అందరూ కనెక్ట్‌ అవుతారు

చైతన్య రావ్‌, లావణ్య జంటగా నటించిన చిత్రం ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’. ఈ చిత్రాన్ని బిగ్‌ బెన్‌ సినిమాస్‌ పతాకంపై యష్‌ రంగినేని నిర్మించారు. చెందు ముద్దు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈనెల 21న విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్రయూనిట్‌ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత యష్‌ రంగినేని మాట్లాడుతూ, ‘ఫస్ట్‌ మేం ఈ సినిమాను మల్టీ స్క్రీన్లలోనే రిలీజ్‌ చేస్తున్నాం. కొన్ని సెలెక్టెడ్‌ ప్లేస్‌ల్లోనే సింగిల్‌ స్క్రీన్లలో వేస్తున్నాం. మౌత్‌ టాక్‌ బాగుంటే.. ఆ తరువాత స్క్రీన్లు పెంచుతాం. ఈ సినిమాను మేం నిజాయితీగా తీశాం. సినిమా బాగా వచ్చింది’ అని తెలిపారు.
‘టెక్నాలజీ, కమ్యూనికేషన్‌ సిస్టం లేని టైంలో కథను చెప్పాలని అనుకున్నాం. రెట్రో ఫీలింగ్‌ తీసుకురావాలనే ఉద్దేశంతోనే 80ల నేపథ్యంలో కథను చెప్పాను. చిన్నా, పెద్దా అందరూ కూడా ఈ సినిమాకు కనెక్ట్‌ అవుతారు. నేను నిజ జీవితంలో చూసిన పాత్రలు, మా ఊర్లోని సంఘటనల స్ఫూర్తితో రాసుకున్న కథ’ అని దర్శకుడు చెందు ముద్దు అన్నారు. హీరో చైతన్య రావ్‌ మాట్లాడుతూ, ‘నా పాత్రను చెందు అద్భుతంగా డిజైన్‌ చేశారు. ఈ సినిమా అందర్నీ మెప్పిస్తుంది’ అని అన్నారు. నాయిక లావణ్య మాట్లాడుతూ, ‘ఇందులో పోషించిన గౌతమి పాత్ర నాకు ఛాలెంజింగ్‌గా అనిపించింది. అశ్లీలత అనేది లేకుండా సినిమా తీశామనే కాంప్లిమెంట్స్‌ వస్తున్నాయి’ అని తెలిపారు.

Spread the love