Thursday, April 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రతి ఒక్కరికీ ఉచిత విద్య, వైద్యం అందాలి

ప్రతి ఒక్కరికీ ఉచిత విద్య, వైద్యం అందాలి

- Advertisement -

వామపక్ష ప్రభుత్వాలను ఆదర్శంగా తీసుకోవాలి : మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి

‘తెలంగాణ బడ్జెట్‌ 2026-భవిష్యత్‌ ఆకాంక్షలు’ పై రౌండ్‌ టేబుల్‌
నవతెలంగాణ-ముషీరాబాద్‌

ప్రజలకు ప్రతి ఒక్కరికీ ఉచిత విద్య, వైద్యం అందించాలంటే వామపక్ష పాలిత కేరళం రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. తెలంగాణ అధ్యయన సమాలోచన కేంద్రం (టాస్క్‌) ఆధ్వర్యంలో హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘తెలంగాణ బడ్జెట్‌ 2026-భవిష్యత్‌ ఆకాంక్షలు’ అనే అంశంపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేరళంలో 100 శాతం అక్షరాస్యతతోపాటు ఉచిత విద్య, వైద్యం అందరికీ అందుతున్నాయని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్‌లో సుమారు 60 శాతం నిధులను స్థానిక సంస్థలకు కేటాయించడం ద్వారా ప్రజల సమస్యలను వారు స్వయంగా పరిష్కరించుకునే విధంగా కేరళం ముందంజలో ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా అలాంటి విధానాన్ని అనుసరించాలని సూచించారు. రాష్ట్ర బడ్జెట్‌ కేటాయింపులు వాస్తవాలకు దూరంగా ఉంటున్నాయని విమర్శించారు. ఆదాయం-ఖర్చుల మధ్య సమతుల్యత లేకుండా కేవలం అంకెల పరంగా పెద్ద బడ్జెట్‌ చూపిస్తున్నారని, కానీ కేటాయించిన నిధుల్లో సగం కూడా ఖర్చు చేయడం లేదని అన్నారు. మిగిలిన నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు.

ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకటించే ముందు ఆర్థిక నిపుణులను సంప్రదించడం లేదన్నారు. అధికారంలోకి రావడమే లక్యంగా మ్యానిఫెస్టో ప్రకటిస్తున్నారని విమర్శించారు. ప్రతి ఒక్కరికీ ఉచిత విద్య, వైద్యం అందించేందుకు బడ్జెట్‌లో నిధులను పెంచాలని డిమాండ్‌ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి తగిన కేటాయింపులు చేయడం లేదన్నారు. బడ్జెట్‌ శాస్త్రీయ విధానంలో ఉండాలని, ప్రజల అవసరాలకే వినియోగించాల్సిన నిధులను స్వప్రయోజనాలకు మళ్లిస్తే జవాబుదారీతనం కనుమరుగవుతుందని చెప్పారు. బడ్జెట్‌ సమావేశాల కంటే ముందే ఇది పెడితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్‌లో బీజేపీ పాలిత రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇచ్చి, ఇతర రాష్ట్రాలపై వివక్ష చూపుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమానికి రూ.లక్ష 60 వేల కోట్లు కేటాయించిందని తెలిపారు. వడ్డీలు, ఈఎంఐల రూపంలో రూ.42 వేల కోట్లు చెల్లిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల అమలుకు కట్టుబడి ఉందన్నారు.

ప్రతిపక్షం బడ్జెట్‌పై సార్వత్రిక చర్చకు రాకుండా వ్యక్తిగత విమర్శలకే పరిమితమవుతోందన్నారు. బస్తీ దవాఖానాల్లో డాక్టర్లు, మందుల కొరత లేకుండా మంత్రి దామోదర రాజనర్సింహ కృషి చేస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్సీ డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ మాట్లాడుతూ.. బడ్జెట్‌లో అంకెల గారడీ ఎక్కువైందని విమర్శించారు. ప్రభుత్వ ఆదాయం పెరగకపోవడంతో లోటు బడ్జెట్‌ పరిస్థితి నెలకొన్నదన్నారు. కేంద్రం నుంచి సుమారు రూ.21 వేల కోట్లు రావాల్సి ఉండగా.. రూ.7000 కోట్లు మాత్రమే వచ్చాయన్నారు. టాస్క్‌ కన్వీనర్‌ ఎర్రోజు శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. విద్యారంగానికి నిధులు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సామాజిక సాధికారతకు కీలకమని చెప్పారు. బడ్జెట్‌ అమలులో లోపాలు ఉన్నాయని ప్రొఫెసర్‌ కృష్ణారెడ్డి విమర్శించారు. ఈ సమావేశంలో టాస్క్‌ ప్రతినిధులు, నిపుణులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. డాక్టర్‌ ఎర్రోజు శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టాస్క్‌ కో కన్వీనర్‌ హెచ్‌.రవీందర్‌, నగర కన్వీనర్‌, జి.రూబీ స్టీవెన్‌ సన్‌, ఆసరి రాజు, డాక్టర్‌ సాజిదాఖాన్‌, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -