సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రయివేటు మెడికల్ కాలేజీల్లో యాజమాన్యం విద్యార్థుల నుండి నాలుగున్నర సంవత్సరాలకు బదులుగా ఐదు సంవత్సరాలకు అక్రమంగా అదనపు ఫీజులు వసూలు చేయటం దుర్మార్గమని దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఒక ప్రకటన విడుదల చేశారు.రాష్ట్రంలో ప్రయివేటు మెడికల్ కాలేజీల్లో 2091 మంది బి కేటగిరీ విద్యార్థుల నుండి రూ. రూ.11.50లక్షలు, 872 మంది సి కేటగిరీకి చెందిన విద్యార్థుల నుండి రూ.23 లక్షల నుండి 26 లక్షల వరకు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని తెలిపారు. తద్వారా విద్యార్థుల తల్లిదండ్రులపై రూ.209 కోట్ల అదనపు భారాన్ని వేశారని ఆందోళన వ్యక్తం చేశారు.
కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్ రిజిస్ట్రార్ ప్రయివేటు మెడికల్ కాలేజీల ప్రిన్సిపాల్లకు అధిక ఫీజులు వసూలు చేయొద్దని సర్క్యులర్ జారీ చేసినా, ప్రయివేటు యాజమాన్యాలు యధావిధిగా వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. పైగా విద్యార్థులకు మార్కులు తక్కువగా వేసి ఫెయిల్ చేస్తామని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. ప్రయివేటు మెడికల్ కాలేజీయ యాజమాన్యాలు రాజకీయ పలుకుబడి కలిగిన ఉండటం వల్ల తమ రాజకీయ ప్రాబల్యంతో, అధికార పార్టీ అండదండలతో బెదిరింపులకు దిగుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకుని అక్రమంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న సదరు యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు విద్యార్థుల నుండి అదనంగా వసూలు చేసిన ఫీజులను వెంటనే తిరిగి వారికి ఇప్పించేందుకు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అధిక ఫీజు వసూళ్ళను అరికట్టాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



