ఒత్తిడికి గురయ్యే వారిలో సాధారణంగా మహిళలే ఎక్కువగా ఉంటారు. ఇటు ఇంటిపనులు, అటు ఆఫీసు, సమాజంలో ఎదురయ్యే సమస్యలు వారిని ప్రశాంతంగా ఉండనివ్వవు. దాంతో తరచూ డిప్రెషన్‌కు గురవుతుంటారు. డిప్రెషన్, వ్యాయామం ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి. అయితే డిప్రెషన్‌తో ఉన్నపుడు వ్యాయామం మీద ఆసక్తి తగ్గుతుంది. అలాగే తగినంత శారీరక శ్రమ లేకపోతే డిప్రెషన్ తీవ్రమవుతుంది. అయితే డిప్రెషన్‌తో బాధపడేవారికి వ్యాయామాలు మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. మందులు, చికిత్సలతో పోలిస్తే బరువులెత్తే వ్యాయామాలతో మంచి ఫలితాలు కనిపిస్తున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం…
వ్యాయామం ద్వారా డిప్రెషన్‌కు కళ్లెం వేయవచ్చని University of Lancashire పరిశోధకులు వెల్లడించారు. 70కి పైగా ప్రయోగ పరీక్షలను సమీక్షించి ఈ విషయాన్ని గుర్తించారు. మానసిక స్థితి మీద శారీరక శ్రమ గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నట్టు గత పరిశోధనలు చెబుతున్న విషయాన్ని ఈ అధ్యయనం బలపరచింది. వ్యాయామం, శారీరక శ్రమలు డిప్రెషన్‌తో ముడిపడిన ఇన్‌ఫ్లమేషన్ ప్రక్రియను తగ్గిస్తాయని, సర్కాడియన్ రిథమ్‌న్ని తిరిగి సరిచేసి నిద్ర బాగా పట్టేలా చేస్తాయని, నాడీ కణాలు వృద్ధికి తోడ్పడే బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరో ట్రోఫిక్ ఫ్యాక్టర్ (BDNF) విడుదలనూ ప్రేరేపిస్తాయని, ఈ ఫ్యాక్టర్ మూడ్ నియంత్రణకు దోహదం చేస్తుందని తాజా పరిశోధనలో తేలింది. అందువల్ల డిప్రెషన్ బాధితులు వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేయొద్దని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వారి జీవిన విధానంలో దీన్ని విధిగా చేర్చాలని అంటున్నారు.
చికిత్స మాత్రమే సరిపోదు
డిప్రెషన్ మనిషిని చాలా తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. జీవితంలో ప్రశాంతతను ఘోరంగా దెబ్బతీస్తుంది. ఈ సమస్యకు చికిత్స మాత్రమే సరిపోదు. సైకోథెరపీ, యాంటీ డ్రిపెసెంట్ మందులకు తోడు వ్యాయామాలను జోడిస్తే మంచి ఫలితాలు కనిపిస్తున్నట్లు గత అధ్యయనాల్లో వెల్లడైంది. అందుకే మందులు వేసుకుంటున్నా, వేసుకోకపోతున్నా సైకాలజిస్టును సంప్రదించటం, వ్యాయామాలు చేయటం ముఖ్యమంటున్నారు నిపుణులు.
ఎంత శ్రమిస్తే అంత మంచిది
వ్యాయామం చేస్తేనే సరిపోదు, ఎంత తీవ్రంగా చేస్తున్నామన్నదీ ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. మామూలు వ్యాయామం కన్నా తీవ్రమైన వ్యాయామంతో ఎక్కువ ఫలితాలు కనిపిస్తున్నాయట. శరీరాన్ని 10-20 నిమిషాలు ఒకింత ఎక్కువ శ్రమకు గురిచేసినా సరిపోతుంది. తీవ్రమైన వ్యాయామంటే మరీ కష్టంగా అవసరం లేదంటున్నారు నిపుణులు. ఇది ఆయా వ్యక్తుల శరీర సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుందని అంటున్నారు.
ఏదైనా ఓకే…
వాకింగ్, జాగింగ్, యోగా, బరువులు ఎత్తటం ఇలా ఏ రకం వ్యాయామమైనా డిప్రెషన్ చికిత్సకు సహాయపడుతుంది. రెండు, మూడు వారాలుగా డిప్రెషన్‌తో బాధపడేవారికి డ్యాన్స్ చాలా మేలు చేస్తున్నట్లు కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. కానీ వీటిల్లో, కొంతమంది యువతులను పరిగణనలోకి తీసుకోవటం వల్ల అందరికీ వర్తింపజేయటం తగదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సైకిల్ తొక్కటం, బరువులెత్తటం లాంటివి మహిళలకు బాగా ఉపయోగపడుతుంటే, యోగా, థాయ్ చీ పురుషులకు మరింత మేలు చేస్తున్నట్లు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. వృద్ధులకు యోగా, చిన్నవయసు వారికి బరువులెత్తటంతో మంచి ఫలితం కనిపిస్తోంది.
తోడుగా చేస్తే
వ్యాయామం ఒంటరిగా కన్నా నలుగురితో కలిసి చేస్తే డిప్రెషన్ లక్షణాలు మరింతగా తగ్గుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. డిప్రెషన్‌లో ఒంటరిగా ఉండిపోవటం ప్రధాన లక్షణం. నలుగురితో కలిసి వ్యాయామం చేస్తే ఒంటరితనం దూరమవుతుంది. ఇతరుల కన్నా మరింత కఠినంగా చేయాలనే ఆసక్తి కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, వీలుంటే జిమ్‌లో చేరి శిక్షకుల సమక్షంలో లేదా నలుగురితో కలసి పార్కుల్లో వ్యాయామం చేయటం మంచిదని సూచిస్తున్నారు.
నైపుణ్యం సాధిస్తే
వ్యాయామాల్లో నైపుణ్యం సాధించటం వల్ల నిరాశ, దిగులు తగ్గటానికి ఎక్కువ తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ బరువులెత్తటం, కాస్త ఎక్కువ దూరం, ఎక్కువ సేపు పరుగెత్తటం కూడా నైపుణ్యం కిందికే వస్తాయట. డిప్రెషన్ ఎప్పుడూ గొప్ప పనులు నువ్వ చేయలేవు అంటూ మనిషిని వెనక్కి లాగుతుంటుంది. దీంతో చాలా మంది అక్కడే ఆగిపోతుంటారు. అయితే వ్యాయామం అది అబద్ధమని నిరూపిస్తుంది. మారటం సాధ్యమేనని, కొత్త అలవాట్లు నేర్చుకోవచ్చని, మెరుగ్గా పనులు చేయవచ్చని నేర్పిస్తుంది. ఇది నిజంగా ఒక శక్తివంతమైన సాధనం. బరువులెత్తటం, పరుగు అనేవి శరీరానికి పరీక్ష పెట్టి, పురోగతి సాధించేలా చేస్తాయి. అంతేకాదు యోగా, థాయ్ చీ వంటివి ఏకాగ్రత, జాగరూకత ద్వారా నైపుణ్యం పెంపొంతుందని నిపుణులు సూచిస్తున్నారు.
ఫలితాలు నెమ్మదిగా
వ్యాయామ ప్రారంభించిన తర్వాత ఫలితం కనిపించటానికి కొంత సమయం పడుతుంది. అలాగే కౌన్సెలింగ్, యాంటీ డిప్రెసెంట్ మందుల విషయంలో వైద్యులు ఎవరికి ఏది పడుతుందో, ఎంత మోతాదు సరిపోతుందో తెలుసుకోవటానికి సమయం పడుతుంది. మరోపక్క శారీరక, ఆర్థిక, సామాజిక, మానసిక పరిమితులు ఇందుకు అడ్డుతగులుతుంటాయి. ఎవరికేది నప్పుతుందో, ఆనందంగా చేయగలిగిన వ్యాయామలు ఏంటో గుర్తించటానికి కాస్త సమయం పడుతుంది. అప్పుడే మధ్యలో మానెయ్యకుండా ఉండటం వీలవుతుంది. కనుక వ్యాయామం క్రమం తప్పకుండా చేస్తుంటే నెమ్మదిగా ఫలితాలు కనిపించడం మొదలవుతుందని అంటున్నారు.



