– కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
ప్రతి ఒక్కరూ బాధ్యతగా ట్రాఫిక్ నియమాలను పాటించాలని కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య అన్నారు. శనివారం మండలంలోని నాగాపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా కమ్మర్‌పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో అరైవ్.. అలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే ప్రజల సహకారం ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా ట్రాఫిక్ నియమాలను పాటించాలని కోరారు.
అనంతరం కమ్మర్‌పల్లి ఎస్ఐ జి.అనిల్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో భద్రతా ప్రమాణాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి తమ ప్రాణాలను కాపాడుకోవాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ఇది ప్రమాద సమయంలో ప్రాణరక్షణ కవచంలా పనిచేస్తుందని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, అతివేగం ప్రమాదకరమని హెచ్చరించారు. మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కంపదండి అశోక్, ఉప సర్పంచ్ శశిధర్, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు అశోక్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.



