బీఆర్‌ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణలు
విదేశాల నుంచి వచ్చి మరీ ఓటు హక్కు వినియోగం
నవతెలంగాణ- విలేకర్లు
రాష్ట్రవ్యాప్తంగా మూడో(చివరి) విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. తెల్లవారుజాము నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగింది. సమయం ముగిసినా క్యూలో ఉన్నంతవరకూ ఓటు వేసేందుకు అనుమతించారు. అనంతరం ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. కాగా, ఓట్ల లెక్కింపు, ఫలితాల విడుదల సమయంలో గ్రామాల్లో కొన్నిచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఘర్షణలు
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మెటల్ కుంట పోలింగ్ కేంద్రం వద్ద ఓటింగ్ సమయం ముగిసినా ఓటు వేసేందుకు వెళుతున్న బీఆర్‌ఎస్ శ్రేణులను కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. దాంతో ఇరు పార్టీల మధ్య తోపులాట జరిగింది. ఓటు వేసేందుకు ఎందుకు అనుమతించరంటూ పోలింగ్ కేంద్రం ప్రహరీ దూకి లోపలికి వెళ్లేందుకు బీఆర్‌ఎస్ మద్దతుదారులు ప్రయత్నించడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. మధ్యాహ్నం ఒంటిగంట దాటిన తర్వాత ఓటు ఎలా వేస్తారంటూ కాంగ్రెస్ మద్దతుదారులు అడ్డుకున్నారు.
దాంతో ఆందోళనకు దిగిన ఇరు పార్టీ గ్రూపులను పోలీసులు చెదరగొట్టి పరిస్థితిని చక్కదిద్దారు. నల్లగొండ జిల్లా డిండి మండలం శాంతిగూడెంలో పోలింగ్ కేంద్రంలో బీఆర్‌ఎస్ పోలింగ్ ఏజెంట్‌పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం బద్దుతండాలో ఓ వ్యక్తి తొలుత గుర్తింపు కార్డు లేకుండా పోలింగ్ కేంద్రానికి వెళ్లడంతో ఓటేసేందుకు అధికారులు నిరాకరించడంతో వెనుదిరిగాడు. ఆ తర్వాత గుర్తింపు కార్డుతో మరోసారి అక్కడికి వచ్చిన క్రమంలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి సదరు వ్యక్తి దొండ ఓటు వేస్తున్నాడని ఆరోపిస్తూ అతనిపై చేయిచేసుకున్నాడు. దాంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు చేరుకొని ఇరువురిని చెదరగొట్టారు.
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం వెలుబెల్లి పోలింగ్ కేంద్రం వద్ద బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో దాడులు చేసుకున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద సర్పంచి అభ్యర్థి అక్షరుకుమారÊ తండ్రి సురేందర్ ఓటు వేసేందుకు వెళ్తుండగా.. బీఆర్‌ఎస్ కార్యకర్తలు వీడియో తీయడంతో వివాదం చోటుచేసుకుంది. పోగుళ్లపల్లి పోలింగ్ కేంద్రం వద్ద క్యూలైన్‌లో ఉన్న ఓటర్ల వద్దకు వెళ్లి నేతలు ప్రచారం చేయడంతో ఇరు పార్టీ మధ్య జరిగిన తోపులాటలో ఓ మహిళ కిందపడి గాయపడింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం విలాసాగర్‌లో పోలింగ్ కేంద్రం వద్ద జనం గూమిగూడి ఉండటంతో పోలీసులు అక్కడికి చేరుకోగా.. సర్పంచ్ అభ్యర్థి వద్ద ఉన్న రూ.28,500 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సంగారెడ్డి జిల్లా తుర్కపల్లిలో ఓటు చోరీ..
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం తుర్కపల్లి గ్రామంలో ఓటుచోరీ ఘటన కలకలం రేపింది. ఓటు వేయడానికి వచ్చిన ఓ మహిళకు అప్పటికే తన ఓటు నమోదయిందని అధికారులు చెప్పడంతో ఆమె కంగుతిన్నది. ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌లో ఉంటున్న యాస్మిన్.. తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు తుర్కపల్లి గ్రామంలో పోలింగ్ బూత్‌కు వచ్చింది. అయితే ఆమె పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళగానే ‘మీ ఓటు ఇప్పటికే నమోదయింది’ అని ఎన్నికల అధికారులు తెలిపారు. దాంతో షాక్‌కు గురైన యాస్మిన్, తన ఓటు ఎవరు వేశారని ప్రశ్నిస్తూ.. పోలింగ్ బూత్‌లోనే ఆందోళనకు దిగారు. గ్రామంలో తన ఓటు చోరీ జరిగిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు వేయకుండా బయటకు వచ్చిన ఆమె, పోలింగ్ బూత్ ముందు నిరసన చేపట్టి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనతో తుర్కపల్లి గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
గదుల కొరత.. వరండాల్లో పోలింగ్ బూత్
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఆరెగూడెం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో రెండే గదులున్నాయి. ఆ రెండు గదుల్లో 8 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. ఒక్కో గదిలో మూడు బూత్‌ల చొప్పున నిర్వహించగా.. మరో రెండు కేంద్రాలను వరండాలో పరదలు కట్టి నిర్వహించారు.
పోలింగ్ కేంద్రం వద్ద కుర్చీ వేసుకొని కూర్చున్న ఎమ్మెల్యే
వికారాబాద్ జిల్లా శివారెడ్డిపల్లిలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే అతను పోలింగ్ కేంద్రం వద్ద కూర్చీ వేసుకుని ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ప్రతిపక్ష పార్టీ వాళ్లు ఆరోపించారు. సొంత ఊరిలో ఓడిపోతే పరువుపోతుందనే ఉద్దేశంతోనే ఆయన ఇలా వ్యవహరిస్తున్నారంటూ విమర్శిస్తున్నారు.
పోలింగ్ లెక్కింపు బహిష్కరించి రోడ్డెక్కిన అధికార పార్టీ నేతలు
హనుమకొండ జిల్లా నడికుడ మండలం వరికోల్ గ్రామంలో అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థి మంద శరత్ కుమార్ పోలింగ్ ప్రక్రియ పూర్తి కాగానే లెక్కింపును బహిష్కరించి రోడ్డుపై బైటాయించి ధర్నా నిర్వహించారు. గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ నేత పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఓటింగ్‌లో అవకతవకలకు పాల్పడ్డారని, రీ పోలింగ్ నిర్వహించి తమకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి, వార్డు సభ్యులు లెక్కింపునకు గైర్హాజరైనా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలింగ్ లెక్కింపును ఎన్నికల అధికారులు ప్రారంభించారు.
సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం
ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం రాస్పెల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్న బొమ్మెన రాజయ్య ఓడిపోతాననే భయంతో ఆత్మహత్యకు యత్నించాడు. గడ్డి మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిన రాజయ్యను వెంటనే కాగజ్‌నగర్‌లోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ప్రత్యర్థి డబ్బులు పంచాడని, తాను డబ్బులు పంచలేకపోయానంటూ వాపోయాడు. చేనమ్మి ఎన్నికల్లో పోటీ చేశానని, సమయానికి చేతికి డబ్బులందక ఓడిపోతాననే భయంతో ఆత్మహత్యకు యత్నించినట్టు తెలిపారు.
పోలీస్ వాహనం ధ్వంసం
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం సీతాగొంది గ్రామంలో ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ కేంద్రం వద్ద గుమిగూడిన వారిని పోలీసులు చెదరగొట్టారు. ఈ క్రమంలో జక్కుల విలాస్ గోడ దూకి పారిపోతున్న క్రమంలో మురికికాల్వలో పడి ఆయన రెండు కాళ్లు విరిగిపోయాయి. ఆగ్రహానికి గురైన కుటుంబీకులు పోలీసు వాహనంపై రాళ్లు రువ్వడంతో అద్దాలు ధ్వంసమై అందులో ఉన్న ఇచ్చోడ ఎస్‌ఐ శ్రీకాంత్ తలకు గాయమైంది. దాడికి పాల్పడిన 30మందిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
ఓటు వేసేందుకు సైకిల్‌పై 148 కిమీ ప్రయాణించిన జవాన్
ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధం. ఈ నినాదాన్ని అక్షరాల నిజం చేస్తూ సంగారెడ్డి జిల్లా మనూరు మండలానికి చెందిన 60ఏండ్ల మాజీ సైనికుడు మల్లయ్య చూపిన తెగువ ప్రస్తుతం అందరినీ ఆలోచింపజేస్తుంది. తన గ్రామంలో ఓటు వేయడం కోసం హైదరాబాద్ నుంచి మారుమూల గ్రామానికి సైకిల్‌పై 148 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. బుధవారం తెల్లవారుజామున 4 గంటల 20 నిమిషాలకు హైదరాబాద్‌లోని బీహెచ్‌ఎల్ నుంచి బయలుదేరాడు. ఉదయం 10 గంటలకు గ్రామానికి చేరుకున్నాడు. గ్రామంలోని పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు.
విదేశాల నుంచి వచ్చి ఓటు
ఓటు హక్కు ప్రాధాన్యతను చాటుతూ ప్రవాస భారతీయులు తరలివచ్చి తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం బండవెల్కిచర్ల గ్రామానికి చెందిన సిద్దోటం నవీన్‌కుమార్ యూరప్‌లోని ఐర్లాండ్‌లో స్థిరపడ్డారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా స్వగ్రామానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌కు చెందిన లవణ్‌కుమార్ లండన్‌లో ఎంఎస్ చదువుతున్నాడు. కాగా, తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు గ్రామానికి వచ్చాడు.



