Friday, February 6, 2026
E-PAPER
Homeజాతీయంమేఘాలయ బొగ్గుగనిలో పేలుడు

మేఘాలయ బొగ్గుగనిలో పేలుడు

- Advertisement -

18మంది కూలీలు మృతి
గాయపడిన ఒకరిని ఆస్పత్రికి తరలింపు
చిక్కుకుపోయిన మరికొంత మంది


షిల్లాంగ్‌ : మేఘాలయలోని తూర్పు జైంతియా హిల్స్‌ జిల్లాలోని బొగ్గుగనిలో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 18 మంది కూలీలు ప్రాణాలు కోల్పోయారు. ఓ వ్యక్తి గాయపడగా అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో గనిలో ఎంత మంది చిక్కుకుపోయారో తెలియాల్సి ఉంది. పోలీసులు, రాష్ట్ర డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ నోంగ్రాంగ్‌ తెలిపిన వివరాల ప్రకారం… ఉదయం థాంగ్స్కు ప్రాంతంలోని బొగ్గుగనిలో తవ్వకాలు చేపడుతున్న సమయంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 18 మంది కూలీలు మృతి చెందారు. ఒకరు గాయపడగా అతడిని మొదట సుత్‌ంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం షిల్లాంగ్‌లోని ఆస్పత్రికి తరలించినట్టు తూర్పు జైంటియా హిల్స్‌ పోలీసు సూపరింటెండెంట్‌ వికాస్‌ కుమార్‌ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో మరికొంత మంది గనిలోనే చిక్కుకుపోయినట్టు సమాచారం. వీరంతా అసోంకు చెందినవారిగా తెలుస్తోంది.

ఘటనా స్థలంలో రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ గనిని అక్రమంగా నిర్వహిస్తున్నట్టు అనుమానాలు ఉన్నాయి. 2014లో, నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) మేఘాలయలో రాట్‌-హోల్‌ బొగ్గు తవ్వకం, ఇతర అశాస్త్రీయ మైనింగ్‌ పద్ధతులను నిషేధించారు. అలాగే పర్యావరణ నష్టం, కార్మికుల భద్రతా సమస్యల కారణంగా నిషేధం విధించబడింది. రాట్‌-హోల్‌ మైనింగ్‌ అంటే చాలా ఇరుకైన సొరంగాలను తవ్వడం. సాధారణంగా 3-4 అడుగుల ఎత్తు ఉంటుంది. బొగ్గును తీయడానికి కార్మికులు ఈ సొరంగాల్లోకి ప్రవేశిస్తారు. ఈ సొరంగాలు చాలా ఇరుకుగా, ఒకసారి ఒక వ్యక్తి మాత్రమే వాటిలోకి ప్రవేశించగలడు. అయితే సుప్రీంకోర్టు ఆ తరువాత ఈ నిషేధాన్ని సమర్థించింది, శాస్త్రీయ, నియంత్రిత , పర్యావరణ సురక్షితమైన నియమాల ప్రకారం మాత్రమే మైనింగ్‌ను అనుమతించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -