నవతెలంగాణ-హైదరాబాద్ : తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలో ఓ పురాతన శివాలయంలో ఏకంగా 103 బంగారు నాణేలు బయటపడ్డాయి. జవ్వాదు కొండల సమీపంలోని కోవిలూర్ గ్రామంలో ఉన్న చారిత్రాత్మక శివాలయంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయాన్ని పోలీసులు మంగళవారం ధ్రువీకరించారు.
ఆలయంలోని గర్భగుడికి పునరుద్ధరణ పనులు చేపడుతుండగా, కార్మికులు తవ్వకాలు జరిపారు. ఈ క్రమంలో వారికి ఓ పాత మట్టి కుండ లభించింది. దాన్ని జాగ్రత్తగా తెరిచి చూడగా, అందులో పురాతన కాలం నాటి బంగారు నాణేలు ఉండటంతో వారు ఆశ్చర్యపోయారు. వెంటనే ఈ విషయాన్ని ఆలయ అధికారులకు, పోలీసులకు తెలియజేశారు.
సమాచారం అందుకున్న రెవెన్యూ, హిందూ మత ధర్మాదాయ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని నాణేలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆలయం చాలా శతాబ్దాల నాటిదని, చోళ రాజు మూడో రాజరాజ చోళుని కాలంలో (13వ శతాబ్దం) నిర్మించినట్లుగా భావిస్తున్నారు. ఆలయ నిర్మాణ శైలి కూడా ఆ కాలానికి చెందిన లక్షణాలను కలిగి ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఈ బంగారు నాణేలు చివరి చోళుల కాలానికి లేదా తొలి పాండ్యుల కాలానికి చెందినవి కావొచ్చని చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. ఆ రోజుల్లో ఆలయాలకు విరాళాలుగా, వాణిజ్య కార్యకలాపాల్లో బంగారు నాణేలను విస్తృతంగా ఉపయోగించేవారు. ఆలయ పునరుద్ధరణ పనుల్లో భాగంగానే ఈ నిధి బయటపడటంతో దీనిపై ఎలాంటి పోలీసు కేసు నమోదు చేయలేదని అధికారులు స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఈ నాణేలను పురావస్తు శాఖ నిపుణులు పరిశీలిస్తున్నారు. వాటిపై ఉన్న ముద్రలు, లోహ మిశ్రమం, తయారీ విధానం ఆధారంగా వాటి కాలాన్ని, చారిత్రక ప్రాముఖ్యతను నిర్ధారించనున్నారు. ఈ అరుదైన నిధి బయటపడటంతో స్థానికులు, చరిత్ర ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది తమిళనాడు ఆలయాల గొప్ప వారసత్వానికి, చోళుల వైభవానికి నిదర్శనమని అభిప్రాయపడుతున్నారు.



