Sunday, November 2, 2025
E-PAPER
Homeసోపతిఅంతా అవినీతి మయం - అంతం చేయాలి మనమిక!

అంతా అవినీతి మయం – అంతం చేయాలి మనమిక!

- Advertisement -

అందు గల దిందు లేదని సందేహము లేదు, ఎందెందు వెదకినా అందందే గలదు అవినితి మానవేశ్వరా! ఇదీ నేటి మానవవాదం మనుజులారా! అవినితికి రంగు లేదు, రుచి లేదు, వాసనలేదు, రూపం లేదు. కంటికి కనిపించని దేవుడ్ని మాత్రం పంచ రంగులలో, పలు రూపాలలో, పలు నామాలతో ఆదరిస్తుంటారు. అదే తీరున అవినీతినీ ఆదరిస్తున్నది మానవాళి. అసలు అవినితి అంటే ఏమిటి?

అవినితి అంటే మితి మీరిన స్వాతంత్య్రం అనుకోవచ్చు. అంతేకాదు, ఆధిపత్యం, ఫాసీతత్వం, అభ్యుదయానికి అభిమతం కానిది అవినీతి అని భావించాలి. ఇవన్నీ మితిమీరితే చివరికి అవినీతి’దారికే చేరేది: అవినీతికి వ్యతిరేకంగా నూటికో కోటికో ఒకరున్నా, వారు ఇది అవినీతి, ఇది తగదు అని రుజువులతో తర్కించినా నూటికి తొంభై మంది జనం అవినీతి సాగరంలో ముప్పొద్దులూ మునిగితేలుతూనే వున్నారు అంటే అతిశయోక్తి కాదేమో?

అవినీతి అనేది కేవలం డబ్బు అనుకోవడం ఎట్టి పరిస్థితిలోనూ అంగీకరించలేం. అవినీతి అంటే మరీ కచ్చితంగా చెప్పుకోవాల్సి వస్తే, సొంతం కాని శక్తులన్నింటినీ అక్రమ మార్గాలలో దోచుకోవడమే అనాలి. అవినీతి డబ్బు, సంపద, మాట, మానవ సంబంధాలు, ఇచ్చిపుచ్చుకునే క్విడ్‌ ప్రోకోతత్వం, ప్రకతి వనరుల దోపిడి మొదలగు అంశాలన్నింటిలోనూ నిక్షిప్తం అయి వుంది. విశ్వజనీకం అయింది. అయితే ఈ అవినీతి నేటి రోజులలోనేనా? ముందెన్నడూ లేదా? అంటే ఎప్పుడూ ఉందనే చెప్పుకోవాలి. వేదకాలం నాటి నుండి ఉన్నదే ఈ అవినీతి. కాకుంటే ఆదిమ కాలంలో, రాతి యుగంలో, మధ్య యుగంలో ఈ అవినీతికి స్పష్టమగు ఆధారాలు ఉండకపోవచ్చు. కానీ వేదకాలం నుండి మాత్రం అవినీతి రాజ్యమేలుతూనేే ఉందని ఘంటాపదంగా చెప్పుకోవచ్చు.
హేతువాదాన్ని కాసేపు పక్కనపెడదాం! భావవాదుల ముచ్చట్లను చర్చించి అవినీతి భాగోతమేమిటో చూద్దాం!

దేవతలు, రాక్షసులు పాల సముద్రాన్ని చిలికి దేవతలు రాక్షసుల్ని మోసం చేసి అమృతాన్ని సేవించారన్నది అవినీతే కదా! దేవుడు, దేవర, పవిత్రత, దుష్టశిక్షణ, శిష్టరక్షణ అన్నీ సొల్లుకబుర్లు కాదా? భావవాదుల గ్లోబర్‌ ప్రచారం కాదా? ఇంద్రజాలం, మహేంద్రజాలం అనబడే సంస్కృత పదజాలం సైతం అవినీతికి ఆలవాలమే. ఇక ఇప్పటి అవినీతిని గురించి చర్చించుకుందాం. యథారాజా తథా ప్రజా లోకోక్తి మనందరికీ తెలిసిన అంశమే కదా! ఆ లోకోక్తికి అర్థం పాలించే రాజు ఏ మార్గంలో పయనిస్తే ఆ ఏలుబడిలోని ప్రజలూ ఆ బాటలోనే నడుస్తారు అనే కదా! దీనిని బట్టి మనం మన పొరుగున వున్న శ్రీలంక, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, ఆఫ్గనిస్తాన్‌, నేపాల్‌ వంటి దేశాలలో పాలించిన ఆ దేశాధినేతలు మితిమీరిన అతినీతితో రాజ్యమేలి, విలాసాలు, వినోదాలు, విందులు, చిందులు, సర్వభోగాలతో తులతూగి ప్రజలను గాలికొదిలేసిన అవినీతి కారణంతోనే వారి వారి దేశాలలో విధ్వంసాలు, విచ్ఛిన్నాలు జరిగి, చివరికి ప్రజలుతిరుగుబాట్లు చేసి తరిమి తరిమి కొట్టారు.
తుదముట్టించారు. ఇవన్నీ మన కళ్లముందు జరిగిన నగసత్యాలు.

ఇక అగ్రరాజ్యం అని ప్రకటించుకుని సిగ్గూ ఎగ్గూ, మానవత్వం సహితం మరచి ఆధిపత్యంతో పలుదేశ ప్రభుత్వాలను నిలువునా కూల్చడం, యుద్ధోన్మాదంతో లక్షలాది ప్రజానికాన్ని పిల్లాజల్లా, చిన్నాపెద్ద, ముసలి ముతక అనే తేడాలు చూడకుండా మట్టుపెట్టి, నీతిమాలిన చట్టాలతో వాణిజ్యాలు వెలగబెడుతూ సంపద పోగేసుకోవడం అవినీతి కాదా! అందుకు సాక్ష్యం ఇజ్రాయెల్‌ ఇరాన్‌ల యుద్ధాలు, ఆ యుద్ధాలు అమెరికా జోక్యం లేకుండా జరుగుతున్నాయా? జోక్యం కాదు, యుద్ధభూమిలో ప్రత్యక్షం కాలేదా? గాజా సర్వనాశనమై ఆకలి కేకలతో అలో లక్ష్మణా అనే ఆర్తనాదాలు చేస్తూనే ఉంది కదా! ఇక ప్రజల అవినీతి పరిస్థితులను సమీక్షించుకుందాం! యదార్దవాదులంగా తప్పక సమీక్షించుకోవాల్సిందే మానవ సమాజం దిద్దుబాటుకు రావాల్సిందే. ప్రజలు ఓటుకు నోట్లు, సారాబుడ్ల కొరకు లజ్జా విహీనులై ఎగబడి తెగబడి తీసుకుంటూ మత్తులో గుద్దేస్తున్నారు తప్ప విచక్షణ అనే పదాన్ని పొరపాటున కూడా ఉచ్ఛరించే దశలో కూడా లేరనుకోవాలి.

ఇంకా పచ్చినిజానికి పోతే నిత్యావసర వస్తువులు, విలాసాల విన్యాసాల, ధనకనక వస్తు వహనాలు, పొలం పుట్రలు… దేనికి బడితే దానికి చేతులు చాచి చివరికి ఒక్కో నియోజక వర్గానికి ఒక్కో అభ్యర్థికి వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయిస్తున్నారు. రకరకాల అసాంఘిక కార్యక్రమాలతో, దొంగ మార్గాలతో గెలుపోటములకు ఆజ్యాలు అవుతున్నారు. అలా అవినీతి మయం ఈ జగం. ఇది ముమ్మాటికీ నిజం. అవినీతి పెచ్చుమీరిన నాడు విశ్వంలో ఆర్థికంగా, సామాజికంగా వైజ్ఞానికంగా అంతరాలు పెచ్చుమీరి, శాంతి, సౌభాగ్యం, సౌహార్థ్రత నశించి విచ్ఛిన్నం విధ్వంసాలతో యుద్దాలతో గుంపులు గుంపులుగా, దేశదేశాలుగా మానవాళి నశిస్తుందే తప్ప పురోగమనం ఎక్కడుంటుంది? మానవుడు నాగరికుడు అని ఎలా అనిపించుకుంటాడు?

ఈ అవినీతిని అంతం చేయగలమా? అని సందేహం వద్దు. అంతం చేయగలం. మానవునికి అసాధ్యం ఏదీ లేదు. ఇది అనాలోచిన, ఆవేశపు మాట కానేకాదు. ఒక్కసారి మానవ పరిణామ క్రమాన్ని మననం చేసుకోండి. ఈనాటి అంతరిక్షయానం, శాస్త్రసాంకేతికాభివృద్ధి మరో అక్షర సత్యం. దేవుడు, దెయ్యం, డబ్బు, సంపదల సృష్టి మానవునిదేగా! ఏదో నాటికి మానవుడు తన మూఢ నమ్మకాలను వీడక తప్పదు. అది ఏ ఒక్కరితోనో సాధ్యంకాదు. కానీ ప్రజలు ఐక్యంగా ఆలోచించడం, సంఘాలు కట్టడం, తిరుబాట్లు చేయడంతో మార్పు రాక తప్పదు. అవినీతి అంతం కాక తప్పదు. కులమతాల గోడలు బద్దలవుతూ భిన్నత్వంలో ఏకత్వం నినాదం విప్లవాత్మ మార్పును తెస్తూ ప్రజలలో ఐకమత్యం, దేశాభిమానం వంటి అభివృద్ధి మార్గదర్శకం అవుతుంది. కనుక సంఘటిత శక్తితో అభిమతం కాని ఏ శక్తినైనా అంతం చేయగలం. అవినీతి సమాజాభితం కాదుకదా! అందుకే అవినీతిని అంతం చేయగలం. యువనాయకత్వంలోనే విజయాలు. నేడు యువశక్తికి కొదువ లేదు కదా!

  • బోడపాటి అప్పారావు, 9381509814
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -