Saturday, May 17, 2025
Homeసోపతిపరీక్షా ఫలితాలే జీవితానికి ఫైనల్‌ కాదు

పరీక్షా ఫలితాలే జీవితానికి ఫైనల్‌ కాదు

- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షలు ముగిశాయి. ఫలితాలు వస్తున్నాయి. ఆనందం, ఆశ, ఆందోళన, బాధ… అన్ని కలగలసిన భావోద్వేగాలు. అయితే… ఫలితాల ఒత్తిడిలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు ప్రతీ ఏటా పెరుగుతున్నాయి. ఇవి మనసును కలచివేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే ఇంటర్‌ ఫలితాల తర్వాత పలు దురదష్టకర సంఘటనలు చోటు చేసుకున్నాయి.

పరీక్షల్లో ఫెయిల్‌ కావొచ్చు. తక్కువ మార్కులు రావొచ్చు. వాటికి రాయడానికి మళ్ళీ అవకాశాలు ఉంటాయి కానీ జీవితం మాత్రం ఒక్కటే. ఒక్క ఫలితంతో మన భవిష్యత్తు ముగుస్తుందనే భావన అత్యంత ప్రమాదకరం. ఒక్కసారి ఆలోచించండి… ఫలితం జీవితానికి అంతిమ తీర్పు కాదు. మన ప్రయత్నం, పట్టుదలే నిజమైన ప్రమాణాలు. క్షణికావేశం శాశ్వత నష్టం!
పరీక్షలు మార్గాలు చూపిస్తాయి, గమ్యాన్ని కాదు
పరీక్షలో వచ్చిన మార్కులు ఓ అంచనా మాత్రమే. ప్రతిభ, సామర్థ్యం, భవిష్యత్తు ఇవన్నీ ఒక్క పరీక్ష ఫలితంతో కొలవలేం. ప్రపంచంలో ఎందరో మహానుభావులు చదువులో ఫెయిల్‌ అయినప్పటికీ జీవితంలో చరిత్ర సష్టించారు. ఐన్‌స్టీన్‌, ఎడిసన్‌, డా. కలాం లాంటి వారు మనకు స్పష్టమైన ఉదాహరణలు.
తల్లిదండ్రులు ఆలోచించాల్సింది
పిల్లలు విజయవంతం కావాలనేది ప్రతి తల్లి తండ్రి ఆకాంక్ష. కానీ అదే ఆశ ఒత్తిడిగా మారితే, అది పిల్లల మనోస్థితిని దెబ్బతీస్తుంది. ”ఎన్ని మార్కులు తెచ్చావ్‌?” అనకండి. ”ఏం నేర్చుకున్నావ్‌?”, ”ఎక్కడ మెరుగవ్వాలి?” అని అడగండి. పిల్లలను ఇతరులతో పోల్చకండి. వారి ప్రయత్నాన్ని మెచ్చండి. ప్రేమతో ఆదరించండి.
యువత గుర్తుంచుకోవాల్సింది:
ఫెయిల్‌ అయ్యావంటే అది ముగింపు కాదు. అది మరో అవకాశం. మళ్లీ లేచి నిలబడటానికి, కొత్తగా ప్రారంభించడానికి అవకాశం. నీ నమ్మకం, నీ శ్రమే నీ విజయానికి పునాది. మార్కులు కాదు, నీ పట్టుదలే నిన్ను ముందుకు నడిపిస్తుంది.
సమాజపు ఆలోచనా దోరణి మారాలి :
”మార్కులే పరమావధి” అనే సంకుచిత దక్పథం విద్యార్థులపై తెలియని ఒత్తిడిని పెంచుతోంది. దీనిని మార్చాల్సిన బాధ్యత తల్లిదండ్రులకూ, ఉపాధ్యాయులకూ, ప్రభుత్వానికీ, సమాజానికీ ఉంది. పిల్లల్లో నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం, సజనాత్మకత, సమస్యల పరిష్కార నైపుణ్యం పెంపొందించడమే అసలైన విద్య. ఆ దిశగా విద్యార్థులకు బోధన చేయడం అవసరం
విద్య ర్యాంకులు కోసం కాదు, వ్యక్తిత్వ వికాసం కోసం
విద్యా వ్యవస్థలు మార్కులకే కాకుండా జీవన నైపుణ్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. పిల్లలలో ధైర్యం, నిరీక్షణ, నిబద్ధత వంటి విలువలను పెంపొందించాలి. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సమాజం – అందరూ కలిసి విద్యార్థులకు మానసిక బలాన్ని కలిగించాలి.
జీవితంలో అనేక అవకాశాలు ఉంటాయి కానీ జీవితం మాత్రం ఒక్కటే వుంటది. పరీక్షలలో ఫెయిల్‌ అయ్యావనో, మార్కులు తక్కువ వచ్చాయనో, ర్యాంకులు రాలేదనో ఎంతో విలువైన జీవితాన్ని మధ్యలోనే ముగించి కన్నవారికి, అయినవారికి జీవితాంతం అంతులేని శోకాన్ని మిగల్చకండి.
జీవితం చాలా విలువైనది, ఆత్మవిశ్వాసంతో జీవించి అనుకున్నది సాధించు.
జి. అజయ్ కుమార్‌
కాలమిస్ట్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -