Thursday, December 18, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంస్పీకర్‌ నిర్ణయానికి అందరూ కట్టుబడాల్సిందే

స్పీకర్‌ నిర్ణయానికి అందరూ కట్టుబడాల్సిందే

- Advertisement -

ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌
తీర్పునకు సీఎం రేవంత్‌రెడ్డికి సంబంధం లేదని వ్యాఖ్య


నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ నిర్ణయానికి అంతా కట్టుబడి ఉండాల్సిందేనని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాతే స్పీకర్‌ మెరిట్‌ ఆధారంగా తీర్పు ఇచ్చారని గర్తు చేశారు. స్పీకర్‌పై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని ఖండించారు. బుధవారం అనర్హత పిటిషన్లపై స్పీకర్‌ తీర్పు అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కూడా ఫిరాయింపులపై మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందన్నారు. టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్‌ను క్యాబినెట్‌లోకి తీసుకున్న విషయాన్ని మరిచిపోయారా ? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని మంత్రిర్గంలోకి తీసుకున్న సంగతి గుర్తు లేదా ? అని అడిగారు. పదేండ్లల్లో 39 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్‌లోకి చేర్చుకున్న నీచ చరిత్ర మీదని విమర్శించారు. ప్రతిపక్షాలు చేసిన ఫిర్యాదులను ఏనాడూ బీఆర్‌ఎస్‌ సర్కారు పట్టించుకోలేదని గుర్తు చేశారు. ఫిరాయింపులపై మాట్లాడుతున్న ఎమ్మెల్యే వివేక్‌ కూడా టీడీపీ నుంచి బీఆర్‌ఎస్‌లోకి వెళ్లాడని చెప్పారు.

కోరుట్ల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా ఉండి కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ఓటింగ్‌కు పాల్పడి సస్పెండ్‌ అయ్యాడనీ, ఇప్పుడు ఆయన కొడుకు సంజరు ఫిరాయింపులపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాజ్యాంగబద్దంగా ఇరుపక్షాల వాదనలు విన్నతర్వాతే బీఆర్‌ఎస్‌ అనర్హత పిటిషన్లను స్పీకర్‌ డిస్మిస్‌ చేశారని స్పష్టం చేశారు. స్పీకర్‌ తీర్పుపై బీఆర్‌ఎస్‌ హైకోర్టుకు వెళ్లొచ్చు, ఆపై కోర్టులకు కూడా పోవచ్చన్నారు. తమకు అనుకూలంగా తీర్పు వస్తే ఒకరకంగా, రాకపోతే మరోరకంగా బీఆర్‌ఎస్‌ వ్యవహరిస్తున్నదని విమర్శించారు. స్పీకర్‌ ఏకపక్ష నిర్ణయం తీసుకోలేదని వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మూడు దశల్లో కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులు ఘన విజయం సాధించారని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డిపైన కడుపు మంటతోనే బీఆర్‌ఎస్‌ నాయకులు కండ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని అన్నారు. పదేండ్లల్లో ప్రజాస్వామ్యాన్నీ ఖూనీ చేసిన చరిత్ర బీఆర్‌ఎస్‌ది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్‌ తీర్పుకు, సీఎం రేవంత్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదన్నారు. లియోనల్‌ మెస్సీలాంటి దిగ్గజ ప్రపంచ ఫుట్‌బాల్‌ ఆటగాడు హైదరాబాద్‌కు వచ్చినా బీఆర్‌ఎస్‌ వాళ్లు ఓర్వలేకపోయారని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -