ఇరవై ఎనిమిది మాసాల అసాధారణమైన ఆలస్యం తర్వాత…ఖచ్చితంగా చెప్పాలంటే 864 రోజులు ఆలస్యం చేశాక ప్రధానమంత్రి మణిపూర్ సందర్శించారు. ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ నాయకత్వంలో అప్పటి బీజేపీ ప్రభుత్వ పాలనలో అక్కడ అంతర్గత జాతి కలహాలతో హింసాకాండ సాగింది. ఇప్పటికైనా ఏదో విధంగా పోగొట్టుకున్న రాజకీయ బలాన్ని మళ్లీ కూడగట్టుకో వాలనే నిస్ప్రహతోనే ఈ పర్యటన పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అప్రతిష్టాకరంగా విశ్వాసం కోల్పోయింది. ముఖ్యమంత్రిని తొలగించేం దుకు మొండిగా నిరాకరించిన తర్వాతనే రాష్ట్రపతి పాలన విధించబడింది.. ఈకాలంలో ఎంతో రక్తపాతం కొనసాగింది. ఈ జాతి విభజన కలహంలో ఇరు వైపులా నివాసాలు, మత సంస్థలూ ధ్వంసం చేయ బడ్డాయి. 260 మంది చంపివేయబడ్డారు. మహిళలపై లైంగిక దాడులు నగంగా ఊరేగిం చడాలు జరిగిపోయాయి.
60వేల మంది ఇండ్లు కోల్పోయి దయనీయమైన, అమానవీయ పరిస్థితుల్లో శరణార్థి శిబిరాల్లో తలదాచుకోవలసి వచ్చింది. అతి సున్నితమైన సరిహద్దు రాష్ట్రంలో మెయితీలు, కుకీల మధ్య సంబంధాలు మళ్లీ చక్కదిద్దలేనంతగా దెబ్బతిని పోయాయి. రాష్ట్రంలో శాంతిని కాపాడటం చేతగానివారికి పాలించే హక్కే వుండదని గర్జించారు ప్రధానమంత్రి 2017లో కాంగ్రెస్ పాలిస్తున్న కాలంలో పర్యటిం చినపుడు. కానీ ఆ తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చాక విభజన రాజకీయాల ప్రచారంతో జాతి కలహాగ్ని రగిలినపుడు ఆయన మాటల బూటకత్వమేమిటో తేలిపోయింది. అదొక అంత ర్యుద్ధ పరిస్థితిలా చెలరేగింది. ఆ విధంగా రాష్ట్రం తగలబడిపోతున్నా ఆయన మాత్రం స్పందన లేకుండా నిష్క్రియాత్మకంగా వుండిపోయారు.
నిర్లక్ష్యానికి నిరసనే
రోమ్ నగరం తగలబడిపోతుంటే ఫిడేలు వాయించిన నీరో చక్రవర్తి కథలో వలెనే ప్రధానమంత్రి ఆ రాష్ట్ర పరిస్థితి సాధారణ పరిస్థితి పునరుద్ధరణ కోసం ఎలాంటి సహానుభూతిని గానీ దృఢ సంకల్పాన్ని గానీ ప్రదర్శించ లేదు. అందుకనే ఆయన ఆర్భాటంగా జరిపిన పర్యటన పట్ల మణిపూర్ ప్రజలు ఉదాసీనంగా ఆగ్రహంగా వుండి పోయారంటే అర్థం చేసుకోవచ్చు. ఈ సందర్భంగా వర్షం పడుతుంటే తంటాలు పడి తీసుకొచ్చిన బడిపిల్లలూ కొద్ది మంది జనాలు పలచపలచగా మాత్రమే పాల్గొన్నారు. ఇంపాల్‌లోనూ అదే విధంగా చూరచందాపూర్‌లోనూ ప్రజల నుంచి నిరాసక్త స్పందనలో ప్రధాని ఇంత ఆలస్యంగా రావడానికి కారణమేమిటన్న ప్రశ్న ప్రతిబింబించింది. ప్రజలను చంపేస్తుంటే, మహిళలను బలాత్కరిస్తుంటే, కొంపలు తగలబెడుతుంటే ఈయన ఎక్కడకు పోయారు?ఈ హింస రచనను ఆయన ఎందుకు అనుమతించారు?
శాంతిని కాపాడటంలోనూ, నేరస్తులను బోనెక్కించడంలోనూ డబుల్ ఇంజన్ సర్కారు వైఫల్యం నేపథ్యం లోనే ఆయన ఈ పర్యటనకు వచ్చారు. 2023 జూన్‌లో హోంమంత్రి అమిత్‌షా పర్యటన సందర్భంగా ఇండ్లు కట్టిస్తా మనీ, విద్యా వైద్యం కల్పిస్తామని ఇచ్చిన హామీలు వమ్ముచేయబడ్డాయి. ఆస్పత్రులు అందుబాటులో లేకపోవడంతో దూరం వెళ్లలేక ప్రజలు వైద్యం దొరక్క తిండికూడా దొరక్క చచ్చిపోతున్నారు. సహాయ శిబిరాల్లోని బాధిత ప్రజా నీకం ఆత్మహత్యలు చేసుకుంటున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో నిరాశ్రయులైన వారి సహాయ శిబిరాలను ప్రధాని సందర్శించింది లేదు. అసలైన సమస్యలను ఆయన దాటేశారు. శాంతినీ సాధారణ పరిస్థితినీ పునరుద్ధ రించేందుకు అవసరమైన చర్యలు ఏమిటో ప్రతిపాదించలేదు. హింసాకాండ బాధితులకు న్యాయం చేయడమనేది సుదూరంలో కనిపించడం లేదు. సాయుధ మూకలపై ఇప్పటికీ ఎలాంటి అదుపూ లేదు. రాష్ట్ర ఆయుధాగారాల నుంచి కొల్లగొట్టిన ఆయుధాలను ఇప్పటికీ తిరిగిస్వాధీనం చేసుకోలేదు. దగ్ధ గృహాలు, సంస్థల పునర్నిర్మాణమేదీ ఇంకా జరిగింది లేదు.
రాజకీయ ప్రయోగశాల
మణిపూర్ సంఘపరివార్ రాజకీయ ప్రయోగశాలగా తయారైంది. బీజేపీ ఈశాన్య భారతంలో కాలూనేందుకు జాగా సంపాదించిన కారణంగా అక్కడ ప్రతి రాష్ట్రంలోనూ సంఘపరివార్ విభజన ఎజెండా జొప్పిస్తున్నది. అస్సాం ముఖ్యమంత్రి మైనార్టీలపై విద్వేష విషం చిమ్ముతున్నాడు. ఫలితంగా వారు దాడులనూ గెంటి వేతలనూ సర్కారీ అణచివేతను ఎదుర్కొంటున్నారు. అణచివేయబడిన తరగతులు గిరిజనులుగా గుర్తిం చాలంటూ భారీఎత్తున నిరసనలు చేస్తు న్నారు. త్రిపురలో కూడా మతపరమైన విభజన తేవడానికీ విద్వేష వ్యాప్తికీ ప్రయత్నాలు నడుస్తున్నాయి. మిజోరాంలో అటవీ సంరక్షణ చట్టం ఆమోదంతో కేంద్రానికి విపరీతాధికారాలు సంక్రమించాయి. మిజో ప్రజల హక్కులకు ఇదొక ముప్పుగా తయారైంది. అంతర్జాతీయ సరిహద్దుకు వంద కిలోమీటర్ల వరకూ మినహాయిం పునివ్వడం (దేశ భద్రతకూ, జాతీయ భద్రతకు సంబంధించి నడుస్తున్న వ్యూహాత్మక ప్రాజెక్టుల కోసం) ఇందుకు కారణమవుతున్నది.
భారత రాజ్యాంగం 371జి అధికరణం, అలాగే గిరిజన స్వయం పాలక మండళ్ల అధికారాలకు రక్షణ కల్పించే 244వ అధికరణాలను ఇది ఉల్లంఘిం చినట్టు భావిస్తున్నారు. బీజేపీ అధికారం కోల్పోయాక చక్మా స్వయం పాలక మండలిలో గవర్నర్ పాలన విధించడం కూడా ఇబ్బందికరంగా మారింది. ఇండియా మయన్మార్ సరి హద్దులో స్వేచ్ఛగా సంచరించే అవకాశాన్ని లేకుండా చేయడం వల్ల సామాజిక ఆర్థిక సంబంధాలు విచ్ఛిన్నమైనాయి. మిజోరాం, నాగాలాండ్ ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ సమస్య ఉద్రిక్తతలకు ఒక కేంద్ర బిందువయ్యే అవకాశం చాలా వుంది.
జరగాల్సిందేమిటి?
నాగా శాంతి ప్రక్రియను క్రమ పద్ధతిలో విచ్ఛిన్నం చేయబడింది. 2015 ఆగష్టు 3న ఒక స్థూలమైన ఒప్పందం రూపురేఖలపై సంతకాలు జరగడం చారిత్రాత్మకమని నరేంద్ర మోడీ కొనియాడారు. అయితే తర్వాత ఆ ఒప్పందం మేరకు మధ్యవర్తిని నియమించడానికి ప్రభుత్వం మొండిగా నిరాకరించడంతో సంప్రదింపులు ప్రతిష్టంభనలో పడిపోయాయి. దీనివల్ల గణనీయమైన ఒత్తిడి, నిస్ప్రహ ఏర్పడ్డాయి. ఈ ప్రక్రియను గనక వేగవంతం చేయకపోతే ప్రతిఘటనా బృందాలు మళ్లీ ఆయుధాలు చేపట్టే ప్రమాదం తొంగి చూస్తుంది. మణిపూర్‌లో సాధారణ పరిస్థితులు తిరిగి రాక ముందే నాగాలాండ్‌లో హింసాకాండ గనక మళ్లీ ప్రజ్వరిల్లితే ఈ ప్రాంతంలో అసలే అంతంత మాత్రంగా వున్న పరిస్థితులు మరింత దిగజారతాయి.
తక్కిన రాష్ట్రాలలో వలెనే మణిపూర్‌లో కూడా ఖనిజాలు, భూమి, అడవుల వంటి వనరులను కొల్లగొట్టడం యథేచ్ఛగా అనుమతించబడుతోంది. ఆయిల్‌పామ్ సాగు పథకం, ఖనిజాల తవ్వకం వంటి పేర్లు మీద వేల ఎకరాలు కార్పొరేట్ల హస్తగతమై పోతున్నాయి. శాంతి ప్రక్రియ, పునరేకీకరణ, సౌహార్ద్రత, నిస్నైనికీకరణను వేగవంతం చేయ వలసిన అవసరముంది. ప్రజల విశ్వాసం పొందడం తప్పనిసరిగా జరగాలి. ఈ సమస్యతో ముడిపడి వున్న వారం దరినీ కలుపుకుని వచ్చే ప్రజా స్వామ్య ప్రక్రియ, చర్చలు జరగాలి. దాంతో పాటే సాటి మనుషులపై నేరాలకు పాల్పడే వారి ఆట కట్టించడం జరిగితేనే మణిపూర్ మళ్లీ సాధారణ పరిస్థితులను చేరుకోగలుగుతుంది.
(సెప్టెంబరు17 ‘పీపుల్స్ డెమోక్రసీ’ సంపాదకీయం )
అమితమైన ఆలస్యం-నిరర్థక వ్యవహారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES