Tuesday, December 30, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంతెలంగాణ ప్రతిపల్లె పద సాహిత్య మయం

తెలంగాణ ప్రతిపల్లె పద సాహిత్య మయం

- Advertisement -

– ఎమ్మెల్సీ గోరటి వెంకన్న
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

తెలంగాణలోని ప్రతిపల్లె పద సాహిత్యాలతో, భజన కీర్తనలతో విరాజిల్లుతోందని ఎమ్మెల్సీ, ప్రముఖ వాగ్గేయకారులు గోరటి వెంకన్న అన్నారు. సోమవారం ఓయూ ఆర్ట్స్‌ కళాశాల వేదికగా, తెలుగు శాఖ నిర్వహించిన ”తెలంగాణ పద సాహిత్యం – సమాలోచన” అనే జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కీలక ఉపన్యాసం చేసిన ప్రముఖ పరిశోధకులు పి భాస్కర యోగి మాట్లాడుతూ సాహిత్య చరిత్రలో విస్మరణకు గురైన ఎందరో పద కవులపై విస్తృతమైన పరిశోధనలు జరగడం అభినందించదగిన విషయమని అన్నారు. ఆ దిశలో తెలుగు శాఖ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్‌ కాలేజీలో తెలంగాణ పద సాహిత్యంపై జాతీయ సదస్సు నిర్వహించడం గర్వించదగ్గ విషయమని చెప్పారు. తెలుగుశాఖ అధ్యక్షులు ఆచార్య సాగి కమలాకర శర్మ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య వెలుదండ నిత్యానందరావు, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షులు నందిని సిధారెడ్డి, ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌ సి కాశీం, డీన్‌ ఫ్యాకల్టీ ఆఫ్‌ ఆర్ట్స్‌ ఆచార్య సైద తలత్‌ సుల్తానాలు ప్రసంగించారు. ఈ సదస్సులో తెలంగాణ పద సాహిత్యంపై ప్రామాణికమైన పరిశోధన పత్రాలను సమర్పించారు. రాష్ట్రంలోని సబ్బండ వర్గాల వారి సాంస్కృతిక విశేషాలను, తాత్విక విషయాలపై పద కవుల సాహిత్యంపై లోతైన విశ్లేషణలు అవసరమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ సదస్సు స్ఫూర్తితో పలువురు పద కర్తలపై విస్తృతమైన పరిశోధనలు సమగ్రంగా జరగడానికి దారులు ఏర్పడ్డాయని అభిప్రాయపడ్డారు. ఈ సదస్సులో తెలుగు పాఠ్యప్రణాళికా సంఘం అధ్యక్షులు ఏలే విజయలక్ష్మి, తెలుగుశాఖ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఎస్‌ రఘు, విస్తాలి శంకర్రావు, పిసి వెంకటేశ్వర్లు, బాణాల భుజంగరెడ్డి, ఇమ్మిడి మహేందర్‌, అవుసుల భాను ప్రకాష్‌ తదితరులు ప్రసంగించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -