– ఇప్పటికే రూ.7 కోట్ల దుర్వినియోగంపై ఆరోపణలు
– ఐదేండ్లుగా హైదరాబాద్‌లో తిష్ట
– జీఓ 42తో వారికనుకూలంగా ప్రొసీడింగ్స్
– విద్యాశాఖను తప్పుదోవ పట్టిస్తున్న కొత్త బాస్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
విద్యాశాఖలో జీఓలు, ప్రొసీడింగ్స్‌పై మరోసారి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఐదేండ్ల క్రితం జీఓ 42ను మార్ఫింగ్ చేసి, అర్థాలు మార్చి, ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రొసీడింగ్స్‌తో ఇతర జోన్‌ల అధ్యాపకులకు హైదరాబాద్‌లో పోస్టింగ్ ఇచ్చారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. నాడు రూ.7 కోట్లు దుర్వినియోగం అయినట్టు విమర్శలు వచ్చాయి. ఆ క్రమంలో జీవో 42ను అడ్డం పెట్టుకుని మరోసారి 27 శాతం అధికంగా యూజీసీ హెచ్‌ఆర్‌ఏ ఎక్స్‌టెన్షన్ రూపంలో దోపిడీ చేసేందుకు కొత్త బాసు ఐఏఎస్ అధికారులనే తప్పుదోవ పట్టిస్తున్నట్టు తెలుస్తున్నది.
2001లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ అటానమస్ కళాశాలల్లో యూజీసీ నిధుల వినియోగం, విధి విధానాలు, బోధన, పరిశోధనా విభాగాల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు వీలుగా జీవో 42ను జారీ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఒకే జోన్‌లోని ఇతర ప్రభుత్వ బోధనా సిబ్బందిని ఐదేండ్ల పాటు డిప్యూటేషన్‌పై పని చేయించుకునే వెసులుబాటును ఈ జీఓ కల్పించింది. ఈ జీఓను 2013 నుంచి అమలు చేస్తున్నారు. మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ వంటి సబ్జక్ట్‌లకు మాత్రం ఆ జోన్‌లలో అర్హులైన అధ్యాపకులు లేకుంటే.. ఇతర జోన్‌లలో పనిచేసే ప్రభుత్వ అధ్యాపకులను డిప్యూటేషన్‌పై తీసుకునేలా ఇందులో మినహాయింపు ఉంది. 2014 నుంచి తెలంగాణలో ఈ జీఓను అమలు చేయలేదు. తిరిగి 2020లో ఉన్నతాధికారుల చొరవతో జీఓకు కొత్త అర్థాలు చెప్పి నిబంధనలకు విరుద్ధంగా ఇతర జోన్‌లకు చెందిన 65మంది వివిధ సబ్జెక్టుల అధ్యాపకులకు ఆర్డర్లు ఇచ్చారు. అయితే జీఓలో ఉన్న డిప్యూటేషన్ పదాన్ని మాయం చేసి.. దాని స్వరూపాన్ని మార్చేశారు. తత్ఫలితంగా బదిలీలపై నిషేధం కూడా మాయమైందని.. ఆ 65 మందికి హైదరాబాద్ అటానమస్ కళాశాల్లలో పోస్టింగ్‌లు ఇస్తూ ప్రొసీడింగ్స్‌లోని భాష ఉపయోగించారని నాడు పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ మార్పుకు ఆర్థికశాఖ అనుమతి లేకుండా, ఉన్నత విద్యా కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లకుండానే బదిలీలు పూర్తయ్యాయని వినికిడి.
2020లో ఇలా పోస్టింగ్ అయిన వారిని తిరిగి కొనసాగించేలా మరోసారి కుట్ర చేస్తున్నట్టు సమాచారం. విద్యాశాఖలోని ఓ ముఖ్య అధికారి మహిళా ఐఏఎస్ అధికారులకు తప్పుడు సమాచారం ఇస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. విద్యాశాఖను ముఖ్యమంత్రే స్వయంగా నిర్వహిస్తుండగా, ఆయన్నే మోసం చేసే విధంగా ఇద్దరు అధ్యాపకులకు ఓడీల రూపంలో అభయమిచ్చినట్టు తెలుస్తున్నది. రెండేండ్ల క్రితం జీఓ 42 ప్రకారం నియమించిన ఒక అధ్యాపకున్ని గడువు తీరకుండానే రిలీవ్ చేసి ఖైరతాబాద్‌లో పోస్టింగ్ ఇచ్చి, ఇతర ప్రాంతాల్లో ఇదే జీఓ ప్రకారం పనిచేసే కొంత మందికి మాత్రం గడువు సాకు చూపి సాధారణ బదిలీల్లో కూడా అవకాశమివ్వలేదనే చర్చ ఉంది. ఐడేండ్లు గడిచి 15 రోజులైనా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే దాన్ని కూడా అడ్డం పెట్టుకుని రీపాట్రియేషన్ ఆపేసి హైదరాబాద్‌లోనే డిప్యూటేషన్ అధ్యాపకులను కొనసాగిచాలని కుట్ర చేస్తున్నారని.. అర్హులైన అధ్యాపకులు ఆందోళన చెందుతున్నారు. విద్యాశాఖలో నెలకొన్న అవకతవకలు, ఇష్టారాజ్యంగా జరుగుతున్న నియామకాలు, ఆశ్రిత పక్షపాతాలపై ముఖ్యమంత్రి స్పందించాలని రాష్ట్రంలోని ఆయా కళాశాలల అధ్యాపకులు కోరుకుంటున్నారు.
ఎక్స్‌టెన్షన్ రూపంలో మళ్లీ దోపిడీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



