బీఆర్‌ఎస్ కథ ఒడిసిన ముచ్చటే
మళ్లీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే : నాగర్‌కర్నూల్‌లో పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్
నవతెలంగాణ -మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
”కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్‌ఎస్ నాయకులు చెప్పేవన్నీ అబద్ధాలే.. బీఆర్‌ఎస్ పార్టీ కథ ఇక ముగిసినట్టే.. కనుచూపు మేరలో ఆ పార్టీ కోలుకునే పరిస్థితి లేదు.. మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు.. కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత తనదైన రాజకీయ దారిలో ముందుకు సాగుతూ సొంత పార్టీ పెట్టుకుంటున్నారు.. మళ్లీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే..” అని పీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో మంగళవారం సంఘటన్ శ్రీజన్ అభ్యయన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో బీఆర్‌ఎస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించారని, లక్షల ఎకరాలకు నీరు అందించామని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. వాస్తవానికి చాలా తక్కువ ప్రాంతానికే సాగునీరు అందిందని, ఈ విషయాన్ని కేసీఆర్ సన్నిహితులే బయట పెడుతున్నారని చెప్పారు. బీఆర్‌ఎస్‌లో అంతర్గత విభేదాలు స్పష్టంగా బయటపడుతున్నాయన్నారు. బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తామని కలలు కంటోందని, కానీ ప్రజలు వారి పాలనను బాగా గుర్తుంచుకున్నారని అన్నారు.
ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి మాట్లాడుతూ.. పదేండ్లు అభివృద్ధికి నోచుకోని నాగర్‌కర్నూల్ నియోజకవర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చెప్పారు. బీఆర్‌ఎస్ పాలనలో అవినీతి, అక్రమాలు, కమీషన్లు, దోపిడీలతో ప్రజలు విసిగిపోయారన్నారు. ఏ నాయకుడు చేయలేని విధంగా వెయ్యి కోట్ల రూపాయలతో నాగర్‌కర్నూల్‌ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, సీడబ్ల్యూసీ మెంబర్ వంశీ చందర్‌రెడ్డి, ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, మున్సిపల్ చైర్మెన్ సునేంద్ర, మార్కెట్ కమిట్ చైర్మెన్ రమణరావు పాల్గొన్నారు.
కాళేశ్వరంపై బీఆర్‌ఎస్ చెప్పేవన్నీ అబద్ధాలే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



