Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeఆటలుకూర్పుపైనే ఉత్కంఠ!

కూర్పుపైనే ఉత్కంఠ!

- Advertisement -

యుఏఈతో భారత్‌ పోరు నేడు
రాత్రి 8 నుంచి సోనీస్పోర్ట్స్‌లో..
ఆసియా కప్‌

ఇంగ్లాండ్‌ పర్యటన తర్వాత భారత క్రికెట్‌కు నెల రోజులకు పైగా విరామం లభించింది. కమర్షియల్‌ షెడ్యూల్‌లో ఇటువంటి విరామం అత్యంత అరుదు. వచ్చే ఏడాది ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ టైటిల్‌ నిలుపుకునే వ్యూహంలో భాగంగా ఆసియా కప్‌లో ఆటగాళ్లను పరీక్షించేందుకు భారత్‌ ఎదురుచూస్తోంది. గ్రూప్‌ దశలో నేడు పసికూన యుఏఈతో భారత్‌ తొలి మ్యాచ్‌ ఆడనుంది.

నవతెలంగాణ-దుబాయ్‌
డిఫెండింగ్‌ చాంపియన్‌ టీమ్‌ ఇండియా ఆసియా కప్‌ వేటను నేడు పసికూనతో పోరుతో మొదలెట్టనుంది. ఆసియా కప్‌ను బీసీసీఐ నిర్వహిస్తున్నా.. వేదిక యుఏఈ కావటంతో ఆరంభ మ్యాచ్‌లో భారత్‌ను ఆడించలేదు. గ్రూప్‌-ఏలో పాకిస్తాన్‌, ఓమన్‌, యుఏఈ సహా భారత్‌ చోటు చేసుకుంది. గ్రూప్‌ దశలో టాప్‌-2లో నిలిచిన జట్లు సూపర్‌4 దశకు చేరుకోనున్నాయి. ఆదివారం పాకిస్తాన్‌తో పోరుకు ముందు మ్యాచ్‌ సన్నద్దత కోసం సూర్యకుమార్‌ సేన సిద్ధమవుతుండగా.. యుఏఈ అద్భుతం కోసం ఎదురుచూస్తోంది. భారత్‌, యుఏఈ ఆసియా కప్‌ పోరు నేడు.

సంజుకు చోటుందా?
ఇటీవల టీ20 ఫార్మాట్‌లో శతక మోత మోగించిన బ్యాటర్‌ సంజు శాంసన్‌. ఐపీఎల్‌లోనూ రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడాడు. కొంతకాలం పొట్టి ఫార్మాట్‌కు దూరమైన శుభ్‌మన్‌ గిల్‌.. వైస్‌ కెప్టెన్‌గా రీ ఎంట్రీ ఇవ్వటంతో బ్యాటింగ్‌ లైనప్‌లో సంజు స్థానం ప్రశ్నార్థకమైంది. అభిషేక్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌ ఓపెనర్లుగా రానుండగా.. సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మలు టాప్‌-4లో ఉన్నారు. పేస్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య, స్పిన్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ సహా వికెట్‌ కీపర్‌ జితేశ్‌ శర్మ టాప్‌-7లో కుదురుకున్నారు!. ఇద్దరు పేసర్లు జశ్‌ప్రీత్‌ బుమ్రా, అర్ష్‌దీప్‌ సింగ్‌లు.. ఇద్దరు స్పిన్నర్లుగా వరుణ్‌ చక్రవర్తి, కుల్‌దీప్‌ యాదవ్‌ తుది జట్టులో నిలువనున్నారు. టాప్‌ ఆర్డర్‌లో ఆడిన అనుభవం కలిగిన సంజు శాంసన్‌ను వికెట్‌ కీపర్‌ స్థానంలో తుది జట్టులో నిలిపినా.. లోయర్‌ ఆర్డర్‌లో అతడ కొత్తగా అలవాటు పడాల్సిన పరిస్థితి. ఫినిషర్‌ రింకు సింగ్‌, ఆల్‌రౌండర్‌ శివం దూబెలకు అవకాశం దక్కటం గగనమే. జితేశ్‌ శర్మను తప్పించి సంజు శాంసన్‌ను తీసుకునేది అనుమానంగానే మారింది. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ సైతం బ్యాట్‌తో ఇటీవల రాణించటం లేదు. దీంతో అతడు కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు వెనుకాడవచ్చు.

షాక్‌ ఇవ్వాలని..
క్రికెట్‌లో యుఏఈ పసికూన. కానీ ఆ జట్టు చీఫ్‌ కోచ్‌ లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ పొట్టి ఫార్మాట్‌ వ్యూహ రచనలో మేటీ. రాజ్‌పుత్‌ శిక్షణ సారథ్యంలోనే భారత్‌ 2007 టీ20 ప్రపంచకప్‌ సాధించింది. ఇప్పుడు యుఏఈ చీఫ్‌ కోచ్‌గా ఉన్న రాజ్‌పుత్‌.. భారత్‌కు షాక్‌ ఇవ్వాలని సిద్ధమవుతున్నాడు. పంజాబ్‌ క్రికెట్‌లో పేరొందిన పేసర్‌ సిమ్రన్‌జిత్‌ సింగ్‌ కోవిడ్‌ సమయంలో దుబారులో చిక్కుకుని.. అక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకున్నాడు. అక్కడ స్కూల్‌ క్రికెటర్లకు కోచింగ్‌ ఇస్తూ.. జాతీయ జట్టులో నిలిచాడు. గిల్‌ 12 ఏండ్ల వయసులో సిమ్రన్‌జిత్‌ను నెట్స్‌లో ఎదుర్కొన్నాడు. రాజ్‌పుత్‌, సిమ్రన్‌జిత్‌లు నేడు క్రీడాస్ఫూర్తితో భారత్‌కు సవాల్‌ విసురుతున్నారు. అగ్ర జట్టు టీమ్‌ ఇండియాను నేడు యుఏఈ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

పిచ్‌, వాతావరణం
ఈ ఏడాది ఆరంభంలో దుబారులో చాంపియన్స్‌ ట్రోఫీలో ఆడిన భారత్‌.. నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. ఆసియా కప్‌కు తాజా పిచ్‌లు సిద్దం చేశారు. కానీ ఈ సమయంలో యుఏఈలో విపరీత ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. భారత్‌ ఇద్దరు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో ఆడే అవకాశం ఉండగా.. అధిక ఉష్ణోగ్రతలు ఆటగాళ్లపై ప్రభావం చూపనున్నాయి.

తుది జట్లు (అంచనా) :
భారత్‌ : అభిషేక్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, తిలక్‌ వర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), జితేశ్‌ శర్మ (వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ పాండ్య, అక్షర్‌ పటేల్‌, హర్షిత్‌ రానా, కుల్‌దీప్‌ యాదవ్‌, జశ్‌ప్రీత్‌ బుమ్రా, వరుణ్‌ చక్రవర్తి.
యుఏఈ : మహ్మద్‌ వసీం (కెప్టెన్‌), అలిషాన్‌ షారాఫు, రాహుల్‌ చోప్రా (వికెట్‌ కీపర్‌), అసిఫ్‌ ఖాన్‌, మహ్మద్‌ ఫరూక్‌, హర్షిత్‌ కౌశిక్‌, మహ్మద్‌ జొహైబ్‌, సాగిర్‌ ఖాన్‌, హైదర్‌ అలీ, జునైద్‌ సిద్దికీ, మహ్మద్‌ రోహిద్‌.

1
టీ20 ఫార్మాట్‌లో భారత్‌, యుఏఈ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లో తలపడ్డాయి. 2016 ఆసియా కప్‌లో యుఏఈపై భారత్‌ 9 వికెట్ల తేడాతో నెగ్గింది.

24/3
2024 ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌ నుంచి టీ20ల్లో భారత్‌ గెలుపోటముల రికార్డు 24-3. 27 మ్యాచుల్లో భారత్‌ ఏకంగా 24 విజయాలు సాధించింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad