Tuesday, August 5, 2025
E-PAPER
Homeజాతీయంఎటు చూసినా కన్నీళ్లే

ఎటు చూసినా కన్నీళ్లే

- Advertisement -

– ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు నీటమునిగిన పలు ప్రాంతాలు
– ప్రయాగ్‌రాజ్‌లో గంగానది ఒడ్డునున్న ఇండ్లల్లోకి చేరిన నీరు
– కొట్టుకుపోయిన ఆహారపదార్థాలు
– ఇండ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిన ప్రజలు
– రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు

బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ ఒంటిచేత్తో చిన్నారిని ఎత్తుకుని నదిని దాటడాన్ని చూశాం. అలాంటిదే సేమ్‌ టు సేమ్‌ సీన్‌ రిపీటైంది. అయితే ఇది రీల్‌ కాదు రియల్‌. ప్ర్రయాగ్‌ రాజ్‌లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఈ దృశ్యం కనిపించింది. బఘాడాలో నడుముపై వరకు ఉన్న నీటిలో నవజాత శిశువును రక్షించడానికి తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్న వీడియోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. అక్కడ భారీ వర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నగరాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇండ్లు నీటమునిగాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇక మూగజీవాల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ప్రాణాలు కాపాడుకునేందుకు ఆవులు నాలుగంతస్తుల భవనాలు ఎక్కేశాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది.
ప్రయాగ్‌రాజ్‌ : దేశవ్యాప్తంగా రుతుపవనాల రాక వాతావరణ పరిస్థితులను పూర్తిగా మార్చివేసింది. ఉత్తరప్రదేశ్‌తో సహా ఉత్తర భారతదేశం మొత్తం భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా నదుల నీటి మట్టం పెరిగి అనేక నగరాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వారణాసితో సహా అనేక నగరాల్లో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.

వరదల్లో యూపీలోని 17 జిల్లాలు
యూపీలోని 17 జిల్లాలు వరదల్లో చిక్కుకున్నాయి. వీటిలో 16 జిల్లాల్లో గంగా-యమునా విధ్వంసం సృష్టించాయి. ప్రయాగ్‌రాజ్‌ నుంచి బల్లియా వరకు గంగా నది ఒడ్డున ఉన్న ప్రాంతాలు నీట మునిగాయి. ప్రయాగ్‌రాజ్‌ నగరంలోని సలోరి, రాజాపూర్‌, దారాగంజ్‌, బాఘడ వంటి ప్రాంతాలు మునిగిపోయాయి. మీర్జాపూర్‌, వారణాసి, చందౌలి, బల్లియాలోనూ పరిస్థితి దుర్భరంగా ఉంది. ఉత్తర-ఆగేయ-పశ్చిమ నుంచి మొత్తం సంగమ ప్రాంతం విశాలమైన సముద్రంలా కనిపిస్తుంది.
ప్రయాగ్‌రాజ్‌లో పరిస్థితి మరింత దారుణం
ప్రయాగ్‌రాజ్‌లో గంగా-యమునా సంగమం తర్వాత వచ్చే ప్రాంతాలు అధ్వానంగా ఉన్నాయి. సంగమం తర్వాత గంగ ముందుకు కదిలినప్పుడు, యమునా నీరు దానిలో కలిసిపోయింది. యమునా నుంచే గంగ మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ల మీదుగా ప్రవహిస్తుంది. మీర్జాపూర్‌ నుంచి బల్లియా వరకు గంగా అలలు భయానకంగా ఎగిసిపడుతున్నాయి.
ప్రమాద హెచ్చరికలు
నదులు సంగమమయ్యే నగరమైన ప్రయాగ్‌రాజ్‌లో వరద ఉధృతి పెరిగితే.. గంగా, యమునా నది ఎక్కడ ఉందో కనుక్కోవడం కష్టమే. కిలా ఘాట్‌ నుంచి ఝాన్సీ వరకు ప్రతిదీ సమానంగా మారింది. ప్రయాగ్‌రాజ్‌లో రెండు నదులు ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. గంగా నదిలోని తెరారు ప్రాంతాలలో అత్యంత దారుణ పరిస్థితి ఉంది. బేలా కచ్చర్‌, రాజపూర్‌, తెలియార్‌గంజ్‌, సోనావోటి, బఘాడ అనేవి గంగానది ప్రవాహ ఉప్పెనలో ఉన్న ప్రాంతాలు కాగా..అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది.
జలదిగ్బంధం
ప్రయాగ్‌రాజ్‌లో గంగా ఒడ్డున ఉన్న వందలాది ఇండ్లలోకి వరద నీరు ప్రవేశించింది. ఆహార పదార్థాలు నీటిలో కొట్టుకుపోయాయి. కర్జన్‌ వంతెన, శంకర్‌ ఘాట్‌ చుట్టూ చాలా ఇండ్లు పూర్తిగా నీట మునిగిపోయాయి. దీంతో అక్కడి ప్రజలు తమ ఇండ్లను వదిలి సురక్షిత ప్రదేశాలకు వెళ్లక తప్పలేదు.
వరద బాధితులను రక్షించ టానికి ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి. వారికి ఆహార పదార్థాలు, అవసరమైన మందులను అందిసు న్నాయి.అంతేకాక వరదల కారణంగా విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తుండటంతో అక్కడ అంధకారం అలుముకుంది. ఇక రహదారులపై వాహనాలు రాకపోకలు సాగించాల్సిన చోట పడవలు తిరుగుతున్న పరిస్థితి. మూగజీవాల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -