Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeట్రెండింగ్ న్యూస్మహా నిమజ్జనానికి సర్వం సిద్ధం

మహా నిమజ్జనానికి సర్వం సిద్ధం

- Advertisement -

సాగరతీరాన ఒక బాహుబలి క్రేన్‌ సహా 40 క్రేన్‌లు : జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో

గ్రేటర్‌లో మహా వినాయక నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. గణేష్‌ నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా అన్ని విభాగాల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేశామని హైదరాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. శుక్రవారం హుస్సేన్‌సాగర్‌ క్రేన్‌ 4, 5 పాయింట్‌ వద్ద నిమజ్జన ఏర్పాట్లను మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ.కర్ణన్‌, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ దాసరి హరిచందన, ఖైరతాబాద్‌ జోనల్‌ కమిషనర్‌ అనురాగ్‌ జయంతితో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మార్గ దర్శకత్వంలో జీహెచ్‌ఎంసీ, పోలీస్‌ శాఖలతోపాటు అన్ని విభాగాలు వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు కృషి చేస్తున్నాయని చెప్పారు. గణేష్‌ ఉత్సవ సమితులతో సమన్వయం చేస్తూ మహా నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేశామని, ఇప్పటి వరకూ గ్రేటర్‌ పరిధిలో 1.50 లక్షల విగ్రహాల నిమజ్జనం పూర్తయిందని తెలిపారు. హుస్సేన్‌సాగర్‌ చుట్టూ సజావుగా నిమజ్జనం జరిగేలా ఒక బాహుబలి క్రేన్‌ సహా మొత్తం 40 క్రేన్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. గణేష్‌ ఉత్సవ సమితితో సమన్వయం చేసుకుంటూ ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జనం వీలైనంత త్వరగా పూర్తయ్యేలా చూస్తామన్నారు. అలాగే, బాలాపూర్‌ శోభాయాత్ర సాఫీగా సాగేందుకు ఊరేగింపు మార్గం రోడ్ల మరమ్మతులు చేశామన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు నిమజ్జన కార్యక్రమాలు, శోభాయాత్ర ఆటంకాలు లేకుండా సాగేందుకు 30 వేల మంది పోలీసులు, షీ టీమ్‌లతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేస్తున్నామన్నారు.

ప్రజలందరికీ ఆహ్వానం
హుస్సేన్‌సాగర్‌లో ఆధ్యాత్మిక వాతావరణంలో కన్నుల పండువగా జరిగే గణేష్‌ నిమజ్జన వేడుకలను తిలకించేందుకు రావాలని రాష్ట్ర ప్రజలకు మంత్రి ఆహ్వానం పలికారు. నగరంలో నిమజ్జన శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు నిర్వాహకులు, ప్రజలు అధికార యంత్రాంగానికి పూర్తి సహకారం అందించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

ఇన్సిడెంట్‌ ఫ్రీగా జరిగేలా ఏర్పాట్లు..: మేయర్‌
మహా నిమజ్జనం వేడుకలు ఇన్సిడెంట్‌ ఫ్రీగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశామని జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి చెప్పారు. నగర వ్యాప్తంగా నిమజ్జన పాయింట్‌ల వద్ద 134 స్టాటిక్‌ క్రేన్‌లు, 269 మొబైల్‌ క్రేన్‌లు ఏర్పాటు చేశామన్నారు. పోలీస్‌, ఇతర ప్రభుత్వ శాఖలు, విభాగాల సహకారంతో నిమజ్జనం సజావుగా జరిగేలా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వి.కర్ణన్‌, అధికారులు పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. నిమజ్జన పాయింట్లలో 200మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచామన్నారు. 15 వేల మంది శానిటేషన్‌ సిబ్బందితో పారిశుధ్య కార్యక్రమాలు నిరంతరాయంగా చేపడుతున్నామని, లేక్‌లలో క్లీనింగ్‌ను 24గంటలు చేపడుతున్నట్టు వివరించారు.

భారీ బందోబస్తు
గణేష్‌ నిమజ్జనోత్సనం నేపథ్యంలో హైదరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో 35వేల మందికిపైగా పోలీస్‌ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుండటంతో ఆ ప్రాంతాలను హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ డీజీ సివి ఆనంద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ డా.సుధీర్‌బాబు ప్రత్యక్షంగా పరిశీలించారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 25వేల మందికిపైగా పోలీసులతోపాటు 125 ప్రత్యేక బలగాలను రంగంలోకి దించారు. రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 6 వేల మంది పోలీసులతోపాటు అదనంగా మరో వెయ్యి మంది సిబ్బందిని అందుబాటులోకి తెచ్చారు. నిమజ్జన ప్రక్రియ ఆలస్యం కాకుండా అవసరమైన క్రేన్లను ఏర్పాటు చేశారు. డ్రైవర్లను, మేకానిక్‌లను, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. రాత్రిపూట నిమజ్జన సమయంలో ప్రమాదాలకు ఆస్కారముందని, నిర్వాహకులు అప్రమత్తంగా వ్యవహరించాలని సీపీలు సూచించారు. మద్యం సేవించి నిమజ్జన ప్రక్రియలో పాల్గొనొద్దని చెప్పారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad