Thursday, August 28, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్Heavy Rain Warnings: భారీ వర్ష సూచనల నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలి

Heavy Rain Warnings: భారీ వర్ష సూచనల నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలి

- Advertisement -

– కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

– సీ.పీ సాయి చైతన్య తో కలిసి వరద ఉద్ధృతిపై సమీక్ష

– ముంపు ప్రాంతాలలో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం

నవతెలంగాణ నిజామాబాద్ సిటీ:

రానున్న 48 గంటల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన దృష్ట్యా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. పట్టణాలు, గ్రామాలు, తండాలలో ప్రజలను కూడా అప్రమత్తం చేయాలని, ఎక్కడ కూడా ఏ చిన్న అవాంచనీయ సంఘటన చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుండి పోలీస్ కమిషనర్ సాయి చైతన్యతో కలిసి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి గురువారం ఉదయం నుండి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో నెలకొని ఉన్న పరిస్థితులను సమీక్షించారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాల వల్ల ఎక్కడెక్కడ చెరువులు, కుంటలు, వాగులు తెగిపోయాయి, ముంపునకు గురైన నివాస ప్రాంతాలు, దెబ్బతిన్న రోడ్లు, పడిపోయిన విద్యుత్ స్తంభాలు, కొట్టుకుపోయిన ట్రాన్స్ఫార్మర్లు తదితర వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, క్షేత్రస్థాయి అధికారులకు తక్షణ సహాయక చర్యలపై దిశా నిర్దేశం చేశారు.

వరద ముంపునకు గురయ్యే ప్రమాదం పొంచి ఉన్న గ్రామాలు, తండాల ప్రజలను హుటాహుటిన పునరావాస కేంద్రాలకు, సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. వరద ఉధృతి పెరిగే అవకాశాలు ఉన్నందున అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ, ప్రజలను కూడా మైకుల ద్వారా అప్రమత్తం చేయాలని కలెక్టర్ సూచించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిన గ్రామాలలో తక్షణమే విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయా శాఖల అధికారులు, సిబ్బంది కార్యస్థానాల్లో అందుబాటులో ఉంటూ, క్షేత్రస్థాయి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, ఎక్కడైనా ప్రజలకు ఇబ్బందులు ఏర్పడితే వెంటనే సహాయక చర్యలు చేపట్టేలా అన్ని విధాలుగా సన్నద్ధం అయి ఉండాలన్నారు.

రానున్న 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, అత్యవసరం అయితేనే ప్రజలు ఇళ్ళ నుండి బయటకు రావాలని కలెక్టర్ హితవు పలికారు. ఈ మేరకు అన్ని నివాస ప్రాంతాలలో టాంటాం, మైకుల ద్వారా ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాల వద్దకు ప్రజలు ఎవరూ వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, చేపల వేట, ఈత కోసం చెరువులు, కాలువలు, రిజర్వాయర్లలోకి దిగకుండా కట్టడి చేయాలని, అవసరమైన చోట పోలీసు బందోబస్తు, పికెటింగ్ లను ఏర్పాటు చేయించాలని ఆదేశించారు. అవసరమైన వెంటనే సహాయక చర్యలు చేపట్టేలా జేసీబీలు, ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచుకోవాలని మున్సిపల్ కమిషనర్లను, ఎంపీడీఓలు, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులను ఆదేశించారు.

కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసి, ప్రజలకు వరద పరిస్థితిపై సమాచారం తెలియజేస్తూ అప్రమత్తం చేయాలన్నారు. తెగిన విద్యుత్ వైర్ ల సమీపంలోకి ప్రజలు వెళ్ళకుండా చూడాలన్నారు. శిథిలావస్థకు చేరిన ఇళ్ళలో ఉంటున్న వారిని తక్షణమే ఖాళీ చేయించాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందస్తుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అన్నారు. అన్ని శాఖల అధికారులు పరస్పరం సమన్వయంతో పనిచేస్తూ, భారీ వర్షాల వల్ల జిల్లాలో ఎలాంటి ఘటనలు జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. సమీక్షలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad