Monday, July 14, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంప్రతి రూపాయి ప్రజల కోసమే ఖర్చు

ప్రతి రూపాయి ప్రజల కోసమే ఖర్చు

- Advertisement -

– అర్హులైన ప్రతి లబ్దిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు
– విద్య, వైద్య రంగాల అభివృద్ధికి పెద్దపీట : ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణ-లక్షెట్టిపేట

ప్రజల కోసమే ప్రతి రూపాయి ఖర్చు చేస్తామని, అర్హులైన ప్రతి లబ్దిదారునికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండల కేంద్రంలో 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, అబ్కారీ, ఎక్సైజ్‌, పర్యాటక, సాంస్కృతిక శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబుతో కలిసి భట్టి విక్రమార్క ఆదివారం ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల ఏర్పాటు, నవీకరణ కార్యక్రమాలను చేపట్టిందని అన్నారు. ఇందులో భాగంగానే లక్షెట్టిపేట మండలకేంద్రంలో రూ.8.50 కోట్లతో పాటు మరో రూ.కోటి సింగరేణి నిధులతో సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ప్రజలకు మరింత మెరుగైన, వేగవంతమైన వైద్య సేవలు అందించడం కోసం చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని లక్ష్యంగా ఏడాదికి రూ. 20 వేల కోట్లను వడ్డీలేని రుణాలుగా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.


మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్సులు నడిపించేందుకు 600 బస్సుల ప్రతిపాదనలో 150 బస్సులను ఇచ్చామని, త్వరలో 450 బస్సులను ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రైతు సంక్షేమంలో భాగంగా 70 లక్షల రైతు కుటుంబాలకు రైతు భరోసా కింద 9 రోజుల్లో రూ.9 వేల కోట్ల పెట్టుబడి సహాయం అందించినట్టు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లను రూ.22,500 కోట్లతో లబ్దిదారులకు అందించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌ రావు, జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా, జిల్లా అటవీ అధికారి శివ్‌ ఆశిష్‌ సింగ్‌, జీసీసీ చైర్మెన్‌ కొట్నాక తిరుపతి, కనీస వేతన బోర్డు చైర్మెన్‌ జనక్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -