”చట్టసభల్లో వాదోపవాదాలుండాలి, అవి లేకపోతే సభలు జీవంలేని రాతి భవనాలుగా మిగిలిపోతాయి” అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అభిప్రాయపడ్డారు. ఆదివారం అఖిల భారత స్పీకర్ల సమావేశంలో షా ఈ వ్యాఖ్యలు చేశారు. సార్ చెప్పిన మాటలు అక్షర సత్యాలు. కానీ, పార్లమెంటులో వీరు అనుసరిస్తోందేమిటి? మంద బలంతో ప్రతిపక్షాల గొంతునొక్కుతున్న వారే ఇప్పుడు చట్టసభల్లో వాదోపవాదాలుండాలని సెలవిస్తున్నారు! అంతే కాదు ”చట్టసభలు రాజకీయ ప్రయోజనాల కోసం కాదని, ప్రజల సమస్యలను లేవనెత్తడానికి సభ నిష్పక్షపాత వేదిక కావాలి” అని కూడా షా ఆకాంక్షించారు. మరి ఈ నిష్పాక్షికత ఎందుకు కొరవడుతోంది? ప్రజాసమస్యలు చర్చించ కుండా సభలను వాయిదాలు వేస్తుందెవరు? కేంద్రంలో వీరు అధికారంలోకి వచ్చింది మొదలు ప్రజల హక్కుల హననం అప్రతి హతంగా కొనసాగుతూనే ఉంది కదా. వాటి మాటేంటి?
ప్రజాస్వామ్యానికి ఊపిరి చట్టసభలు. వాటిలో చర్చలు జరిగితేనే నిజానిజాలేమిటో ప్రజలకు తెలుస్తాయి. ప్రభుత్వం తీసుకోస్తున్న చట్టాల లోటుపాట్లేమిటో ఇక్కడ చర్చలు జరిగితేనే తెలుస్తాయి. కానీ విపక్ష పార్టీలు చర్చలకు పట్టుపడ్డం పాలకపక్షం దానికి ససేమిరా అనడం పరిపాటిగా మారి పోయింది. ఏవరికైనా పట్టువిడుపులుండాలి. కానీ, విపక్షాలు ఇచ్చిన అన్ని వాయిదా తీర్మానాలను బుట్టదాఖలు చేస్తూ…చర్చకు ఆస్కారమివ్వనిది సర్కారు వారే కాదా! పైగా ”విపక్షాలు దారి తప్పాయని…పార్లమెంట్‌ను జరగనీయకుండా అడ్డం పడుతున్నాయి” అని వారిమీదకే నెపం నెట్టి చేతులు దులుపుకుంటున్నారు? ఫలితంగా ప్రజా సమస్యలపై చట్టసభలో చర్చలు జరగడం లేదు. కానీ వీధి పోరాటాలు మాత్రం జరుగుతున్నాయి. దీనివల్ల ప్రజలకు.. దేశానికి ఎలాంటి మేలు జరుగు తుంది? దానికి పాలకపక్షంగా మీ బాధ్యతెంత?
పార్లమెంట్‌లో ఎంపీలు లిఖిత పూర్వకంగా అడిగే ప్రశ్నలకు, మంత్రులు ఇచ్చే జవాబుల్లో పస కనబడడంలేదు. అంతా యాంత్రికంగా, మొక్కుబడిగా జరుగుతు న్నట్టు కనపడు తోంది. నిజానికి గత కొద్ది సంవత్సరాలుగా పార్లమెంట్‌లో అద్భుతమైన ప్రసంగాలు కానీ, చర్చలు కానీ జరిగిన దాఖలాలు లేనేలేవు. ఒకప్పుడు హేమాహేమీలైన నేతలు మాట్లాడుతుంటే మీడియా, అతిథుల గ్యాలరీలు కిక్కిరిసిపోయి కనిపించేవి. ఇప్పుడు పార్లమెంట్ గ్యాలరీలు మీడియా ప్రతినిధులు కూడా లేక వెలవెలబో తున్నాయి. అందుకే చట్టసభలు ఒక ప్రహసనంలా మారిపోయాయి.
విపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాల పాలనను గవర్నర్ల ద్వారా స్తంభింజేయడం మొదలు పహల్గాం ఉగ్రదాడి, బీహర్ ‘సర్’, కర్నాటక ధర్మస్థల వ్యవహరం, ఇప్పటికీ రావణకాష్టంలా రగులుతున్న మణిపూర్ గురించి కానీ, ఆర్టికల్ 370 రద్దు విషయం కానీ, రైతు, కార్మిక వ్యతరేక చట్టాలు కానీ.. ఇలా ఒకటేమిటి? ఇప్పుటి ”పదవీచ్యుతి” బిల్లు సహా ఏ అంశాలను చర్చకు పెట్టారు? ఎన్ని సార్లు విపక్షాల ప్రశ్నలకు బాధ్యతగా సమాధానమిచ్చారు? ఇలా చెబుతూపోతే కొండవీటి చేంతాడంత జాబితా అవుతుంది.
పహల్గాం ఉగ్రదాడి, తదనంతర ఆపరేషన్ సిందూర్‌తోపాటు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌ను, ఉగ్రవాదాన్ని ఒంటరిపాటు చేయడానికి వివిధ పార్టీల నేతలను దేశదేశాల్లో తిప్పిన సర్కారు…ఈ దేశ ప్రజలకు వివరించడానికి మాత్రం పార్లమెంటును సమావేశ పర్చలేకపోయింది? ఇదేనా పారదర్శకత! ఇదేనా ‘నిష్పాక్షికత’?
వాస్తవానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఏ అంశంపైన అయినా సరే చర్చకు ప్రభుత్వం భయపడ కూడదు. బాధ్యతగా చర్చకు అవకాశమివ్వాలి. ప్రశ్నలకు సమాధానమివ్వాలి. విమర్శలను స్వీకరించాలి. సభ ఆమోదం పొందాలి. కానీ, ఈ ప్రభుత్వం భయపడుతోంది. అధిక సంఖ్యాక సభ్యులు తన పక్షాన ఉండి కూడా ఆందోళన చెందుతోంది? చర్చలను అనుమతించేందుకు నిరాకరిస్తోంది. ఎందుకు? అనుమతిస్తే ప్రజలకు సత్యాలు వెల్లడవుతాయని సర్కార్ జంకుతోందా? చర్చలకు అవకాశం లేని పార్లమెంటు శకంలోకి భారత్ ప్రవేశించిందా? అన్న అనుమానం కలుగుతోంది. ఇదే నిజమైతే ప్రజాసమస్యల పరిష్కారానికి అవసరమైన చట్టాలు, నిర్ణయాలు చేయాల్సిన చట్టసభలు నిర్జీవ రాతిభవనాలుగానే మిగిలిపోతాయి.
మాటలే తప్ప…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES