Saturday, October 4, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఉత్సాహంగా 'అలయ్ బలయ్'

ఉత్సాహంగా ‘అలయ్ బలయ్’

- Advertisement -

నేతల మధ్య ఐక్యతకు నాంది
ప్రముఖుల కరచాలనం


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అలయ్ బలయ్ లాంటి కార్యక్రమాలు సోదరభావాన్ని పెంపొందిస్తాయని పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. శుక్రవారం హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో ఆయా రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రులు అర్జున్‌ రామ్‌మేఘ్ వాల్‌, జి.కిషన్‌రెడ్డి, తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ, మాజీ గవర్నర్‌ సీహెచ్‌.విద్యాసాగర్‌రావు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, బీజేపీ ఎంపీలు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌, ఈటల రాజేందర్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, సీపీఐ సెంట్రల్‌ కంట్రోల్‌ కమిషన్‌ చైర్మెన్‌ డాక్టర్‌ కె.నారాయణ, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.రాంచందర్‌ రావు, టీజేఎస్‌ అధ్యక్షులు ప్రొఫెసర్‌ కోదండరామ్‌, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే సుజనాచౌదరి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకులు, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, ఎంపీ ఆర్‌.కృష్ణయ్య, అరుణోదయ విమల, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న, ప్రముఖ సినీనటులు నాగార్జున, పద్మశ్రీ బ్రహ్మానందం తదితరులు హాజరయ్యారు.

మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ వారికి కండువాలు వేసి స్వాగతం పలికారు. తెలంగాణ సంస్కృతి, ఆహారపు అలవాట్లను చాటిచెప్పేలా అలయ్ బలయ్ ను దత్తాత్రేయ ప్రారంభించారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. నాయకుల మధ్య ఐక్యత కోసం అలయ్ బలయ్ తోడ్పడిందని తెలిపారు. ఆపరేషన్‌ సింధూర్‌ అంశంతో ఈ ఏడాది అలయ్ బలయ్ ను నిర్వహించారు. ఇది కుల, మతాలకతీతంగా ప్రజలంతా ఒక్కటే అనే సందేశమిస్తుందని ప్రముఖులు ప్రశంసించారు. దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి తండ్రి ఆలోచనలను కొనసాగిస్తున్నదని అభినందించారు.

సోదరభావాన్ని పెంపొందించే సాంస్కృతిక ఉత్సవం.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందేశం
సోదరభావాన్ని పెంపొందించే వేడుక అలయ్ బలయ్ అని రాష్ట్రపతి ద్రౌపదీముర్ము తెలిపారు. ఈ మేరకు రాష్ట్రపతి శుక్రవారం సందేశం పంపించారు. మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ప్రతి ఏడాది అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహభరితంగా నిర్వహించడం సంతోషాన్ని కలిగించిందన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఆకట్టుకున్న సాంస్కృతిక కళా ప్రదర్శనలు
అలయ్ బలయ్ కార్యక్రమంలో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను తెలియజేసే వివిధ కళా ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా తోలుబొమ్మలాట, బైండ్ల కథలు, కొమ్ము కోయలు, ఆదివాసీ గిరిజన నృత్యం గుస్సాడీ, గంగిరెద్దులు, ఒగ్గుడోలు, కొమ్ము డ్యాన్సులు, పెద్దబండోళ్లు, బేడ-బుడగ జంగాల కథ, పులి వేషాధారణ, డప్పు నృత్యాలు, బతుకమ్మలు, పోతురాజుల విన్యాసం, తప్పెట గుళ్లు, మల్లన్న స్వామి, రాజన్న డోలు, కేరళ డ్రమ్ముల ప్రదర్శన తదితర కళారూపాలు ఆకట్టుకున్నాయి. అనంతరం వివిధ రకాల తెలంగాణ సంప్రదాయ వంటకాలతో కూడిన ఆతిథ్యాన్ని ఆహుతులు స్వీకరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -