Saturday, May 24, 2025
Homeమానవిఅతిజోక్యం అన‌ర్థం

అతిజోక్యం అన‌ర్థం

- Advertisement -

పిల్లల జీవితాల్లో పెండ్లి తర్వాత పెద్దల పాత్ర ఎంత వరకు ఉండాలి అనేది ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవలసిన విషయం. అమ్మాయి తల్లిగానీ, అబ్బాయి తల్లిగానీ పిల్లలకు పెండ్లి చేసిన తర్వాత వారి జీవితాలు వారికి నచ్చినట్లుగా బతకనివ్వాలి. అలా కాకుండా ప్రతి చిన్న విషయంలో జోక్యం చేసుకోవాలని చూస్తే అనేక సమస్యలు వస్తాయి. నిజానికి పిల్లల జీవితాల్లో ఏదైనా సమస్య వస్తే వాటిని పరిష్కరించేలా, ధైర్యం చెప్పేలా ఉండాలి పెద్దలు. పిల్లలకు అవసరమైన సహకారం చేయడమే తల్లిదండ్రుల బాధ్యత. అలాంటి బాధ్యతను గుర్తుచేసే కథనమే ఈ వారం ఐద్వా అదాలత్‌(ఐలమ్మ ట్రస్ట్‌)లో మీకోసం…
శ్రీలతకు దాదాపుగా 25 ఏండ్లు ఉంటాయి. అమర్‌తో వివాహం జరిగి తొమ్మిది నెలలు అవుతుంది. ఇద్దరూ ఉద్యోగస్తులు. ప్రేమించి ఇంట్లో వాళ్లను ఒప్పించి పెండ్లి చేసుకున్నారు. ఆ ఇంట్లో వీరిద్దరితో పాటు అత్తమామలు ఉంటారు. ఆడపడుచుకు పెండ్లి అయిపోయింది. అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటుంది. శ్రీలత తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. తల్లి ఇంట్లోనే వుంటుంది. తమ్ముడు బి.టెక్‌ ఫైనల్‌ ఇయర్‌లో ఉన్నాడు. అంతా బాగానే ఉంది. కానీ పెండ్లి అయిన దగ్గర నుండి శ్రీలతను అత్త ఇంట్లో పని చేయడం లేదని వేధిస్తుంది. ప్రతి పనికీ ఏదో ఒక వంక పెడుతుంది.
‘నా కూతురు పనెందుకు చేయాలి, ఆమె ఉద్యోగం చేస్తుంది. పెండ్లి కాకముందు నువ్వే అన్నీ చూసుకునేదిగా, ఇప్పుడు చూసుకోవడానికి ఏమైంది? ప్రతి దానికీ నా కూతురిపైనే అరుస్తావు’ అని శ్రీలత తల్లి లక్ష్మమ్మ అంటే ‘నువ్వేం పని నేర్పి పంపలేదు’ అంటూ అమర్‌ తల్లి కమలమ్మ గొడవ పడుతుంది. ఇలా ఆరు నెలలు గడిచాయి. రోజురోజుకు గొడవలు ఇంకా పెరిగిపోతున్నాయి. ఇక శ్రీలత, అమర్‌లు మాట్లాడుకోవడం కంటే పోట్లాడుకోవడమే ఎక్కువయింది. ఎంత సర్ధి చెప్పాలని ప్రయత్నించినా అస్సలు అర్థం చేసుకోవడం లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో శ్రీలత తండ్రి ప్రభాకర్‌ ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చారు. ఆయన చెప్పింది మొత్తం విన్న తర్వాత మేము అందరికీ ఫోన్‌ చేసి పిలిచి మాట్లాడాము. శ్రీలతతో మాట్లాడితే ‘నేను మా ఇంట్లో ఉన్నప్పుడు ఒక్క పని కూడా చేయలేదు. అన్నీ మా అమ్మనే చేసి పెట్టేది. ఈ విషయం మా అత్తయ్యకు పెండ్లికి ముందే చెప్పాను. అప్పుడు నెమ్మదిగా నేర్చుకోవచ్చులే అన్నది. నేను కూడా సరే అన్నాను. ఇంట్లో బట్టలు ఉతకడానికి, గిన్నెలు తోమడానికి ఓ అమ్మాయిని పెట్టుకున్నాము. ఆమెకు డబ్బులు కూడా నేనే ఇస్తాను.
వంట విషయానికి వస్తే టీ పెట్టడం, మ్యాగీ చేయడం లాంటివి వచ్చు. యూట్యూబ్‌ చూసి వంట చేస్తే మా అత్తయ్యకు నచ్చదు. నన్ను ఏమీ అనకుండా ‘మీ అమ్మ నీకు ఏమీ నేర్పి పంపలేదు’ అని మా అమ్మను తిడుతుంది. ఈ విషయంపైనే వాళ్లకు ఎన్నో సార్లు గొడవలు జరిగాయి. కానీ నన్ను మాత్రం అత్తమ్మ ఎప్పుడూ తిట్టలేదు. ఈ విషయం మా అమ్మకు అర్థం కాదు. ‘ఎప్పుడో ఒకసారి వస్తేనే నాపై గొడవ పడుతుంది. ఇక ఇక్కడ ఉండే నీపై ఎంత గొడవ చేస్తుందో, నువ్వు కూడా ఊరుకోకు ఆమె ఒకటి అంటే నువ్వు రెండు అను’ అంటుంది.
ఆ విషయం ఒకరోజు అమర్‌ విని ‘అసలు మీ అమ్మను మన ఇంటికి రావొద్దు అని చెప్పు’ అంటూ నాతో గొడవ పెట్టుకున్నాడు. మా మామయ్య అది చూసి ‘ఎందుకు శ్రీలతను అలా తిడుతున్నావు. వాళ్ల అమ్మ ఇంటికి రాకుండా ఎలా ఉంటుంది. అయినా అత్తాకోడళ్లు బాగానే ఉంటారు. మీ ఇద్దరు కూడా గొడవలు మానుకొని సంతోషంగా ఉండండి’ అన్నారు. కానీ అమర్‌ అసలు ఒప్పుకోవడం లేదు. ‘మీ అమ్మకు చెప్పకపోతే నువ్వు కూడా ఈ ఇంట్లో ఉండటానికి వీలు లేదు’ అంటూ నన్ను మా పుట్టింటికి పంపించేశాడు. నేను ఫోన్‌ చేసినా తియ్యడం లేదు. మెసేజ్‌ చేసినా రిప్లరు లేదు. మా అత్తమ్మ కూడా నాతో మాట్లాడడం లేదు. మామయ్య మాత్రం ‘ఇంటికి వచ్చేయమ్మా’ అంటున్నాను.
నేను అమ్మ వాళ్ల ఇంటికి వచ్చి రెండు నెలలు అవుతుంది. ఇంట్లో పని రాకపోవడమే నా సమస్య అయితే నేర్చుకుంటాను. నా బాధ్యతల నుండి నేను తప్పించుకోను. సమస్య మా అమ్మతో అయితే ఆమెకు ఎలాగో అలా చెప్పుకుంటాను. కానీ అమర్‌ నేనూ ప్రేమించుకుని, ఇంట్లో వాళ్లను ఒప్పించి పెండ్లి చేసుకున్నాము. ఇప్పుడేమో ఏడాది కూడా నిండకముందే నన్ను ఇంట్లో నుండి పంపించేశాడు. దీన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి?’ అంటూ తన మాటలు ముగించింది.
మా ఇంట్లో జరిగే ప్రతి చిన్న విషయం గురించి వాళ్ల అమ్మతో చెబుతుంది. ఆమేమో ‘నీకు ఆ ఇంట్లో పని చేయాల్సిన అవసరం లేదు. నువ్వేమైనా ఆ ఇంట్లో పని మనిషివా? ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించి వాళ్లకు ఇస్తున్నావు. అలాంటప్పుడు వాళ్లే నీకు చేసి పెట్టాలి’ అంటుంది. దానికి శ్రీలత ‘ఇంట్లో పని చేయలేక అమ్మాయిని పెట్టుకున్నాను, నువ్వు ఊరికే అలా మాట్లాడకు మమ్మీ’ అని మాత్రమే అంటుంది. ‘నీకెందుకు మా ఇంట్లో విషయాలు, నువ్వు జోక్యం చేసుకోకు’ అని చెప్పొచ్చు కదా! ఆమెకు తెలిసి రావాలనే నేను శ్రీలతను అక్కడకు పంపించాను’ అన్నాడు.
ఏది ఏమైనా భార్యను, అందులోనూ ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. అలాంటి ఆమెను ఇంట్లో నుండి పంపించడం సరైనది కాదు. శ్రీలత మీ చేయి పట్టుకొని ఇంత దూరం వచ్చింది. ఆమెకు పని రాదని మీ ఇంట్లో వాళ్లకు ముందే తెలుసు. నేర్చుకోవడానికి ఆమెకు కొంచం టైం ఇవ్వాలి కదా! తల్లికి, భార్యకు, అత్తకు సర్ధి చెప్పాల్సిన బాధ్యత మీదే. మీరు అలా చేయలేదు. అందుకే ఇన్ని సమస్యలు వస్తున్నాయి అంటే అతను వెంటనే శ్రీలతకు సారీ చెప్పి ‘మరో సారి ఇలాంటి పొరపాటు చేయను’ అన్నాడు.
ఇద్దరినీ బయటకు పంపి కాసేపు మాట్లాడుకొని రమ్మని చెప్పాము. ఇద్దరి తల్లిదండ్రులను కూర్చోబెట్టి ‘ఆడపిల్లకానీ, అబ్బాయి కానీ ఉద్యోగంతో పాటు ఇంట్లో పనులు చేయడం కూడా అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తాయో ఎవరికి తెలుసు. ఒక్కోసారి డబ్బులు ఉన్నా పని చేయడానికి ఎవ్వరూ దొరకరు. కాబట్టి పిల్లలకు మొదటి నుండి అన్ని పనులూ నేర్పించాలి. శ్రీలత తల్లితో ‘మీరు కూతురికి పెండ్లి చేసి పంపించారు. ఇక అక్కడ అన్నీ ఆమె చూసుకుంటుంది. రాని పనులు అలవాటు చేసుకుంటుంది. మీరు ఈ విషయం అర్థం చేసుకోవాలి. అలా కాకుండా వాళ్ల ప్రతి విషయంలో మీరు జోక్యం చేసుకుంటే మీ అమ్మాయి జీవితానికే నష్టం. మీరు అమర్‌ తల్లిపై గొడవ పడుతున్నారు. ఆ ప్రభావం మీ కూతురిపై పడుతుంది. ఇది మీకు అర్థం కావడం లేదు. హాయిగా సంతోషంగా ఉండాల్సిన సమయంలో మీ కూతురు, అల్లుడు ఇలా దూరంగా ఉంటే మీకు మాత్రం సంతోషంగా ఉంటుందా ఒక్కసారి ఆలోచించండి. కనుక ఇకపై మీరు వారి విషయాల్లో అతిగా జోక్యం చేసుకోవద్దు’ అని చెప్పి పంపించాము.
– వరలక్ష్మి, 9490098024

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -