– మళ్లీ మొదటికి ఆర్‌ఆర్‌ఆర్
– ఉత్తరభాగం ఆరు వరుసలకు పెంపు
– అలైన్‌మెంటు మార్పు తప్పనిసరి
– కేంద్ర ఆర్థికశాఖ ఆమోదం కోసం ఎదురుచూపులు
బి.బసవపున్నయ్య
రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్)కు బాలారిష్టాలు తప్పడం లేదు. ట్రాఫిక్ నేపథ్యంలో నాలుగు వరుసలను ఆరు వరుసలుగా మార్చడంతో వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. అలైన్‌మెంటు మార్చాల్సిన పరిస్థితి రావడంతో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) తిరిగి మొదటి నుంచి ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తరభాగానికి సంబంధించిన పనులు, ప్రణాళికలు, నిధుల కేటాయింపు అంశాలను పున్ణపరిశీలిస్తున్నది. అలైన్‌మెంటు మార్పుతో భూసేకరణ పెరగనుంది. ఇప్పటికే రైతుల నుంచి వ్యతిరేకత వస్తుండటంతో ప్రాజెక్టు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర ఆర్థికశాఖ ఆర్‌ఆర్‌ఆర్ నార్త్ వింగ్‌కు అనుమతి మంజూరు చేయలేదు. మూడు నెలల క్రితం జరిగిన కేంద్ర క్యాబినెట్‌లో రాష్ట్రానికి సంబంధించి రింగ్ రైల్‌తోపాలు ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగానికి గ్రిన్‌సిగల్ ఇవ్వలేదు. రాజకీయ కారణాలతో పెండింగ్‌లో పెట్టింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నిరసన వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రికి ప్రత్యేకంగా లేఖ రాసింది. వివక్ష చూపడం సరికాదని సీఎం స్పష్టంగా ఆలేఖలో పేర్కొన్నారు. ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగం సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్) ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్నది. 2017లో రూ.17 వేల కోట్లతో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగా, 2019లో నిర్మాణం ప్రారంభమైంది. ఆర్థిక సమస్యలతో పాటు కోవిడ్ సహా అనేక కారణాలతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం ఆలస్యమవుతోంది.
ఉత్తర భాగం
158 కిలోమీటర్ల మేర ఉత్తర భాగాన్ని నిర్మించనున్నారు. అయితే ఇప్పటికే అన్నీ పూర్తయిన ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగం డీపీఆర్ , భూసేకరణ సైతం కొలిక్కి వస్తున్న దశలో నాలుగు వరుసల రహదారిని కాస్త ఆరు వరుసల రహదారిగా మార్చాలని నిర్ణయించారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఉత్తర భాగానికి కేంద్రమే పూర్తిస్థాయిలో నిధులు సమకూర్చనుంది. భూసేకరణ 90 శాతం పూర్తయింది. వరుసలు మారడంలో ఇప్పుడ అలైన్‌మెంటు కూడా మార్చాల్సి వస్తున్నది. పలు జాతీయ రహదారుల గుండా వెళుతున్నది. ఎన్‌హెచ్ 44, హెచ్ 65, ఎన్‌హెచ్ 163, ఎన్‌హెచ్ 765 కలుపుతూ సాగుతున్నది. హైదరాబాద్ నగరానికి 40 నుంచి 50 కిలోమీటర్లు ఉండగా, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 50 కిలోమీటర్లు ఉంటుంది. 2026 నాటికి పూర్తిచేయాలనే లక్ష్యంతో ఉంది. సంగారెడ్డి, నర్సాపూర్, తుఫ్రాన్, గజ్వేల్, భువనగిరి, చౌటుప్పల్ గుండా వెళుతుంది.
ప్రయోజనాలు
ఆర్‌ఆర్‌ఆర్‌తో వేగంగా ప్రయాణించడం, రియల్ ఎస్టేట్, కొత్త వ్యాపార అవకాశాలు పెరుగుతాయి. ప్రాంతీయాభివృద్ధి వేగిరమవుతుంది. రియల్ ఎస్టేట్‌తో భారీగా భూముల ధరలు పెరగనున్నాయి. ఉత్తర భాగం 2026 నాటికి, దక్షిణ భాగం 2027-2028 నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా ఉంది. అయితే ఆర్థిక, సాంకేతిక అంశాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాజకీయాల కారణంగా తీవ్రంగా ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సర్కారు ఆశలు
ఆర్‌ఆర్‌ఆర్‌పైన ప్రస్తుత సర్కారు భారీగా ఆశలు పెట్టుకుంది. ఉత్తర, దక్షిణ భాగాలతో రాష్ట్ర రాజధాని చుట్టూ భారీ అభివృద్ధి ప్రాజెక్టులు వస్తాయని భావిస్తున్నది. మెట్రోను సైతం నలుమూలల విస్తరిస్తున్నది. కొత్త కొత్త టౌన్‌షిప్‌ల రాకతో రాష్ట్ర రాజధానిపై జనాభా భారం తగ్గుతుందని అంచనా. ఫ్యూచర్ సీటీ ప్రణాళికకు ఆర్‌ఆర్‌ఆర్, రింగ్ రైల్ కీలకం కానున్నాయి. దీంతో కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచుతున్నది. వచ్చే రెండేండ్లల్లో పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నా, ఆ పరిస్థితి కనుచూపు మేరలో కనిపించడం లేదు. 2029 ఎన్నికల తర్వాతే ఈ ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని ఎన్‌హెచ్‌ఏఐ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అన్నీ అవాంతరాలే..
ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగానికి డీపీఆర్ పూర్తయిన వెంటనే కేంద్రం ఆమోదించకపోవడంతో సమస్యలు మొదలయ్యాయి. ఖర్చును ఎవరు భరించాలనే విషయమై ఆలస్యంగా నిర్ణయం తీసుకోవడం కూడా ఇందుకు కారణం. చివరకు రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్రం గ్రిన్‌సిగల్ ఇచ్చింది. ఈలోపు జరగాల్సిన ఆలస్యం జరిగిపోయింది. తాజాగా పెరుగుతున్న ట్రాఫిక్ కారణంగా ఉత్తర భాగం డీపీఆర్ పున:పరిశీలించారు. నాలుగు లేన్లను ఆరు లేన్లుగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. భూముల ధరలు పెరగడంతో రైతులకు న్యాయంగా పరిహారం ఇచ్చే ప్రక్రియ వేగంగా సాగడం లేదు. దీంతో భూములు ఇవ్వడానికి అంగీకరించిన వారంతా కోర్టుకు వెళుతున్నారు. ఉత్తర భాగానికి గత ఏడాది కాలంగా నాలుగుసార్లు టెండర్లు పిలిచారు. అయినా కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. సాంకేతిక బిడ్లు ఓకే అవుతున్నా, ఆర్థిక బిడ్ల విషయంలో వర్కింగ్ ఏజెన్సీలు భయపడుతున్నాయి. ఆరు వరుసలుగా అలైన్‌మెంట్‌ను మార్చాల్సి రావడంతో అందుకోసం డీపీఆర్‌ను సవరించాల్సి వస్తున్నది. డీపీఆర్ బడ్జెట్ సైతం పెరుగుతున్నది. అలైన్‌మెంటులో మార్పులు వస్తాయి. దింతో కేంద్ర ఆర్థికశాఖ పెండింగ్‌లో పెట్టింది. కేంద్రంలోని మోడీ సర్కారు రాజకీయ ప్రయోజనాలను ఆశిస్తుండటంతో ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగం పరిస్థితి ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కిలా తయారైంది.