నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పోలీస్ కేసులు పెట్టడం, జైలుకు పంపడం అనే విధంగా మారిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ పట్టణ ముఖ్య నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, వార్డు, బూత్ కమిటీ నాయకులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు హాజరై పార్టీ శ్రేణులకు రాబోవు ఎన్నికలపై దిశ నిర్దేశం చేశారు. గత పదేండ్ల కాలంలో సిరిసిల్ల మానేరు మండుటెండల్లో నిండుగ పారేది. కాంగ్రెస్ వచ్చాక ఎడారిలా మార్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో సాయి రెడ్డి అనే వ్యక్తి ఇంటి ముందు గోడ కట్టి అతడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆయన అన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ ఏ ఒక్క పథకాన్ని ఆపకుండా అమలు చేశాం.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎన్నికల సమయంలో వారు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయడం లేదు. పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ పాలనలో రెండు లక్షల కోట్లు అప్పు మాత్రమే చేసిందని ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎనిమిది లక్షల కోట్లు అప్పులు చేశామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారనీ ఆయన మండిపడ్డారు. ప్రజా క్షేత్రంలో ఇప్పటికీ కేసీఆర్ పాలనను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని కెసిఆర్ కు మళ్లీ ఓటు వేసేందుకు ఎదురుచూస్తున్నారు. నాయకులు ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజా సమస్యలపై పోరాటం చేయాల్సిన సమయం ఇది. ఎక్కడికి అక్కడ తమ పరిధిలో ఉన్న సమస్యలపై పోరాటం చేయండి. పల్లెల్లో వీధి దీపాలు వెలగడం లేదు. సానిటేషన్ జరగడం లేదు. తదితర సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయండి. యూరియా కొరతతో కాంగ్రెస్ నాయకులకు గ్రామాల్లో తిరిగే ముఖం లేకుండా పోయిందనీ అన్నారు.
బి ఆర్ ఎస్ హయాంలో పదేళ్లపాటు అందరికీ మంచి చేశాం తప్ప ఎవరికి చెడు చేసే అలవాటు మనకు లేదు. ఎవరైనా మన జోలికి వస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైకు పడితే హామీల అమలుపై మాట్లాడమంటే, బూతులు మాత్రమే మాట్లాడుతున్నాడు. 42 శాతం కాంట్రాక్టు పనులు బీసీలకు ఇస్తామన్నాడు, బీసీ సబ్ ప్లాన్ అమలు చేస్తా అన్నాడు. అది కూడా చేయలేదన్నారు. సిరిసిల్ల వస్త్ర వ్యాపారులు.. విద్యుత్ బిల్లులు సబ్సిడీ ద్వారా చెల్లిస్తామని ప్రభుత్వం పైన ఒత్తిడి చేయండి. రాబోవు ఎలక్షన్లకు అందరం సిద్ధంగా ఉండాలి. ఎంపీటీసీ, జడ్పిటిసి స్థానాలు అన్నింటిలో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది.
గ్రామాలు మండలాల వారిగా ఇన్చార్జీలను నియమిస్తాం. ప్రజల వద్దకు వెళ్ళండి. కాంగ్రెస్ ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను వీడియోలుగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టులు చేయండి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మీరంతా నాకోసం పని చేశారు. రాబోవు మున్సిపల్ ఎన్నికలలో నేను మీ విజయం కోసం పనిచేస్తా అని భరోసా ఇచ్చారు. ఈ సమీక్షలో నాస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, సెస్ చైర్మన్ రామారావు, పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, జెడ్పీ మాజీ అధ్యక్షురాలు తుల ఉమా, ఆకునూరీ శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు.
రాబోయే ఎన్నికలకు సిద్దంగా ఉండాలి: కేటీఆర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES