Wednesday, April 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఈవీలు ఇన్‌..పల్లెవెలుగు అవుట్‌

ఈవీలు ఇన్‌..పల్లెవెలుగు అవుట్‌

- Advertisement -

డిపోల్లోకి ఎర్రబస్సులకు ‘నో’ఎంట్రీ
ఆర్టీసీలో సంస్కరణలతో ఉద్యోగాలకు ఎసరు
సర్కారు మాట నీటిమీద రాత
ఆందోళనలో ఉద్యోగులు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ పేరుతో ఆర్టీసీలో ఉద్యోగాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎసరు పెడుతున్నది. విద్యుత్‌ బస్సుల పేర కొత్త విధానం తెలంగాణ ఆర్టీసీలో అమలవుతున్నది. నూతన పాలసీ ద్వారా ఈవీలను భారీసంఖ్యలో రోడ్లమీదకు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈమేరకు తొలుత రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని 25 డిపోల పరిధిలో విద్యుత్‌ బస్సులు తిరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ విధానమైన క్యూర్‌ పరిధిలో 2027 నాటికి మొత్తం 2800 విద్యుత్‌ బస్సులను ప్రవేశపెట్టాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకు న్నది.ఈమేరకు ఈవీ పాలసీని అమల్లోకి తీసుకొచ్చారు. ప్రభుత్వపరంగానే గాక ప్రయివేటుపరంగా కూడా ఈవీలను ప్రొత్సహించాలనే లక్ష్యంతో రిజిస్ట్రేషన్‌ ట్యాక్స్‌, లైఫ్‌ట్యాక్స్‌లను ఇప్పటికే రవాణా శాఖ రద్దుచేసింది. ఈవీ వాహానాలను ప్రొత్సహించే ఉద్దేశంతో ప్రభుత్వ ఉద్యోగులకు 10 నుంచి 20 శాతం రీబేటును కల్పించేలా ఆయా కంపెనీలను సర్కారు ఒప్పించింది. ఈవీలకు పన్ను మినహా యింపు ఇవ్వడంతో గత ఏడాది రావాల్సిన రవాణా శాఖ ఆదాయంలో రూ. 300 కోట్ల మేర తగ్గింది.

ఈవీల రాక
ఈవీల రాకతో టీజీఎస్‌ఆర్టీసీలో సంస్కరణల వేగం పుంజుకుంది. ఇప్పటికే అనేక రకాల రాయితీ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ద్వారా అమలు చేస్తున్నది. తాజాగా మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలకు కల్పించింది. అంతేగాక ఇతరత్రా పథకాలు ఇంకా చాలానే ఉన్నాయి. ఆ మేరకు ఆర్టీసీకీ రావాల్సిన బకాయిలను చెల్లించడంలో సర్కారు తీవ్ర ఆలస్యం చేస్తున్నది. తాజాగా ఈవీలను ఆర్టీసీ ద్వారా రంగ ప్రవేశం చేయించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని దాదాపు అన్నీ డిపోల్లో విద్యుత్‌ బస్సులు తిరుగు తున్నాయి. ఇంతవరకు బాగానే ఉంది. పర్యావరణం పరిరక్షణ, కాలుష్యం నివారణ పేర ఈవీలను భారీగా ఆర్టీసీలోకి రానున్నాయి. దీంతో పాతకాలపు పల్లెవెలుగు బస్సులు కనుమరుగయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.ఇప్పటికే భారీ సంఖ్యలో ఈవీలు కనిపిస్తున్నాయి. వీటితో ఆర్టీసీకి ఎలాంటి సంబంధం లేదు. అయితే ఈవీ బస్సులు ప్రయివేటు సంస్థ నిర్వహిస్తున్నది. వీటి కోసం ఆర్టీసీ డిపోల ను వాడుకుంటున్నారు. ఇది ఎంతవరకు వచ్చిందంటే విద్యుత్‌ బస్సులకోసం ఆర్టీసీ బస్సులను ఆయా డిపోల నుంచి ఖాళీ చేయిస్తున్నారు. వాటిని ఎక్కడ పార్కింగ్‌ చేయాలో ఆర్టీసీ అధికారులకు పాలుపోవడం లేదు. కాగా పాత ఆర్టీసీ బస్సులను రెట్రోపిట్టింగ్‌ ద్వారా ఈవీలుగా మార్చే ప్రక్రియకు సైతం ఆర్టీసీ ఇప్పటికే శ్రీకారం చుట్టింది.

ఉద్యోగుల రీక్యాటగిరైజైషన్‌
విద్యుత్‌ బస్సుల రాకతో ఉద్యోగులకు ఎలాంటి నష్టం జరగదని ఆర్టీసీ యాజమాన్యంతోపాటు సర్కారు కూడా హామీ ఇచ్చింది. ఇప్పుడు అందుకు పూర్తి విరుద్ధంగా పరిస్థితి తయారైంది. సర్కారు మాట నీటిమీద రాతే అయింది. ఇప్పటికే డిపోలను ఈవీ బస్సులకు కేటాయిస్తుంటే, డ్రైవర్‌, కండక్టర్‌, మెకానిక్‌లు మిగులు సిబ్బందిగా పరిగణించి గ్రేటర్‌ హైదరాబాద్‌ బయట డిపోలకు పంపించే పక్రియ ప్రారంభమైంది.రీక్యాటగిరిజైషన్‌ కోసం ఆష్పన్‌ ఇవ్వాలని ఉద్యోగులను ఆర్టీసీ కోరుతున్నది. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ఆర్టీసీ సంఘాలు పోరాటాలవైపు మళ్లుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -