కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహిస్తాం
రాష్ట్ర ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ మంత్రి (జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి) జూపల్లి కృష్ణారావు
నవతెలంగాణ – ముధోల్
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈ నెల 6వ తేదీన బాసర పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి శుక్రవారం పరిశీలించారు.
ముందుగా బాసర చేరుకున్న మంత్రులకు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిలతో పాటు అధికారులు పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వేద పండితులు మంత్రులకు ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఆలయ అభివృద్ధి పనులు చేపట్టబోయే ప్రాంతాల వివరాలను మంత్రులకు వివరించారు. ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేయనున్న ప్రదేశాలను మంత్రులు పరిశీలించి, అధికారులకు కీలక సూచనలు చేశారు. సీఎం పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు.
అనంతరం రాజన్న అతిథి గృహంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బాసర అభివృద్ధి పనులకు సంబంధించి రూ.300 కోట్లతో దేవాలయాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరుస్తామని తెలిపారు. దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు.
అలాగే గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో ఘనంగా నిర్వహించేలా చర్యలు చేపడతామని వెల్లడించారు. ఈ నెల 6న ముఖ్యమంత్రి చేతుల మీదుగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరుగనున్నాయని తెలిపారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ముధోల్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు పవార్ రామారావు పటేల్, వెడ్మా బొజ్జు పటేల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఏఎస్పీలు సాయి కిరణ్, ఉపేంద్ర రెడ్డి, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, భైంసా మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి, ఆలయ ఈవో విజయరామారావు, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.



