Tuesday, October 21, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుప్రతి ఒక్కరూ సిటిజన్‌ పోలీసే

ప్రతి ఒక్కరూ సిటిజన్‌ పోలీసే

- Advertisement -

ఏ సమస్య వచ్చినా పోలీసుల దృష్టికి తేవాలి : హైదరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌
సీపీగా బాధ్యతలు స్వీకరణ

నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రతి ఒక్కరూ సిటిజన్‌ పోలీసే అని.. ఏ సమస్య ఉన్నా పోలీసుల దృష్టికి తీసుకురావాలని హైదరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ అన్నారు. హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌గా ఆయన మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఉదయం 8:29 నిమిషాలకు బంజారాహిల్స్‌లోని కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో సీవీ ఆనంద్‌ నుంచి ఆయన బాధ్యతలు చేపట్టారు. ఆర్టీసీ ఎండీగా ఉన్న ఆయనను ప్రభుత్వం నగర సీపీగా బదిలీ చేసిన సంగతి తెలిసిందే. 1996 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి వీసీ సజ్జనార్‌ గతంలో సైబరాబాద్‌ కమిషనర్‌గా పని చేశారు. నగర సీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు.

నగరంలో నేరాలను తగ్గించడంతోపాటు మాదకద్రవ్యాల నివారణ, ట్రాఫిక్‌ సమస్యలను పరిష్కరించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. నేరస్థుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, గేమింగ్‌ యాప్స్‌, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌లపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. హైదరాబాద్‌ పోలీసులు మీ పోలీసులని.. ఏ సమస్య వచ్చినా తమకు తెలపాలని కోరారు. ముందుగా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని, అక్కడ పరిష్కారం కాకుంటే ఏసీపీ వద్దకు వెళ్లాలని సూచించారు. ఆ తర్వాత పైస్థాయి అధికారికి లేదా నేరుగా తన దృష్టికి తీసుకొచ్చినా పర్వాలేదన్నారు. ఎక్కడ శాంతి భద్రతలు బాగుంటాయో ఆ నగరం అభివృద్ధి చెందుతుందని, హైదరాబాద్‌ ఇమేజ్‌ను మరింత పెంచేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు సీపీలు, జాయింట్‌ సీపీలు, అన్ని జోన్ల డీసీపీలు, ఏసీపీలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -