– ఓవర్లోడ్ ఆటోలో ప్రాణాలను పణంగా పెట్టిన రాకపోకలు
– ఆశ్రమ పాఠశాల యాజమాన్యం నిర్వాకం పై విమర్శలు
నవతెలంగాణ – అశ్వారావుపేట
పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థినుల పరిస్థితి అశ్వారావుపేట ప్రాంతంలో ఆందోళన కలిగిస్తోంది. మండల పరిధిలోని భీముని గూడెం గిరిజన సంక్షేమ శాఖ బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు దమ్మపేట మండలం దుర్గం గొల్లిగూడెంలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రానికి ప్రతిరోజు ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణం చేస్తున్నట్లు తెలుస్తోంది.
సుమారు 6 కిలోమీటర్ల దూరాన్ని చిన్న గూడ్స్ ఆటోలోనే 50 మందికి పైగా విద్యార్థినులను కిక్కిరిసిన పరిస్థితుల్లో తరలిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. మండుతున్న ఎండల్లో కనీస రక్షణ లేకుండా నిలబడి ప్రయాణించడం వల్ల విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నిబంధనల ప్రకారం పరీక్షా కేంద్రం వద్దే విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పించాల్సి ఉన్నప్పటికీ, నెలరోజుల పరీక్షల షెడ్యూల్ కారణంగా ప్రతిరోజూ ఆటోలోనే రాకపోకలు నిర్వహించడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇంతమంది విద్యార్థులను ఒకే వాహనంలో తరలించడం వల్ల ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు తీసుకుంటారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వడదెబ్బ లేదా రోడ్డు ప్రమాదం సంభవించినా విద్యార్థుల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ విషయంపై సంబంధిత పాఠశాల హెచ్ ఎం పద్మావతిని ఫోన్ ద్వారా సంప్రదించగా పరీక్షలు షెడ్యూల్ సుమారు నెలపాటు ఉండటంతో పరీక్షా కేంద్రం లో వసతి,మా పర్యవేక్షణ లేమి కలగకుండా మేమే మా వసతి గృహం నుండి పరీక్ష రోజు మాత్రమే తీసుకెళ్ళి తీసు కొస్తున్నామని అన్నారు మా.నీడ ఉన్న ఆటోలో సురక్షితంగా తరలించవచ్చు కదా అన్న ప్రశ్నకు చిన్న ఆటోలు దొరకలేదు అని సమాధానం ఇచ్చారు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి విద్యార్థినుల భద్రత దృష్ట్యా సరైన రవాణా మరియు వసతి సౌకర్యాలు కల్పించాలని తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.ప్రభుత్వ కార్యక్రమాలకు, కాంగ్రెస్ రాజకీయ సభలకు జనాలను తరలించేందుకు బస్సు లు ఏర్పాటు చేసే పాలకులు విద్యార్థుల పరీక్షలు కు రక్షిత రవాణా సౌకర్యం కల్పించలేక పోవడం విచారం అని పలువురు ప్రజాస్వామిక వాదులు డిమాండ్ చేస్తున్నారు.



