Saturday, February 14, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకాంగ్రెస్‌ ప్రజావ్యతిరేక పాలనకు నిదర్శనం

కాంగ్రెస్‌ ప్రజావ్యతిరేక పాలనకు నిదర్శనం

- Advertisement -

మాజీమంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో 700కు పైగా స్థానాల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు కాంగ్రెస్‌ ప్రజా వ్యతిరేక పాలనకు నిదర్శనమని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్‌ అక్రమాలు, దౌర్జన్యాలకు ఎదురొడ్డి కార్పొరేటర్లు, కౌన్సిలర్లుగా గెలిచి సత్తా చాటిన బీఆర్‌ఎస్‌ నాయకులకు శుక్రవారం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్‌ అరాచక, అప్రజాస్వామిక విధానాలకు తగిన రీతిలో బుద్ధి చెప్తూ బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన గులాబీ నాయకులు, కష్టపడిన కార్యకర్తలు, సోషల్‌ మీడియా సైనికులందరికీ ధన్యవాదాలు ప్రకటించారు. ముఖ్యమంత్రి, మంత్రులు సహా ప్రభుత్వ యంత్రాంగం ఒక్కటై కొట్లాడినా మున్సిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపును అడ్డుకోలేకపోయారని తెలిపారు. అధికార దుర్వినియోగం, డబ్బు రాజకీయాలు, బెదిరింపులు అన్నింటినీ తట్టుకుని గెలిచిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల విజయం కాంగ్రెస్‌ అప్రజాస్వామిక పాలనకు చెంపపెట్టు అని పేర్కొన్నారు. పల్లె, పట్టణం తేడా లేకుండా రెండున్నరేండ్ల కాంగ్రెస్‌ పాలనలో అభివృద్ధి మందగించిందనీ, ఎన్నికల హామీలు గాలిలో కలిసిపోయాయనీ, సంక్షేమ పథకాలు అటకెక్కాయని విమర్శించారు. అందువల్లే పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార పార్టీకి ఓటు అనే కొరడాతో ప్రజలు బుద్ధి చెప్పారని తెలిపారు. కాంగ్రెస్‌ను గద్దె దించే శక్తి బీఆర్‌ఎస్‌కు మాత్రమే ఉందనీ, భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేది తామేనని పేర్కొన్నారు. ప్రజల ఆశీస్సులతో తెలంగాణలో గులాబీ జెండా ఎగరేసేందుకు పోరాటం చేస్తూనే ఉంటామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -