– 13 మంది మృతి
– పారామిలటరీ కేంద్రానికి సమీపంలో ఘటన
ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌లోని క్వెట్టా ప్రాంతం భారీ పేలుళ్లతో దద్దరిల్లింది. అక్కడే కాల్పుల మోత వినిపించింది. ఫ్రాంటియర్ కోర్ కేంద్ర కార్యాలయం సమీపంలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆ భద్రతా సిబ్బంది లక్ష్యంగా దాడి జరిగినట్టు తెలుస్తోంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. బలోచిస్థాన్‌లోని క్వెట్టా నగరంలో పారామిలిటరీ బలగాలకు చెందిన ఫ్రాంటియర్ కోర్ కేంద్ర కార్యాలయం సమీపంలో పేలుళ్ల ఘటన చోటుచేసుకుంది. దాంతో దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఇండ్లు, భవనాల కిటికీ అద్దాలు పగిలిపోయాయి. అప్పటికే ఆందోళన చెందుతున్న ప్రజలకు కాల్పుల మోత వినిపించింది. ఈ వరుస ఘటనలు స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించాయి. దాడులకు పాల్పడిన వారిని గుర్తించేందుకు బలగాలు గాలింపు చేపట్టాయి. అత్యంత తీవ్రతతో జరిగిన పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు జరుగుతోంది. క్షతగాత్రులను వెంటనే దగ్గర్లోని ఆస్పత్రులకు తరలించారు. దాంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితిని విధించారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 13 మంది ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. 32 మంది గాయపడ్డారు. ఈ నెల ప్రారంభంలో క్వెట్టాలో బలూచిస్థాన్ నేషనల్ పార్టీ వ్యవస్థాపకుడు అతావుల్లా మెంగల్ వర్థంతి నేపథ్యంలో కూడా ఆత్మాహుతి దాడి జరిగింది. ఆ ఘటనలో 11 మంది మరణించగా, సుమారు 18 మంది గాయపడ్డారు.