నవతెలంగాణ-హైదరాబాద్: ఇస్లామాబాద్ జి-11 ప్రాంతంలోని జిల్లా, సెషన్స్ కోర్టులో మంగళవారం భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు . ఈ పేలుడు శబ్దం ఆరు కిలోమీటర్ల వరకు వినిపించింది. అయితే తాజాగా కోర్టులో ఆవరణలో బాంబు పేలుళ్లులను నిరసిస్తూ ఆ దేశవ్యాప్తంగా న్యాయవాదలు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇస్లామాబాద్ బార్ కౌన్సిల్(IBC), రావల్పిండి బార్ అసోషియేషన్(RDBA) ఈ బాంబు దాడిని తీవ్రంగా ఖండించాయి. న్యాయానికి చిహ్నమైన కోర్టు ఆవరణలో దాడులు జరగడం సిగ్గుచేటని బార్ కౌన్సిల్ విమర్శించింది. న్యాయ స్థానాలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ఈ దాడిని వ్యతిరేకిస్తూ దేశంలోని అన్నికోర్టుల్లో విధులను బహిష్కరించాలని పిలుపునిచ్చింది.
నవంబర్ 12 నుంచి 14 పాక్ రాజధాని ఇస్లామాబాద్ వ్యాప్తంగా కోర్టు విధులను బహిష్కరిస్తున్నామని ప్రకటించారు. అదే విధంగా శాంతియుత నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని తెలిపారు. దాడిపై పారదర్శక దర్యాప్తును బార్ కౌన్సిల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. విధుల బహిష్కరణలో భాగంగా ఏ న్యాయవాది కూడా కోర్టు విధులకు హాజరుకారని స్పష్టం చేశారు. బాంబు పేలుళ్లలో మృతి చెందిన వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.



