Wednesday, February 18, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకౌన్సిలర్‌ కుర్చీ కోసం రూ.లక్షల్లో ఖర్చు

కౌన్సిలర్‌ కుర్చీ కోసం రూ.లక్షల్లో ఖర్చు

- Advertisement -

ఇండ్లు పొలాలు అమ్మిన వైనం
గెలిచినా.. ఓడినా వడ్డీ భారమే
నెత్తిన విజేత కిరీటం… లోపల అప్పుల వేదన
ఇప్పుడు రికవరీ రాజకీయం మొదలు

నవతెలంగాణ-సూర్యాపేట
మున్సిపల్‌ ఎన్నికలు ప్రజాస్వామ్య ప్రక్రియ కంటే పెట్టుబడి రాజకీయాలకు ప్రతీకగా మారాయన్న చర్చ జోరుగా సాగుతోంది. ఒక్కో వార్డులో పోటీ చేసిన అభ్యర్థులు రూ.40 లక్షల నుండి రూ. కోటీ వరకు ఖర్చు చేసినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ ఉంది. ఓటుకు వెయ్యి నుంచి ఐదు వేలు…కొన్ని చోట్ల పదివేల వరకు ఇచ్చారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లకు కూడా అధికమొత్తంలో ఖర్చు పెట్టారు. ఓడినా గెలిచినా ఎన్నికల కోసం తెచ్చిన అప్పులభారం తప్పని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రవ్యాప్తంగా పోటీ చేసినవారిలో చాలామందిలో ఇదే పరిస్థితి. సూర్యాపేట జిల్లాలో ప్రధాన పార్టీలతో పాటు చిన్నాచితక పార్టీలు, స్వతంత్ర అభ్యర్ధులు పోటీ చేశారు.

వార్డుల్లో పోటీ చేసిన అభ్యర్థులు డబ్బు, చీరలు, మద్యం, మాంసం, స్వీట్లు, అలంకరణ సామగ్రి పోటాపోటీగా పంపిణీ చేశారు. ఎన్నికల ఖర్చులు చట్టబద్ధ పరిమితులను మించాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గెలుపు కోసం ఇండ్లు, పొలాలు, ఇంటి స్థలాలు, బంగారం అమ్ముకున్న పరిస్థితి. కొందరు కట్నం కింద ఇచ్చిన భూములను మార్టిగేజ్‌ చేసి అప్పులు తెచ్చుకున్నారు. మరికొందరు భార్యలను అంగన్వాడీ ఉద్యోగాలకు రాజీనామా చేయించి రాజకీయ రంగప్రవేశం చేయించారు. కానీ ఫలితం దక్కలేదు. ఉన్న ఉద్యోగం పోవడంతో పాటు వారిని ఓటమి మరింత కృంగదీస్తోంది. మరొకరు టికెట్‌ వస్తుందనే ఆశతో కాంట్రాక్టర్‌ లైసెన్స్‌ రద్దు చేసుకుని చివరికి టికెట్‌ రాకపోవడంతో పాటు ఉపాధి అవకాశాన్ని కోల్పోయిన ఘటన కూడా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు భారీ అప్పులు చేసి పోటీ చేసి ఓటమి పాలవడంతో ఇప్పుడు తెచ్చిన అప్పులు, వడ్డీలు ఎలా చెల్లించాలన్న ఆందోళనలో ఉన్నారు.

కొందరు తీవ్ర మనోవేదనకు గురై అస్వస్థతకు లోనైనట్టు సమాచారం. ఇంకొందరు తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలనే ఆవేదనతో ఆస్పత్రి పాలైనట్టు తెలుస్తోంది. అనుచరులు ‘దొరికిందే చాలు’ అన్న ధోరణితో ఖర్చులను మరింత పెంచారన్న విమర్శలు ఉన్నాయి. ఎన్నికల్లో ఖర్చు చేసిన డబ్బు ఎలా రాబట్టాలి? తెచ్చిన అప్పులకు వడ్డీలు ఎలా చెల్లించాలి? అనే ప్రశ్నలు గెలిచిన వారినీ వెంటా డుతున్నాయి. గత పాలకవర్గ సభ్యులు మాత్రం పెట్టిన పెట్టుబడులు తిరిగి పొందడంతో పాటు అదనంగా ఆదాయం కూడగట్టినట్టుగా ప్రచారం ఉంది. చైర్‌పర్సన్‌ రేసు, ఎమ్మెల్సీ, అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల సందర్భాల్లో లావాదేవీలు, అభివృద్ధి పనుల పర్సంటేజీల ద్వారా ఆశించిన లాభాలు పొందారన్న చర్చ సాగుతోంది. ఈసారి కూడా అలాంటి వ్యవహారాలే పునరావృతమవుతాయా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గెలిచిన వారిలోనూ, ఓడిన వారిలోనూ ఆనందం కనిపించడం లేదు. స్థానికంగా ప్రజాసేవ భావన కంటే ‘పెట్టుబడి-లాభం’ రాజకీయాలు బలపడుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -