కొందరు ఆడపడుచులు ఇంట్లో తమ మాటే నెగ్గాలని భావిస్తారు. అయితే ఎంత మందికి ఇది నచ్చుతుందో చెప్పలేము. అన్ని ఇండ్లలోని ఆడపడుచులు ఒకే విధంగా ఉండరు. మరికొందరు పెండ్లి చేసుకొని అత్తగారింటికి వెళ్లిన తర్వాత కూడా తల్లి ఇంట్లో జరిగే విషయాల గురించి అతిగా జోక్యం చేసుకుంటుంటారు. అలాంటి జోక్యం ఆ ఇంటికి వచ్చిన కోడలికి నచ్చకపోతే సమస్యలు తప్పవు. అలాంటి కథనమే ఈ వారం ఐద్వా అదాలత్(ఐలమ్మ ట్రస్ట్)లో మీకోసం…
రాజీకి సుమారు 25 ఏండ్లు ఉంటాయి. ఆమెకు రాజేష్‌తో పెండ్లి జరిగి ఏడాది అవుతుంది. ఇద్దరూ ప్రయివేటు ఉద్యోగస్తులు. ఇంట్లో వీరితో పాటు అత్త, మామ, మరిది ఉంటారు. ఆడపడుచుకు పెండ్లి జరిగి సుమారు 12 ఏండ్లు అవుతుంది. ఇప్పుడు రాజీ సమస్య ఇంట్లో అత్తమామలతో కాదు ఆడపడుచు పెత్తనాన్ని భరించలేకపోతుంది. అప్పుడప్పుడు ఇంటికి వచ్చి పోయే సులోచనతోనే ఆమెకు ఎప్పుడూ ఇబ్బంది. అటు అత్తగారింట్లో ఇటు పుట్టింట్లో తన మాటే నెగ్గాలంటుంది. తాను చెప్పినట్టే జరగాలంటుంది. ఆమెకు తెలియకుండా ఒక్క పని కూడా చేయడానికి వీల్లేదు. రాజేష్ తన భార్యకు చీర తీసుకురావాలన్నా, బయటకు తీసుకెళ్లాలన్నా తన అక్క సులోచనకు చెప్పే చేయాలి. చెప్పకుండా వెళ్లారంటే మాత్రం ఇక ఆ రోజు ఇంట్లో పెద్ద గొడవే జరుగుతుంది. ఆమె ఇక్కడ ఉంటే చెప్పి వెళ్లవచ్చు, కానీ అత్తగారింట్లో ఉన్నా తన అనుమతి తీసుకొనే వెళ్లాలంటుంది.
రాజీకి ఎలాంటి చీర తీసుకొస్తే ఆమెకు కూడా అలాంటి చీరే తీసుకురావాలి. ఆమె ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో ఎన్ని పనులు వున్నా వదిలేసి ఆమె పక్కనే కూర్చొని అందరూ మాట్లాడాలి. సులోచన ఇంటికి వస్తే రాజీ ఆఫీసుకు సెలవు పెట్టి ఇంట్లోనే వుండాలి. ఆమెకు ఆరోగ్యం బాగోకపోయినా, ఇంట్లో ఏదైనా ఫంక్షన్ లాంటివి ఉంటే సెలవు అడిగితే ఆఫీసులో ఇస్తారు కానీ సులోచన నెలలో 15 రోజులు తల్లిగారి ఇంట్లోనే వుంటుంది. అలాంటప్పుడు ఏ ఆఫీసు వారు మాత్రం సెలవులు ఇస్తారు. అందుకే ఆమెను ఉద్యోగం నుండి తీసివేశారు. ప్రస్తుతం రాజీ కొత్త ఆఫీసులో జాయిన్ అవుతుంది. అయినా సులోచనలో మాత్రం మార్పు రాలేదు.
రాజీ తన ఇబ్బంది గురించి రాజేష్‌తో మాట్లాడినా, ఇంట్లో వాళ్లకు చెప్పినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. చివరకు వేరే కాపురం పెట్టాలనే నిర్ణయానికి వచ్చింది. కానీ దానికి రాజేష్ ఒప్పుకోవడం లేదు. సులోచన భర్తతో మాట్లాడినా ఎలాంటి ప్రయోజనం లేదు. ఇక చివరి ప్రయత్నంగా రాజీ ఐద్వా అదాలత్‌కు వచ్చింది. ఇక్కడ కూడా తన సమస్యకు పరిష్కారం దొరక్కపోతే కోర్టు ద్వారా తన సమస్యను పరిష్కరించుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. అదే విషయం మాతో పంచుకుంది.
మేము రాజేష్ కుటుంబ సభ్యులతో పాటుగా సులోచనను కూడా పిలిపించాము. రాజేష్ గానీ, కుటుంబ సభ్యులు గానీ సులోచనకు గానీ రాజీది పెద్ద సమస్యగా అనిపించలేదు. అందరూ సులోచన ప్రవర్తనకు అలవాటు పడ్డారు. కానీ రాజీ కూడా అలాగే అలవాటు చేసుకోవాలంటే ఎలా కుదురుతుంది? ఎవరికైనా మరొకరి జీవితాల్లో జోక్యం చేసుకోవడానికి కొన్ని హద్దులు ఉంటాయి. అది చెల్లి, అక్కా, తల్లి, తండ్రి, అన్న ఎవరైనా సరే. దానికి తగ్గట్టుగానే ఉండాలి. అంతేగానీ అతిగా చేస్తే ఆ ఇంట్లో ప్రశాంతత కరువైపోతుంది. ఇలాంటి సమస్యలే వస్తాయి. ఎవరైనా సరే నా మాటే చెల్లాలి అనుకోవడం సరైనది కాదు.
అందుకే సులోచన తన ప్రవర్తనను మార్చుకోవల్సిందే. తమ్ముడు కుటుంబంలో అంత జోక్యం చేసుకోవడం సరైనది కాదు. ప్రతి విషయం ఆమెకు చెప్పే చేయాలనడం మంచి పద్దతి కాదు. ఇంటి ఆడపడుచు ఇలా ప్రవర్తిస్తుంటే ఇక ఇంటికి వచ్చిన కోడలు ఆ ఇంట్లో ఎలా ఉంటుంది? ‘సులోచనా మీ ఆడపడుచు కూడా నీలాగే చేస్తే అప్పుడు నీ పరిస్థితి ఏంటీ? అందుకే అనవసరంగా మీ తమ్ముడి సంసారంలో అతిగా జోక్యం చేసుకోవడం సరైనది కాదు. పండగలకు, ఫంక్షన్లకు ఇలా అప్పుడప్పుడు తల్లిగారింటికి వెళ్లడం అందరితో సంతోషంగా గడపడం వంటివి చేస్తే ఇబ్బంది లేదు.
కానీ అన్నీ నువ్వు చెప్పినట్టే జరగాలనుకోవడం కరెక్టు కాదు. నీ ప్రవర్తన ఇలాగే ఉంటే నీకు అక్కడ గౌరవం ఉండదు. పైగా మీ తమ్ముడి జీవితంలో సంతోషమే ఉండదు. నీ వల్ల రాజీ ఉద్యోగం కూడా పోయింది. అయినా నిన్ను ఏమీ అనకుండా వేరే ఉద్యోగం చూసుకుంది. నువ్వు వచ్చినప్పుడల్లా ఉద్యోగానికి సెలవు ఎలా దొరుకుతుంది? ఇప్పటికైనా నీ పద్దతి మార్చుకోకపోతే రాజేష్ వేరే కాపురం పెట్టాల్సి వస్తుంది. అది నీకు సంతోషమేనా? బాగా ఆలోచించుకో. దీనికి కుటుంబ సభ్యులు అందరూ సహకరించాలి. లేదంటే జరగబోయే పరిణామాలకు మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది’ అని చెప్పాము.
‘ఏ అక్క అయినా తమ్ముడి సంసారం బాగుండాలని కోరుకోవాలి. అంతేగానీ నీ పెత్తనమే సాగాలని ఇలా అతి జోక్యం చేసుకోవడం సరైనది కాదు. నీ ప్రవర్తన మార్చుకోకపోతే భవిష్యత్తులో ఇలాంటి సమస్యే నీకూ ఎదురు కావొచ్చు. రాజేష్ మీరు కూడా మీ పద్దతి మార్చుకోండి. మీరు అక్కకు తమ్ముడే కాదు మీ భార్యకు భర్త కూడా అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆమె మంచి చెడ్డలు చూసుకోవల్సిన బాధ్యత మీదే. ఆమెకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా మీతోనే చెప్పుకునేది. తన సమస్యలను పరిష్కరించవలసిన బాధ్యత మీదే. కాబట్టి అక్కకు, భార్యకు సమన్యాయం, గౌరవం ఇవ్వాలి. అలా కాకుండా నాకు అక్కే ముఖ్యం అనుకుంటే మీ జీవితంలో భార్య ఉండదు. ఇప్పటికైనా అర్థం చేసుకుంటే మీ జీవితం బాగుంటుంది’ అని చెప్పి పంపించాము.
వై వరలక్ష్మి, 9948794051.



