యూపీలోని బరేలీ జిల్లా ఉన్నతాధికారులకు ధిక్కార నోటీసులు
పిటిషనర్‌పై బలవంతపు చర్యలు తీసుకోవద్దు : అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు
లక్నో : యూపీలోని బరేలీ జిల్లా మొహమ్మద్ గంజ్ గ్రామంలో ఒక ఖాళీ ఇంట్లో నమాజ్ నిర్వహణను అడ్డుకున్నారన్న ఆరోపణలపై అలహాబాద్ హైకోర్టు.. అధికారులకు ధిక్కార నోటీసులు పంపింది. ఈ నోటీసులు అందుకున్నవారిలో బరేలీ జిల్లా మేజిస్ట్రేటు అవినాశ్ సింగ్, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనురాగ్ ఆర్యలు ఉన్నారు. కొందరు ముస్లింలను ఒక ఖాళీ ఇంట్లో నమాజ్ చేయకుండా అడ్డుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈ వ్యవహారంలో పిటిషనర్‌గా ఉన్న తారిక్ ఖాన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి బలవంత చర్యలు తీసుకోరాదంటూ న్యాయస్థానం తాత్కాలిక ఆదేశాలు కూడా జారీ చేసింది.
న్యాయమూర్తులు జస్టిస్ అతుల్ శ్రీధరన్, జస్టిస్ సిద్ధార్థ నందన్‌లతో కూడిన ధర్మాసనం.. సంబంధిత చట్టం ఆధారంగా అధికారులపై విచారణను ప్రారంభించింది. ఈ కేసును తదుపరి విచారణ కోసం మార్చి 11కి వాయిదా వేసిన న్యాయస్థానం.. ఆ రోజున జిల్లా మేజిస్ట్రేటు, పోలీసు అధికారి తమ వివరణలు సమర్పించాలని ఆదేశించింది. ఈ వివాదం గతనెల 16న జరిగిన ఘటనకు సంబంధించింది. మొహమ్మద్‌గంజ్ గ్రామంలో రేష్మా ఖాన్‌కు చెందిన ఒక ఇంట్లో నమాజ్ చేస్తున్న సమయంలో ముస్లింలను పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ గుమిగూడటం వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్తూ పలువురిని అదుపులోకి తీసుకున్నారు. నలుగురిని అరెస్ట్ చేసి తర్వాత విడుదల చేశారు.
”నమాజ్ నిర్వహించేందుకు నేనే అనుమతిచ్చాను. ప్రార్థనలు పూర్తిగా ఇంటి ప్రాంగణంలోనే జరిగాయి” అని ఇంటి యజమాని రేష్మా ఖాన్ తెలిపారు. ఈ ఘటనపై బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. యూపీలో ప్రయివేటు ఆస్తి పరిధిలోనే ప్రార్థనలు జరిగితే.. మత ప్రార్థనా సమావేశాలకు ప్రత్యేక అనుమతి అవసరం లేదని గతనెల 27న కోర్టు ఇచ్చిన తీర్పును పిటిషనర్లు పేర్కొన్నారు. ”జనవరి 27న వెలువడిన తీర్పు ప్రకారం ప్రయివేటు ఆస్తిలో ప్రార్థనలు చేయవచ్చని కోర్టు స్పష్టంగా చెప్పింది. మేమూ మైనారిటీ వర్గమే. కాబట్టి ఆ నిబంధనలు మాకూ వర్తించాలి. కోర్టు ఇచ్చిన స్టే వల్ల ఇప్పటివరకు మాకు రక్షణ లభించింది. అందుకే మేము మళ్లీ ఆ ఇంట్లో ప్రార్థన లు ప్రారంభించాం” అని కేసుకు సంబంధించిన పిటిషనర్ తారిక్‌ఖాన్ చెప్పారు.



