– పీఎం స్కూల్, సమగ్ర శిక్షణా పాఠశాలల ఏర్పాటులో
– కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు
నవతెలంగాణ-హైదరాబాద్
పీఎం స్కూల్, సమగ్ర శిక్షా పాఠశాలల ఏర్పాటు ప్రక్రియలో అక్రమాలపై వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. భాగస్వామ్య సంస్థల ఎంపికలో అక్రమాలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలంది. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, సమగ్ర శిక్షా అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్, వ్యక్తిగత హోదాలో జాయింట్ డైరెక్టర్‌గా ఉన్న వెంకటనరసమ్మలకు నోటీసులు జారీ చేసింది. వృత్తి విద్యా కోర్సుల భాగస్వాముల ఎంపికలో అధికారులు బిడ్డర్ల నుంచి కోట్ల రూపాయలు ముడుపులు తీసుకుని తమకు అనుకూలంగా ఉన్నవారికి కేటాయించారనీ, 2024-25 విద్యాసంవత్సరానికి బిడ్డింగ్ ప్రక్రియ నిలిపివేశారని ఒక లాయర్ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 946 పాఠశాలల ఏర్పాటు కు బిడ్లు ఆహ్వానించగా, 500 బిడ్లకు మాత్రమే ఆమోదం లభిం చిందనీ, నిబంధనలను విస్మరించారని తెలిపారు. అనేక చోట్ల సింగిల్ బిడ్‌కే అనుమతి ఇచ్చారని ఆరోపించారు. నిధుల దుర్విని యోగంపై దర్యాప్తు ఆదేశించాలని కోరారు. వెంకట నర్సమ్మ అవినీతికి పాల్పడ్డారని రాసిన లేఖను పిల్‌గా స్వీకరించిన ధర్మాసనం విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
డయలైజర్లను ఒకరికంటే ఎక్కువ మందికి వాడుతున్నారా?
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ- ప్రయివేటు భాగస్వామ్యంతో నడుస్తున్న 102 డయాలసిస్ కేంద్రాల్లో డయలైజర్ల వినియోగంలో అవకతవకలపై పూర్తి వివరాలు సమర్పించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఆరోగ్యశ్రీ ఎమ్‌డీలకు నోటీసు లు జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో డయాలసిస్ పరికరాల కొరత ఉందనీ, ఒక్కో డయలైజర్‌ను ఒకసారి మాత్రమే వినియోగించాల్సి ఉండగా ఇద్దరు, ముగ్గురికి ఉపయోగిస్తున్నారనీ, మిగిలిన వాటిని ఆరోగ్యశ్రీ అధికారుల సహకారంతో బయట విక్రయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయని న్యాయవాది ఆర్. భాస్కర్ లేఖలో పేర్కొన్నారు. ఒక్కో డయలైజర్‌కు ప్రభుత్వం రూ.1950 చెల్లిస్తోందని తెలిపారు. ఈ అంశంపై నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.
జూబ్లీహిల్స్ సొసైటీ ఓటర్ల లిస్ట్‌పై విచారణ
హైదరాబాద్ జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీలో ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించిన విషయంపై దాఖలైన పిటిషన్‌పై చట్టప్రకారం ఉత్తర్వులు జారీ చేయాలని సహకార సంఘాల రిజిస్ట్రార్‌ని హైకోర్టు ఆదేశించింది. నిర్ణయం తీసుకునే ముందు సొసైటీ, పిటిషనర్ల వాదనలు, బైలాస్‌ను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. హరనాథ్‌బాబు తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌లో కేవైసీ సమర్పించలేదన్న కారణంతో 887 మంది సభ్యుల సభ్యత్వాలను రద్దు చేసి ఓటర్ల జాబితా నుంచి తొలగించారని తెలిపారు. అడహాక్ కమిటీ విడుదల చేసిన ప్రొవిజనల్ జాబితాలో తమ పేర్లు లేవనీ, ఫిబ్రవరి 14న వినతి పత్రం సమర్పించినా స్పందించలేదని పేర్కొన్నారు. సొసైటీ తరఫు న్యాయవాది ఆర్. హేమేంద్రనాథ్‌రెడ్డి నిబంధ నల ప్రకారమే చర్యలు తీసుకున్నామని వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి వినతి పత్రాన్ని పరిశీ లించి చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలని రిజిస్ట్రార్‌ను ఆదే శిస్తూ తదుపరి విచారణను మార్చి 12కు వాయిదా వేశారు.
టాయిలెట్ల నిర్మాణం ఎందుకు ఆగింది? రాష్ట్ర సర్కార్‌ను ప్రశ్నించిన హైకోర్టు
జోగులాంబ గద్వాల జిల్లాలోని మల్దకల్ జూనియర్ కాలేజీతో పాటు ఉండవల్లి జిల్లా పరిషత్ హైస్కూలులో విద్యార్థుల కోసం తలపెట్టిన మరుగుదొడ్ల నిర్మాణం ఎందుకు ఆగిందని ప్రశ్నిస్తూ పూర్తి వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై మూడు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్, ఇంటర్మీడియట్ విద్యాకమిషనర్, జిల్లాకలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి, మల్దకల్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్, ఉండవల్లి జడ్పీ పాఠశాల ప్రధానోపాధ్యాయులకు నోటీసులు జారీ చేసింది. ఉండవల్లి జిల్లా పరిషత్ హైస్కూలు భవనం, మరుగుదొడ్ల నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయిన విషయంపై ఒక తెలుగు దిన పత్రికలో వచ్చిన కథనాన్ని ఆధారంగా చేసుకుని ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన పి. రఫీ హైకోర్టుకు లేఖ రాశారు. భవనం, మరుగుదొడ్ల నిర్మాణ పనులు రెండేండ్ల క్రితం ప్రారంభమైనప్పటికీ బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్ పనులు నిలిపివేశారని తెలిపారు. పాఠశాలలో 400 మంది విద్యార్థులు, 20 మంది ఉపాధ్యాయులు ఉన్నారని, ఎంపీ మల్లురవి రూ. కోటి మంజూరు చేస్తానని హామీ ఇచ్చినా అమలు కాలేదని ఎత్తిచూపారు. ఇదే విధంగా మల్దకల్ జూనియర్ కాలేజీలోనూ మరుగుదొడ్లు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మరో లేఖలో వివరించారు. ఈ రెండు లేఖలను ప్రజాహిత వ్యాజ్యాలుగా స్వీకరించిన చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం విచారణ చేపట్టింది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
అక్రమాలపై వివరణ ఇవ్వండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



