Thursday, November 13, 2025
E-PAPER
Homeజాతీయంఅంతా చెత్తే

అంతా చెత్తే

- Advertisement -

భారతీయ టీవీ న్యూస్‌ ఛానల్స్‌పై ఎన్‌.రామ్‌ ఆగ్రహం
బీహార్‌ కవరేజీ దారుణంగా ఉంది
విశ్లేషణలు, మదింపులు లేనే లేవు
ఏకపక్షంగా రిపోర్టింగ్‌ చేసిందంటూ మీడియాపై మండిపాటు

న్యూఢిల్లీ : ప్రపంచంలోని చెత్త టీవీ న్యూస్‌ ఛానల్స్‌లో భారతదేశానికి చెందినవి కూడా ఉన్నాయని ప్రముఖ పాత్రికేయుడు, ది హిందూ పత్రిక మాజీ ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌, ప్రచురణకర్త ఎన్‌.రామ్‌ మండిపడ్డారు. బీహార్‌ ఎన్నికలపై మీడియా కవరేజీగురించి చర్చించడానికి, విశ్లేషించడానికి ఆయన ‘ది వైర్‌’ పోర్టల్‌ కోసం కరణ్‌ థాపర్‌కు 24 నిమిషాల ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘ప్రసార టెలివిజన్‌ చాలా దారుణంగా ఉంది. హిందీ టీవీ రంగాన్ని చూసినా లేదా జాతీయ వార్తా ఛానల్స్‌గా పిలవబడుతున్న వాటిని చూసినా చాలా వరకూ దారుణంగా ఉన్నాయి. దాదాపుగా చాలా ఎక్కువగా…’ అని అన్నారు.

బీహార్‌ ఎన్నికల ప్రచారంలో మీడియా కవరేజికి సంబంధించిన అంశాలపై ప్రశ్నించగా ర్యాలీలలో ప్రధాని లేదా హోం మంత్రి ప్రసంగించిన ప్రతిసారీ మన టీవీ ఛానల్స్‌ ప్రత్యక్ష ప్రసారం చేశాయని విమర్శించారు. ఆ సమయంలో ఆయా ఛానల్స్‌ వార్తా ప్రసారాలు చేస్తున్నప్పటికీ వాటిని మధ్యలో ఆపేసి ప్రసారం చేశారని, మంత్రులు తాము గతంలో చెప్పిన విషయాలనేపదే పదే ప్రస్తావిస్తున్నా ఛానల్స్‌ ధోరణి మారలేదని చెప్పారు. ప్రభుత్వానికి, టీవీ ఛానల్స్‌కు మధ్య ఉన్న సంబంధాలను రామ్‌ వివరించారు. టీవీ ఛానల్స్‌ మొత్తం హిందూత్వతో నిండి ఉన్నాయని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం, టీవీ ఛానల్స్‌ మధ్య సంబంధం గట్టి పడిందని వ్యాఖ్యానించారు. దేశంలోకి చొరబాటుదారులు ప్రవేశించి ఓటర్లుగా మారుతున్నారంటూ ప్రధాని, హోం మంత్రి చెబుతున్నప్పటికీ భారత మీడియా వారిని విమర్శించలేకపోతోందని అన్నారు. నేతల వ్యాఖ్యలు ముస్లింలను లక్ష్యంగా చేసుకొని చేసినవేనని చెప్పారు. దీనిని ఎండగట్టడంలో, బయటపెట్టడంలో, ఖండించడంలో భారతీయ మీడియా వైఫల్యం కొట్టొచ్చినట్లు కన్పిస్తోందని రామ్‌ తెలిపారు.

బీహార్‌ ఎన్నికల ప్రచార సమయంలో మీడియాకు ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వని నితీష్‌ కుమార్‌, నరేంద్ర మోడీ, రాహుల్‌ గాంధీలను రామ్‌ విమర్శించారు. మీడియా కూడా దీనిని పట్టించుకోలేదని చెప్పారు. ఎన్నికల చర్చలకు రావాల్సిందిగా వివిధ పార్టీల సీనియర్‌ నేతలను ఒప్పించడంలో కూడా మీడియా విఫలమైందని అన్నారు. ఎన్డీఏ, మహాగట్‌బంధన్‌…ఈ రెండు కూటములు ఇచ్చిన అలవికాని హామీల అమలులో ఆర్థిక పరమైన సాధ్యాసాధ్యాలను విశ్లేషించడంలోనూ, మదింపు చేయడంలోనూ, ఒక అభిప్రాయానికి రావడంలోనూ కూడా మీడియా విఫలమైందని తెలిపారు. తేలికగా చేయదగిన పనిని కూడా మీడియా చేయలేకపోయిందని వ్యాఖ్యానించారు. మొత్తంమీద ప్రచార కవరేజీ ఉత్సాహభరితంగా సాగిందని అంగీకరిస్తూనే రిపోర్టింగ్‌ పరంగా అది ఏకపక్షంగా ఉన్నదని, అందులో లోతైన విశ్లేషణ లోపించిందని ఎన్‌.రామ్‌ తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -