Friday, October 17, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంగాజాలో ఎటు చూసినా విధ్వంసమే

గాజాలో ఎటు చూసినా విధ్వంసమే

- Advertisement -

కుప్పలు కుప్పలుగా పడి ఉన్న శిథిలాలు
ఇజ్రాయిల్‌ మారణహోమం మూల్యం 70 బిలియన్‌ డాలర్లు
పునర్నిర్మాణం అంత ఈజీ కాదు


గాజా : ఇజ్రాయిల్‌ మారణహోమం కారణంగా చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లాచెదురై ఇతర ప్రాంతాల్లో తల దాచుకుంటున్న వేలాది మంది గాజా వాసులు కాల్పుల విరమణ తర్వాత తిరిగి స్వస్థలాలకు చేరుకుంటున్నారు. కానీ అక్కడి దృశ్యాలు వారిని కలచి వేస్తు న్నాయి. జనావాసాలన్నీ ఇజ్రాయిల్‌ దాడిలో ఎప్పుడో నేలమట్టమయ్యాయి. ఇప్పుడక్కడ శిథిలాలు మాత్రమే దర్శన మిస్తున్నాయి. సర్వం కోల్పోయిన బాధి తులకు ఇళ్లు నిర్మించి ఇవ్వడం, వ్యాపా రాలను తిరిగి ప్రారంభించడం, మూత పడిన సంస్థలను తెరవడం, జనజీవ నాన్ని గాడిలో పెట్టడం…ఈ పనులు అంత తేలికగా పూర్తయ్యేవి కావు. గాజాలో ఇజ్రాయిల్‌ సాగించిన విధ్వం సం కారణంగా 70 బిలియన డాలర్ల నష్టం జరిగిందని ఐక్య రాజ్యసమితి అంచనా వేసింది.

మౌలిక వసతులపై దృష్టి
శిథిలాల తొలగింపు భగీరథ ప్రయత్నమే. ఆ పని పూర్తయిన తర్వాత నీరు, పారిశుధ్యం, విద్యుత్‌ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టాల్సి ఉంటుంది. గాజా ప్రజలకు తక్షణమే సురక్షితమైన తాగునీరు అందించాలి. 2023 సెప్టెంబర్‌ 7వ తేదీ తర్వాత ఈ ప్రాంతం లోని 600 నీరు, పారిశుధ్య సౌకర్యాలు ధ్వంసమ వడమో లేదా దెబ్బతినడమో జరిగింది. మురుగు నీటి యాజమాన్యం కూడా చాలా ముఖ్య మైనదే. అది సరిగా లేకుంటే వ్యాధులు ప్రబలుతాయి. గాజాలో డయేరియా వ్యాధి ఎక్కువగా ఉంది. ఇది చిన్నారుల ప్రాణాలను హరిస్తుంది. కొన్ని చోట్ల కలరా ముప్పు కూడా పొంచి ఉంది. గాజాలో ఆరు మురుగు నీటి శుద్ధి ప్లాంట్లు ఉండగా అవన్నీ ఇజ్రాయిల్‌ దాడిలో పూర్తిగా ధ్వంస మయ్యాయి. రక్షిత మంచినీరు అందించే ప్లాంట్లు కూడా దెబ్బతిన్నాయి. ఇప్పుడు పనులు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థంకావడం లేదని సహాయ సిబ్బంది అంటున్నారు.

శిథిలాల కుప్పలు
గాజా ప్రాంతంలో 84 శాతం మేర విధ్వంసం జరిగిందని పాలస్తీనియన్ల కోసం ఐరాస చేపట్టిన అభివృద్ధి కార్యక్రమానికి ప్రత్యేక ప్రతినిధిగా వ్యవహరిస్తున్న జాకో సిల్లియర్స్‌ చెప్పారు. గాజా సిటీ వంటి కొన్ని ప్రాంతాల్లో దీని స్థాయి 92 శాతం వరకూ ఉంది. ఇప్పుడు అక్కడ ఎక్కడ చూసినా శిథిలాలే కన్పిస్తున్నాయి. గాజాలో 60 మిలియన్‌ టన్నుల శిథిలాలు పేరుకుపోయాయని ఓ అంచనా. పునర్నిర్మాణ పనులు చేపట్టాలంటే ముందుగా యుద్ధం మిగిల్చిన శిథిలాల కుప్పలను తొలగించాల్సి ఉంటుంది. దారుణమేమంటే ఈ శిథిలాలలో ఆవాసాల అవశేషాలే కాదు…మానవ కళేబరాలు, పేలని బాంబులు కూడా ఉన్నాయి. ముందుగా వాటిని జాగ్రత్తగా తొలగించి ధ్వంసం చేయాల్సిన అవసరం ఉంది. తొలగించిన భవన శిథిలాలను నిర్మాణాలకు పునాదులుగా ఉపయోగించుకోవచ్చు. కానీ ఆవాసాల నిర్మాణానికి పెద్ద ఎత్తున సామగ్రిని దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది.

దెబ్బతిన్న పంటలు… మూతపడ్డ బడులు
యుద్ధంతో వ్యవసాయ రంగం పూర్తిగా కుదేలైపోయింది. గాజా స్ట్రిప్‌లో 82.4 శాతం వార్షిక పంటలు, 97 శాతానికి పైగా చెట్ల పంటలకు నష్టం వాటిల్లింది. మానవతా సాయంపై దీర్ఘకాల ఆంక్షలతో ఆహార భద్రత కరువైంది. గాజా నగరాన్ని సెప్టెంబరులో కరువు ప్రాంతంగా ప్రకటించారు. యుద్ధానికి ముందు గాజా జనాభాలో దాదాపు సగం మంది 18 సంవత్సరాల లోపు వయసున్న వారే. కాబట్టి జనజీవనం తిరిగి సాధారణ స్థాయికి చేరుకోవాలంటే వెంటనే పాఠశాలల నిర్మాణాన్ని చేపట్టాల్సి ఉంటుంది. యుద్ధ సమయంలో నిర్వాసితులకు పాఠశాలల్లోనే పునరావాసం కల్పించారు. దీంతో ఇజ్రాయిల్‌ దళాలు వాటిని లక్ష్యంగా చేసుకొని బాంబు దాడులు జరిపాయి. ఇప్పుడు 91.8 శాతం పాఠశాల భవనాలను పూర్తిగా పునర్నిర్మించడమో లేక వాటికి భారీగా మరమ్మతులు చేయడమో జరగాల్సి ఉంది.

ఇజ్రాయిల్‌ దాడిలో ముగ్గురు పాలస్తీనియన్లు మృతి..
కాల్పుల విరమణ అమల్లో వున్నా ఇజ్రాయిల్‌ సైన్యం దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఇజ్రాయిల్‌ సైన్యం జరిపిన దాడిలో ముగ్గురు పాలస్తీనియన్లు మరణించినట్టు మీడియా వర్గాలు గురువారం తెలిపాయి. గాజా మరియు ఈజిప్ట్‌ మధ్య రఫా క్రాసింగ్‌ను ప్రజల రాకపోకల కోసం తెరవడం ఆలస్యమవుతుందని ఇజ్రాయిల్‌ ప్రభుత్వ సంస్థ తెలిపింది. గాజా కాల్పుల విరమణ విఫలమైతే హమాస్‌ను ఓడించేందుకు సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయాలని ఇజ్రాయిల్‌ రక్షణ మంత్రి సైన్యాన్ని ఆదేశించినట్లు మీడియా వెల్లడించింది .

దశాబ్దాలు పట్టొచ్చు
ఇక ఇజ్రాయిల్‌ దాడిలో నేలమట్టమైన ఆవాసాలకు లెక్కే లేదు. గాజాలో 2,82,904 ఇళ్లు, అపార్ట్‌మెంట్లు దెబ్బతినడమో లేదా ధ్వంసం కావడమో జరిగిందని ఐరాస ఉపగ్రహ కేంద్రం తెలిపింది. అయితే ఇంతకంటే ఎక్కువ విధ్వంసమే జరిగిందని చెబుతున్నారు. గాజా నగరంలో హమాస్‌ పాలనలో ఉన్న ఓ మున్సిపాలిటీలో 90 శాతం రహదారులు పనికి రాకుండా పోయాయి. గాజాలో జనావాసాల నిర్మాణానికి దశాబ్దాల సమయం పట్టవచ్చు. గాజాలో విద్యుత్‌ పరిస్థితి అయితే మరింత ఘోరంగా ఉంది. యుద్ధం ప్రారంభం కావడానికి ముందే అక్కడ సంక్షోభం నెలకొంది. గాజాలో ప్రతి రోజూ కొద్ది గంటలు మాత్రమే విద్యుత్‌ సరఫరా జరిగేది. ఇజ్రాయిల్‌ నుంచి సరఫరాలు ఆగిపోయాయి. ఇంధన కొరత కారణంగా గాజా పవర్‌ ప్లాంటు మూతపడింది. సౌర విద్యుత్‌ సౌకర్యాలు దెబ్బతిన్నాయి. గ్రిడ్‌ పనిచేయకపోవడంతో డీజిల్‌ జనరేటర్లు, సోలార్‌ ప్యానల్స్‌పై ఆధారపడాల్సిన పరిస్థితి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 80 శాతానికి పైగా విద్యుదుత్పత్తి, పంపిణీ వ్యవస్థలు ధ్వంసమయ్యాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -