ఇండియన్ డాగ్ అడాప్షన్
నవతెలంగాణ – బంజారాహిల్స్
అహింస మార్గమే కాంగ్రెస్ సిద్ధాంతమని, ప్రతి ప్రాణికీ జీవించే హక్కు ఉందని మంత్రులు కొండా సురేఖ, సీతక్క అన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్‌లో శనివారం ఇండియన్ డాగ్ అడాప్షన్ కార్యక్రమం నిర్వహిం చారు. అహింసా సందేశంతో కుక్కలను దత్తత తీసుకోవాలని పిలుపునిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా మంత్రి సీతక్క స్వదేశీ కుక్కపిల్లను దత్తత తీసుకుని ఆదర్శంగా నిలిచారు. అనంతరం ఎంపీ రేణుక చౌదరి మంత్రి సీతక్క చేతుల మీదుగా ఓ కుక్కపిల్లను దత్తత తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ నగర నడిబొడ్డున జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఇలాంటి స్ఫూర్తిదాయక కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం అని అన్నారు. కుక్కలను దత్తత తీసుకోవడం ద్వారా వాటికి జీవించే హక్కు కల్పించడమే కాకుండా సమాజంలో మానవత్వాన్ని పెంపొందించవచ్చని తెలిపారు. కాంగ్రెస్ ఎప్పుడూ అహింసా సిద్ధాం తాన్నే అనుసరించిందని, అహింసా మార్గంలోనే దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ అని గుర్తుచేశారు. ప్రతి ప్రాణికీ జీవించే హక్కు ఉందని, విశ్వాసానికి మారుపేరు కుక్క అని అన్నారు. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో కొంత మంది కుక్కలను చంపిన ఘటనలను ప్రస్తావిస్తూ, ఆ ఘటనలను ప్రభుత్వం ఖండించిందని తెలిపారు. సంబంధిత వారిపై చర్యలు కూడా తీసుకున్నామని చెప్పారు. ఎవ్వరూ కుక్కలను చంపకూడదని, నియంత్రణ చర్యలు పాటిస్తూ మానవత్వంతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో ప్రతి ఇంటికీ ఒక కుక్క ఉండేదని, పది మందితో సమానంగా ఒక కుక్క కాపలా కాస్తుందని ఆమె గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, మాజీ కార్పొరేటర్ విజయా రెడ్డి, జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ప్రియాంక అలా, పశుసంవర్ధక శాఖ అధికారి వాకిలిసబ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ప్రాణికీ జీవించే హక్కు ఉంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



