Sunday, February 1, 2026
E-PAPER
Homeజాతీయం'అన్ని రంగాల్లో' సంబంధాల విస్తరణ

‘అన్ని రంగాల్లో’ సంబంధాల విస్తరణ

- Advertisement -

భారత్‌-వెనిజులా అంగీకారం
మోడీ-డెల్సీ రోడ్రిగెజ్‌ ఫోన్‌ సంభాషణ

న్యూఢిల్లీ : భారత్‌-వెనిజులా ద్వైపాక్షిక సంబంధాలను ఇంధన (ఎనర్జీ) సహా అన్ని రంగాల్లో విస్తరించేందుకు ప్రధాని మోడీ, వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెజ్‌ అంగీకరించారు. శుక్రవారం జరిగిన టెలిఫోన్‌ సంభాషణలో ఇరువురు నేతలు వాణిజ్యం, పెట్టుబడులు, డిజిటల్‌ సాంకేతికత, ఆరోగ్యం, వ్యవసాయం, ప్రజల మధ్య సంబంధాలు వంటి రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వెనిజులా అధ్యక్షుడిగా ఉన్న నికోలస్‌ మదురో ను ఈనెల ప్రారంభంలో అమెరికా బలగాలు నిర్బంధించిన్యూయార్క్‌కు తరలించిన విషయం విదితమే.

ఈ నేపథ్యంలో ఆ దేశ ఉపాధ్యక్షురాలిగా ఉన్న డెల్సీ రోడ్రిగెజ్‌.. తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. తాజాగా ఆమె ప్రధాని మోడీకి ఫోన్‌ చేశారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను ‘అన్ని రంగాల్లో మరింత లోతుగా విస్తరించేందుకు’ పరస్పర అంగీకారం కుదిరిందని మంత్రిత్వ శాఖ వివరించింది. ఇరునేతలు గ్లోబల్‌ సౌత్‌కు సంబంధించిన ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై కూడా చర్చించారనీ, ఈ రంగంలో సన్నిహిత సహకారం అవసరమని వారు స్పష్టం చేసినట్టు పేర్కొన్నది. భవిష్యత్తులోనూ సంప్రదింపులు కొనసాగించేందుకు ఇరువురు నేతలు అంగీకరించారు. ఈ ఫోన్‌ కాల్‌ విషయాన్ని ప్రధాని మోడీ ఎక్స్‌ వేదికగా ఇంగ్లీష్‌, స్పానిష్‌ భాషల్లో వెల్లడిస్తూ.. ద్వైపాక్షిక సంబంధాలను రాబోయే కాలంలో మరింత ముందుకు తీసుకెళ్లే విషయంపై చర్చించినట్టు వివరించారు.

డెల్సీ రోడ్రిగెజ్‌ కూడా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణను స్నేహపూర్వకమైనది, మానవీయ, ఆధ్యాత్మిక అనుబంధంతో నిండినదని పేర్కొంటూ ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. గనుల్లో, ఆటోమొబైల్‌ రంగాల్లో సహకారం గురించి కూడా చర్చ జరిగినట్టు ఆమె వివరించారు. వెనిజులా శాంతి, సార్వభౌమత్వం, స్వాతంత్య్ర పరిరక్షణకు భారత్‌ మద్దతిస్తుందన్న హామీని మోడీ పునరుద్ఘాటించారని పేర్కొన్నారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్‌ మదురో అరెస్ట్‌, తదనంతర పరిణామాలు, భారత్‌-అమెరికా మధ్య ఉద్రిక్త సంబంధాలు, రష్యా చమురు కొనుగోళ్ల కారణంగా భారత్‌పై ట్రంప్‌ విధించిన 50శాతం సుంకాల నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకోవటం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -